సైకిల్‌పై 1200 కిలోమీటర్ల ప్రయాణం.. గాయపడిన తండ్రిని ఎక్కించుకుని 15ఏళ్ల బాలిక సాహసం

  • Published By: Subhan ,Published On : May 20, 2020 / 02:46 PM IST
సైకిల్‌పై 1200 కిలోమీటర్ల ప్రయాణం.. గాయపడిన తండ్రిని ఎక్కించుకుని 15ఏళ్ల బాలిక సాహసం

అవసరం అన్నీ నేర్పుతుంది. పరిస్థితి పోరాడే సత్తా పెంచుతుంది అన్నట్లు.. ఢిల్లీ నుంచి బీహార్ లోని దర్భంగాకు దాదాపు 1200కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేసింది ఓ బాలిక. గాయపడిన తండ్రిని సైకిల్ పై ఎక్కించుకుని సొంతూరికి చేరుకుంది. అంత దూరం ప్రయాణం చేయడం ఫిజికల్ ఛాలెంజ్ మాత్రమే కాదు.. హైవేలు, సిటీ రోడ్ల మీద బాలికలకు, మహిళలకు అంత సేఫ్ కాదని తెలిసినా జ్యోతి తీసుకున్న డేరింగ్ నిర్ణయానికి సెల్యూట్ చెప్పాల్సిందే. 

ఏడో తరగతి చదువుతున్న ఆమెకు ఒకటే భయం.. రోడ్డుపూ ప్రయాణిస్తున్నప్పుడు అనుకోకుండా ఏదైనా వాహనం ఢీ కొట్టి యాక్సిడెంట్ అయితే ఎలా అని.. దారి పొడుగునా కనపడుతున్న వలస కార్మికులు వారిలో ధైర్యం నింపారట. మా తండ్రి ఢిల్లీలో ఆటో రిక్షా నడిపేవారు. లాక్‌డౌన్ ప్రకటించడంతో దాని యజమాని తనకు ఇచ్చేయమంటూ ఒత్తిడి చేశాడు. అప్పటికే కాలుకు గాయం అయి ఉన్నాడు నాన్న. 

ఇంటి యజమాని అద్దె కట్టాలని లేదంటే ఖాళీ చేసి పొమ్మని చెప్పాడు. ఆ పరిస్థితిలో అద్దె కట్టేంత డబ్బులు లేక 1200కిలోమీటర్ల ప్రయాణాన్ని సైకిల్ పై చేయాలని మే10న నిశ్చయించుకున్నారు. రూ.500తో ఒక సైకిల్ కొనుక్కున్నారు. మే 16న దర్భంగా చేరుకున్నారు. ముందుగా ట్రక్ డ్రైవర్ ని అడిగితే రూ.6వేలు అడిగాడు. అంతే డబ్బులు మా దగ్గర లేవని చెప్పినా వినలేదు. 

సైకిల్ పై చేస్తున్న ప్రయాణంలో పెట్రోల్ పంపులు, రిలీఫ్ క్యాంపుల దగ్గర ఓ రెండు, మూడు గంటలు ఆగే వాళ్లం. అక్కడే వాళ్లు ఇచ్చింది తినేవాళ్లం. చివరికి గ్రామం చేరేసరికి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. కానీ, గ్రామ లైబ్రరీలో క్వారంటైన్ లో ఉండమని సూచించారు. క్వారంటైన్ సెంటర్లో మహిళలు ఎవరూ లేకపోవడంతో జ్యోతిని మాత్రం ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు.