వాళ్లు రేపటి సూర్యున్ని చూడలేరు..: ఆఖరి అవకాశం అయిపోయింది.. ఇక ఉరే!

  • Published By: vamsi ,Published On : March 19, 2020 / 06:58 PM IST
వాళ్లు రేపటి సూర్యున్ని చూడలేరు..: ఆఖరి అవకాశం అయిపోయింది.. ఇక ఉరే!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు శుక్రవారం తెల్లవారుఝూమున ఉరిశిక్ష అమలు కానుంది. ఆఖరి గడియల్లో ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలంటూ.. దోషుల తరపున లాయర్ ఏపీ సింగ్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. లాయర్ ఏపీ సింగ్ వాదనల్లో లీగల్ పాయింట్ ఒక్కటీ లేదని స్పష్టం చేస్తూ.. డెత్ వారెంట్‌పై స్టే విధించలేమని చెప్పేసింది. దీంతో నలుగురు దోషులకు యథావిధిగా ఉరిశిక్ష అమలు కాబోతుంది.

ఈ సంధర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మీ క్లయింట్‌లు దేవుడి దగ్గరకు వెళ్లే టైమ్ దగ్గరపడింది. వాళ్లు రేపటి సూర్యున్ని చూడలేరు అని జడ్జి అన్నారు. పిటిషన్ దాఖలు చేసిన దోషుల తరపు న్యాయవాది ఏపీ సింగ్‌కి కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ‘లిఖితపూర్వక డాక్యుమెంట్ ఏదీ లేదు.. పార్టీల మెమో లేదు, అఫిడవిట్లు లేవు. అసలు ఈ పిటిషన్ దాఖలు చేయడానికి మీకు అనుమతి ఉందా..?’ అని కోర్టు ఆయనను ప్రశ్నించింది. అయితే కరోనా వైరస్ కారణంగా ఫోటో కాపీలు జతచేయలేదని సాధ్యపడలేదని ఏపీ సింగ్ బదులిచ్చారు. ఏపీ సింగ్ వాదనపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

‘చూడండి కోర్టులు విశాల దృక్పథంతో పనిచేస్తున్నాయి.. ఈ ఒక్కరోజే మీరు మూడు కోర్టుల చుట్టూ తిరిగారు. ఈ(మార్చి 19) రాత్రి 10గంటల సమయంలో మీ పిటిషన్‌పై విచారణ జరుపుతున్నాం.. కాబట్టి సాధ్యపడలేదు వంటి మాటలు చెప్పవద్దు’ అని కోర్టు చెప్పింది. హైకోర్టు నిర్భయ దోషుల స్టే పిటిషన్ కొట్టివేయడంతో.. పటియాలా హౌజ్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం శుక్రవారం(మార్చి 20) తెల్లవారుజామున 5గంటల 30నిమిషాలకు ఉరిశిక్ష అమలుకానుంది.

దీంతో ఉరి శిక్ష నుంచి తప్పించుకోవడానికి నిర్భయ నిందితులు చేసిన చివరి ప్రయత్నం విఫలం అయ్యింది. నిర్భయ దోషుల ఉరి ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడింది. చట్టంలోని లొసుగులను తమకు అనుకూలంగా మలుచుకొని వంతుల వారీగా న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకున్నారు. క్యూరేటివ్ పిటిషన్, క్షమాభిక్ష పిటిషన్, రివ్యూ పిటిషన్లను ఒక్కొక్కరుగా దాఖలు చేస్తూ శిక్షను ఆలస్యం చేశారు. అయితే చివరకు మాత్రం వారికి ఉరి తప్పట్లేదు. దేశమంతా వారి ఉరి కోసం ఎదురు చూస్తుంది. 

Also Read | శ్రీరామున్ని గుండెల్లో కొలుచుకోండి.. బాధగానే ఉంది కానీ తప్పదు