కుంభమేళాపై స్పందించిన మోడీ

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాను ప్రతీకాత్మకంగా నిర్వహించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

కుంభమేళాపై స్పందించిన మోడీ

Kumbh Mela Should Now Only Be Symbolic To Strengthen Covid Fight Pm

Kumbh Mela దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళాను ప్రతీకాత్మకంగా నిర్వహించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. కుంభమేళాను ప్రతీకాత్మకంగా నిర్వహించడం వలన కరోనా మహమ్మారి వ్యాప్తిని నిలువరించవచ్చు అని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు.

గతవారం కుంభమేళాలో పాల్గొన్న చాలా మంది సాధువులకు కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. దీంతో ఈ కుంభమేళాపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ.. కుంభమేళా ఇప్పుడు సింబాలిక్‌గా మాత్రమే ఉండాలని కోరారు. కుంభమేళా సందర్భంగా… పెద్ద ఎత్తున ప్రజలు గుంపులుగా ఉండటంపై హిందు ధర్మ ఆచార్య సభ అధ్యక్షుడు స్వామి అవధేశానంద్ గిరి జీ మహరాజ్‌తో ఫోన్ లో మాట్లాడినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన ట్వీట్‌లో తెలిపారు. కరోనా సోకిన సాధువులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోడీ వారికి హామీ ఇచ్చారు. ఇప్పటికే రెండు రాజ స్నానాలు(షాహీ స్నాన్) పూర్తి అయినందున.. తదుపరి కార్యక్రమాలను భక్తులెవరూ లేకుండా కేవలం లాంఛనప్రాయంగా కొనసాగించాలని స్వామి అవధేశానంద్ గిరిని ప్రధాని కోరారు.

ఏప్రిల్‌ 1న మొదలైన కుంభమేళా ఈనెల 30వరకూ జరగనుంది. ఇదిలాఉంటే,కరోనా వ్యాప్తి నేపథ్యంలో కుంభమేళా ముగిసిందని నిరంజని అఖాడా కార్యదర్శి రవీంద్ర పూరి తాజాగా చేసిన ప్రకటనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రధాన షాహి స్నాన్ ముగిసింది… మన అఖాడాలో చాలా మంది కరోనా పాజిటివ్ అని తేలింది… కరోనా సంక్షోభం నేపథ్యంలో కుంభమేళా ముగిస్తున్నాం అని రవీంద్ర పూరి చేసిన ప్రకటనపై మరో ఇతర అఖాడాలకు చెందిన సాధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కుంభమేళా ముగింపుపై ప్రకటన చేసే హక్కు ఏ ఒక్కరికీ లేదని, అది ముఖ్యమంత్రి మాత్రమే చేయాలని నిర్వాణి అఖాడా అధ్యక్షుడు మహంత్ ధర్మదాస్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఇతర అఖాడాల సమ్మతి లేకుండా కుంభమే ముగిసిందంటూ ప్రకటించి భక్తులలో గందరగోళం సృష్టించిన నిరంజని అఖాడా పరిషత్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి. లేదంటే నిరంజని అఖాడాను దూరం పెట్టాల్సి ఉంటుంది’ అని మహంత్ ధర్మదాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కాగా, హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాలో ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 14 మధ్య 1700 మందికి పైగా… కరోనా బారిన పడ్డారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హిందు కార్యక్రమం కావడంతో… దీన్ని ఇంకా కొనసాగిస్తే… కరోనా కేసులు మరింత పెరుగుతాయనే విమర్శలు వస్తున్నాయి. హరిద్వార్, తెహ్రీ, డెహ్రాడూన్, రిషికేష్ మొత్తం కలిపి కుంభమేళా 670 హెక్టార్లలో జరుగుతోంది. మొత్తం 48.51 లక్షల మంది ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 14 మధ్య రెండేసి షాహీ స్నానాలు చేశారు. వారిలో చాలా మంది మాస్కులు ధరించలేదు. సోషల్ డిస్టాన్స్ సరిగా అమలు కాలేదు. పోలీసులు కూడా ఏమీ చెయ్యలేకపోయారు. ఇప్పుడు ప్రధానమంత్రి స్వయంగా కోరారు కాబట్టి… ఇక కుంభమేళాకు వచ్చే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉంది.