K.S. Eshwarappa : బీజేపీ బలం పెరిగింది..టచ్ చేస్తే తిరగబడండి!

బీజేపీ సీనియ‌ర్ నేత, క‌ర్నాట‌క పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప..పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్యలు చేసి వివాదానికి తెర‌లేపారు.

K.S. Eshwarappa : బీజేపీ బలం పెరిగింది..టచ్ చేస్తే తిరగబడండి!

Eshwarappa

K.S. Eshwarappa బీజేపీ సీనియ‌ర్ నేత, క‌ర్నాట‌క పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప..పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్యలు చేసి వివాదానికి తెర‌లేపారు. ఆదివారం తన సొంత జిల్లా శివమొగ్గలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఈశ్వరప్ప పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ..దేశంలో బీజేపీ కార్య‌క‌ర్త‌లను ఎవ‌రూ తాకేందుకు కూడా భ‌య‌ప‌డే స్ధాయిలో పార్టీ ప‌టిష్టంగా మారింది. గతంలో కేరళలో ఆర్ఎస్ఎస్ శాఖను ప్రారంభించడానికి ఎవరైనా ఆర్ఎస్ఎస్ నేతలు అక్కడికి వెళ్తే వారిపై దాడులు జరిగేవి. అప్పుడు మనకు అంత శక్తి ఉండేది కాదు. సంయమనంతో వ్యవహారించాల్సిందిగా సంఘ్ పరివార్ పెద్దలు మనకు చెప్పేవారు, అందువల్ల మనం మౌనంగా ఉండిపోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బీజేపీ ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదిగింది. మ‌న మ‌హిళ‌లపై లైంగిక దాడులు జ‌రుగుతున్నా, గోవులపై దాడుల‌కు పాల్ప‌డుతున్నా మ‌నం మౌనంగా భరించాలా అని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఈశ్వరప్ప ప్ర‌శ్నించారు.

ప్రస్తుతం బీజేపీ కార్యకర్తలను ఎదుర్కోవడానికి ఎవరికీ సాహసం లేదన్నారు. బీజేపీ ప్ర‌తినిధులు గ్రామ‌స్ధాయి నుంచి ప్ర‌ధాని కార్యాల‌యం వ‌ర‌కూ అన్ని స్ధాయిల్లో ఉన్నార‌ని ఏం జ‌రిగినా మౌనంగా ఉండే రోజులు పోయాయ‌ని వ్యాఖ్యానించారు. తాము ఎవ‌రి విష‌యాల్లో త‌ల‌దూర్చ‌బోమ‌ని, త‌మ‌కు స‌మ‌స్య‌లు ఎదురైతే బ్ర‌హ్మ చెప్పినా విన‌బోమ‌ని అన్నారు. మ‌న సైనికుల‌ను చంపుతున్నా ఎవ‌రూ మాట్లాడ‌ని రోజుల‌కు కాలం చెల్లింద‌ని, ఇంత‌కింతా ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను  మంత్రి కోరారు. మిమ్మల్ని ఎవరు టచ్ చేసినా లేదా మీపై దాడికి దిగినా వెంటనే తిరగబడండి… ఒకరు కర్రతో కొడితే అదే కర్రతో వారిపై రెండిచ్చుకోండి అంటూ కార్యకర్తలకు ఈశ్వరప్ప సూచించారు. కార్య‌క‌ర్త‌ల స‌మ‌క్షంలో మంత్రి ఈశ్వ‌ర‌ప్ప రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేయ‌డం పెను దుమారం రేపింది. ఆయనను కేబినెట్ నుంచి తొలగించాలని లేదా ఆయన రాజీనామా చేయాలనీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కాగా, ఈశ్వరప్ప గతంలో కూడా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

అయితే తన వ్యాఖ్యలను ఈశ్వరప్ప సమర్థించుకున్నారు. విపక్షాల విమర్శల నేపథ్యంలో ఈశ్వరప్ప మీడియాతో మాట్లాడుతూ.. తన మాటలకు కట్టుబడి ఉంటానని చెప్పడం ద్వారా తన ప్రకటనను సమర్థించుకున్నాడు. తన వ్యాఖ్యలు ఎవరినీ రెచ్చగొట్టడానికి ఉద్దేశించబడినవి కాదన్నారు. తన ఉద్దేశ్యం ఏళ్లుగా పార్టీ ఎలా అభివృద్ధి చెందిందో తెలియజేయడమేనని తెలిపారు. తమ కార్యకర్తలపై దాడి జరిగినప్పుడు తాము నిశ్శబ్దంగా కూర్చోవాలని మీరు అనుకుంటున్నారా అని ఈశ్వరప్ప ప్రశ్నించారు. తాము ఇటీవల కొన్నేళ్లల్లో చాలా మంది కార్యకర్తలను కోల్పోయామని… ఆవులను రక్షించడానికి వెళ్ళినప్పుడు తమ కార్యకర్తలు కార్మికులు చంపబడ్డారని.. అలాంటి హత్యల కారణంగానే కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయిందని ఈశ్వరప్ప అన్నారు.