Lumpy Disease..killed 14,000 Cattle : ‘లంపీ’ చర్మవ్యాధితో .. రాజస్థాన్‌లోనే 14,000 ఆవులు మృతి
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పశువులను లంపీ చర్మవ్యాధి పట్టిపీడిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా పశువులు మృతి చెందుతున్నాయి. ఒక్క రాజస్థాన్‌లోనే 14,000 ఆవులు మృత్యువాత పడ్డాయి.
Lumpy skin disease has killed 14,000 cattle
Lumpy skin disease has killed 14,000 cattle : దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని పశువులను లంపీ చర్మవ్యాధి పట్టిపీడిస్తోంది. ఈవ్యాధి గోమాతలను కూడా వదలటంలేదు. దీంతో దేశవ్యాప్తంగా పలు ఆవులు మృతి చెందుతున్నాయి. ఒక్క రాజస్థాన్‌లోనే 14,000 ఆవులు మృత్యువాత పడ్డాయి. రాజస్థాన్ లోని 23 జిల్లాల్లో గురువారం (ఆగస్టు11,2022) నాటికి దాదాపు 14,000 పశువులు మృతి చెందగా వాటిలో ఎక్కువగా ఆవులే ఉన్నాయని అధికారులు తెలిపారు. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో నిర్వహించే పశువుల సంతలపై నిషేధం విధించింది. రాజస్థాన్‌తోపాటు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పశువులను లంపీ స్కిన్ డిసీజ్ వేధిస్తోంది.
ముఖ్యంగా గంగానగర్‌లో లంపీ స్కిన్ వ్యాధితో అత్యధికంగా 2,752 మరణాలు నమోదుకాగా..బార్మర్ 1,657, జోధ్‌పూర్ లో 1,691, బికనెర్‌లో 1156, జరోల్‌లో 1150 పశువులు కారణంగా ప్రాణాలు కోల్పోయాయి. ఈ అంశంపై రాజస్థాన్ పశుసంవర్థక శాఖ కార్యదర్శి పిసి కిషన్ మాట్లాడుతూ మరణాల రేటు తగ్గుముఖం పట్టిందని..ఇన్ఫెక్షన్ అదుపులో ఉందని తెలిపారు. రాష్ట్రంలో సోకిన 310,460 జంతువులలో 268649 మందికి చికిత్స అందించామని తెలిపారు. ఈ వ్యాధి ప్రాబల్యం అత్యధికంగా రాజస్థాన్‌లో ఉండగా.. గుజరాత్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, అండమాన్ నికోబార్, ఉత్తరాఖండ్‌లలోనూ వందల సంఖ్యలో పశు మరణాలు సంభవిస్తున్నట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి.
పశువుల్లో కాప్రిపాక్స్‌వైరస్ కారణంగా లంపీ స్కిన్ వ్యాధి సంభవిస్తుంది. ఇది గోట్‌పాక్స్, షీప్‌పాక్స్ కుటుంబానికి చెందిన వైరస్. ఈ వైరస్ సోకిన పశువులు జ్వరం బారినపడడంతోపాటు వాటి చర్మంపై గడ్డలు ఏర్పడుతాయి. వాటిపై రక్తాన్ని పీల్చే దోమలు, పురుగులు వాలి కుట్టినప్పుడు తీవ్ర రక్తస్రావం అవుతుంది. అనంతరం కొన్ని రోజుల్లోనే బరువు కోల్పోవడంతోపాటు పాల దిగుబడి తగ్గిపోతుంది.
వీటికితోడు శ్వాస, లాలాజల స్రావాలు కూడా మరింత ఎక్కువై పశువుల మరణానికి దారితీస్తుంది. ఇప్పటివరకు దీనికి ఎటువంటి చికిత్స లేనప్పటికి వ్యాధి నుంచి పశువులకు ఉపశమనం కలిగించేందుకు యాంటీబయోటిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇలా పశువుల్లో ప్రాణాంతకంగా మారిన ఈ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా మూగజీవాలను వేధిస్తోందని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.
ఇలా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పశువుల్లో తీవ్రంగా వ్యాపిస్తున్న లంపీ చర్మవ్యాధికి భారత వ్యవసాయ పరిశోధన మండలి కు చెందిన రెండు సంస్థలు స్వదేశీ టీకాను అభివృద్ధి చేశాయి. ఈ టీకాను వీలయినంత త్వరలో ఉత్పత్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఐసీఏఆర్ పరిధిలోని జాతీయ అశ్వ పరిశోధన కేంద్రం (హిసార్, హరియాణా), భారత పశువైద్య పరిశోధన సంస్థ (ఇజ్జత్‌నగర్, ఉత్తర్‌ప్రదేశ్)లు ‘లంపీ-ప్రోవాక్‌ఇండ్’ టీకాను అభివృద్ధి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పేర్కొంది. వీటిని సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి జరుగుతోందని వెల్లడించింది.
