రెండు స్కూల్స్ లోని 192మంది విద్యార్థులకు కరోనా

రెండు స్కూల్స్ లోని 192మంది విద్యార్థులకు కరోనా

Covid Positive కరోనా కేసులు దేశవ్యాప్తంగా క్రమంగా తగ్గుముఖంపట్టడంతో దాదాపు చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు తెరుచుకున్న విషయం తెలిసిందే. గత నెల నుంచి కేరళో 10,12వ తరగతి విద్యార్థులు స్కూల్స్ కి భౌతికంగా హాజరవుతున్నారు. అయితే ఇప్పుడు కేరళలోని స్కూల్స్ లో పెద్ద స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. మలప్పురం జిల్లాలోని రెండు స్కూల్స్ కి చెందిన 192మంది 10వ తరగతి విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. అదేవిధంగా దాదాపు 72మంది సిబ్బందికి వైరస్ సోకినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

మొదటగా ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్ గా తేలిందని.. కాంటాక్ట్ ట్రేసింగ్ లో భాగంగా ఆ తర్వాత ఒకరి నుంచి ఒకరికి వైరస్ సోకినట్లు మలప్పురం జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కే సఖీనా తెలిపారు. అదేవిధంగా అదే ఏరియాలోని మరో స్కూల్ లోని విద్యార్థులకు,స్టాఫ్ కి వైరస్ సోకిందని తెలిపారు. విద్యార్ధులకు కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో ఇవాళ జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు.

కాగా, కేరళలో కొత్త కరోనా కేసులు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సమయంలో పెద్ద ఎత్తున విద్యార్థులు కరోనా బారినపడ్డారన్న విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. కేరళలో ఇప్పటివరకు మొత్తంగా 9,68,438కరోనా కేసులు నమోదవగా 3,867 మరణాలు నమోదయ్యాయి. ఇక, టెస్ట్ ల సంఖ్యను భారీగా పెంచారు. ఈ నెల ప్రారంభంలో 10 శాతం ఉన్న టెస్ట్ పాజిటివిటీ రేటు ఫిబ్రవరి-6 నాటికి 7.18కి పడిపోయింది.