బలపరీక్షకు ముందే : అజిత్ పవార్ రాజీనామా!

  • Published By: sreehari ,Published On : November 26, 2019 / 09:22 AM IST
బలపరీక్షకు ముందే : అజిత్ పవార్ రాజీనామా!

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేశారు. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలకు షాకిచ్చి రాత్రికి రాత్రే బీజేపీ జతకట్టిన అజిత్.. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బలపరీక్షకు ముందే అకస్మాత్తుగా అజిత్ రాజీనామా చేయడంపై రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ నెలకొంది.

సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. దీనిపై ఎన్సీపీ సహా కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బలపరీక్షలో ఎమ్మెల్యే బలబలాలను నిరూపించుకోవాలని ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే.

బలపరీక్షకు ముందే అజిత్ పవార్ రాజీనామా చేసినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు సీఎంగా ఫడ్నవీస్ మంగళవారం మధ్యాహ్నాం 3.30 గంటలకు మీడియా సమావేశంలో  అజిత్ పవార్ రాజీనామాకు సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై బుధవారం (నవంబర్ 27, 2019) బలపరీక్ష నిరూపించుకోవాల్సి ఉంది. ఈ విషయంలో బీజేపీ విశ్వాసంతో ఉండగా, ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలు తమకే ఎమ్మెల్యేల మద్దతు ఉందని, తమదే అధికారమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

ఇటీవలే, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై 24గంటల్లోగా బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బలపరీక్షను ప్రొటెం స్పీకర్ నిర్వహించాలని, ఓపెన్ బ్యాలెట్, ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోర్టు సూచించింది. 

ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జాయింట్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బలపరీక్షలో ఎలా నెగ్గాలనే అనేదానిపై వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.