Indian Photo Journalist : తాలిబన్ల దాడిలో భారతీయ జర్నలిస్ట్ మృతి

ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లకు, అక్కడి భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న భీకర పోరును చిత్రీకరించేందుకు వెళ్లిన ప్రముఖ భారతీయ జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీ మరణించారు.

Indian Photo Journalist : తాలిబన్ల దాడిలో భారతీయ జర్నలిస్ట్ మృతి

Danish (1)

Indian Photo Journalist ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లకు, అక్కడి భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న భీకర పోరును చిత్రీకరించేందుకు వెళ్లిన ప్రముఖ భారతీయ జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీ మరణించారు. ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్‌ట‌ర్స్‌కు ప‌ని చేస్తున్న ముంబైకి చెందిన 40 ఏళ్ల డానిష్ సిద్ధిఖీ.. కొద్ది రోజులగా ఆఫ్ఘానిస్తాన్ స్పెష‌ల్ ఫోర్సెస్ వెంట ఉంటూ అక్క‌డి ప‌రిస్థితిపై రిపోర్ట్ చేస్తున్నారు. గురువారం రాత్రి కందహార్ ఫ్రావిన్స్ లోని స్పిన్ బోల్డాక్ లోని ప్ర‌ధాన మార్కెట్ ప్రాంతాన్ని ఆఫ్ఘాన్ ప్ర‌త్యేక ద‌ళాలు త‌మ ఆధీనంలోకి తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో తాలిబ‌న్లు ఫైరింగ్ జ‌రిపారు.

తాలిబన్ల కాల్సుల్లో సిద్దిఖీతో పాటు ఓ సీనియ‌ర్ ఆఫ్ఘానిస్తాన్ ఆఫీస‌ర్ కూడా మృతి చెందారు. డానిష్ సిద్దిఖీ మరణించిన విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో భారతదేశ రాయబారి ఫరీద్ మముంద్​జాయ్​ శుక్రవారం కన్ఫర్మ్ చేశారు. సిద్ధిఖీ మరణం తీవ్ర విచారకరమని ఫరీద్ పేర్కొన్నారు. అదృష్టవశాత్తూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానంటూ ట్వీట్‌ చేసిన మూడురోజుల్లోనే ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని రేపింది.

డానిష్ సిద్దిఖీ టెలివిజన్ న్యూస్ కరస్పాండెంట్‌గా తన వృత్తిని ప్రారంభించి, తరువాత ఫోటో జర్నలిస్టుగా మారారు. ఇండియాటుడే గ్రూప్‌లో కొంతకాలం కరస్పాండెంట్‌గా కూడా డానిష్ పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభ సమయాలను అతి సాహసోపేతంగా కవర్ చేసిన ఘనత సిద్ధిఖీ సొంతం. 2018లో రోహింగ్యా శ‌ర‌ణార్థుల స‌మ‌స్య అంశంలో ఆయ‌న చేసిన ప‌నికిగాను సిద్దిఖీకి పులిట్జ‌ర్ అవార్డు వ‌చ్చింది.

సిద్దిఖీ ఆకస్మికమరణంపై పలువురు జర్నలిస్టులు, ఇతర మీడియా మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డానిష్ ఓ అద్భుత‌మైన జ‌ర్న‌లిస్టు. మంచి భ‌ర్త‌, తండ్రి, అంత‌కుమించి మంచి స‌హ‌చ‌రుడు. ఇలాంటి క‌ష్ట స‌మ‌యంలో సిద్దిఖీ కుటుంబానికి అండ‌గా ఉంటాం అని రాయ్‌ట‌ర్స్ ప్రెసిడెంట్ మైకేల్ ఫ్రైడెన్‌బెర్గ్‌, ఎడిట‌ర్ ఇన్ చీఫ్ అలెజాండ్రా గాలోని ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

మరోవైపు, కాందహార్ సహా ఆఫ్ఘానిస్తాన్ మ‌ళ్లీ తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్తుండ‌టంతో అక్క‌డి కాన్సులేట్‌లోని 50 మంది అధికారులు, దౌత్య‌వేత్త‌ల‌ను భార‌త ప్ర‌భుత్వం గత శనివారం ప్రత్యేక విమానంలో సుర‌క్షితంగా ఢిల్లీకి తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే.