Independence day 2022: నోబెల్ బహుమతి సాధించి విశ్వవేదికపై సత్తాచాటిన భారతీయులు..

దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందరో ప్రముఖులు భారత్‌కు కీర్తి ప్రతిష్టలు అందించి పెట్టారు. విశ్వ వేదికపై భారత్ సత్తా చాటారు. అనేక రంగాల్లో ప్రపంచంలోనే అత్యున్నత నోబెల్ సాధించి పెట్టారు. భారతీయులతోపాటు, భారత సంతతికి చెందిన వాళ్లు ఈ జాబితాలో ఉన్నారు.

Independence day 2022: నోబెల్ బహుమతి సాధించి విశ్వవేదికపై సత్తాచాటిన భారతీయులు..

Independence day 2022: ‘నోబెల్’.. వివిధ విభాగాల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ బహుమతి ఇది. పలువురు భారతీయులూ నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. విశ్వ వేదికపై సత్తా చాటారు. భారత దేశంలో ఉంటున్న వారికే కాదు.. ఇక్కడ్నుంచి విదేశాలకు వలస వెళ్లిన భారతీయులను కూడా నోబెల్ వరించింది. స్వాతంత్రానికి ముందు.. స్వాతంత్రం తర్వాత కూడా మన వాళ్లు నోబెల్ బహుమతి సాధించారు. స్వాతంత్రం రావడానికి ముందు సాహిత్యంలో రవీంద్ర నాథ్ ఠాగూర్, ఫిజిక్స్‌లో సీవీ రామన్ నోబెల్ బహుమతి సాధించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మదర్ థెరిసా, అమర్త్య సేన్, కైలాష్ సత్యార్థి వంటి వారు నోబెల్ గెలుచుకున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మన దేశం నుంచి నోబెల్ బహుమతి గెలుచుకుని ప్రపంచ వేదికలపై సత్తా చాటిన మహనీయులను స్మరించుకుందాం.

Nobel Prize

మదర్ థెరిసా
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియాకు తొలి నోబెల్ అందించిన మహిళ మదర్ థెరిసా. ఆల్బేనియా దేశంలోని ‘స్కోయె’ పట్టణంలో 1910 ఆగస్టు 26న జన్మించారు. చిన్నతనం నుంచే దైవచింతనతో రోమన్ క్యాథలిక్ చర్చి వైపు ఆకర్షితురాలైన ఆమె, 1931లో ‘నన్’గా మారారు. వెంటనే భారతదేశంలోని కోల్‌కతా చేరుకున్నారు. 1948 వరకు కోల్‌కతాలోని సెయింట్ మేరీస్ హైస్కూల్‌లో ఉపాధ్యాయినిగా పనిచేశారు. ఆ తర్వాత వివిధ సేవలు నిర్వర్తించిన మదర్ 1946 సెప్టెంబర్‌లో సంఘసేవకు శ్రీకారం చుట్టారు. కోల్‌కతాలోని పేదలు నివసించే ప్రాంతాలలో తన సహాయ కార్యక్రమాలు ప్రారంభించి, మోతీజిల్ అనే మురికివాడలోని పిల్లలకు ఒక స్కూల్ ప్రారంభించి, అక్కడి పేదలకు సేవ చేయటం ప్రారంభించారు. అప్పటి నుంచి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ స్వతంత్ర ప్రతిపత్తి గల ‘మిషనరీస్ ఆఫ్ ఛారిటీ’ అనే సేవాసంస్థను నిర్వహించారు. ఈ సంస్థ ద్వారా మదర్ థెరిసా చేస్తున్న సేవలను గుర్తించిన నోబెల్ బహుమతి కమిటీ ఆమెకు 1979లో నోబెల్ శాంతి బహుమతిని అందించింది. దారిద్య్రంలో బాధపడేవారికి, రోగులకు, అనాథలకు, ఆదరణకు నోచుకోని వృద్ధులకు అందించిన నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఆమెకు నోబెల్ పురస్కారం ఇవ్వటం జరిగింది. అయితే, ఆమె ఏ దేశం తరఫున నోబెల్ బహుమతి అందుకుంది అనే దానిపై కొన్ని సందేహాలు మొదలయ్యాయి. దీనికి మదర్ సమాధానమిచ్చారు. ‘‘నా రక్తం ఆల్బేనియాది. నా పౌరసత్వం భారత్‌ది. నా విశ్వాసం క్యాథలిక్ మతానిది. నా వ్యక్తిత్వం ప్రపంచానిది. నా హృదయం జీసస్‌కు చెందినది’’ అని ఉన్నతమైన సమాధానమిచ్చారు థెరిసా. సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే అనారోగ్యానికి గురయ్యారు. చివరకు 1997 సెప్టెంబర్ 5న కోల్‌కతా నగరంలో కన్నుమూశారు.

Mother Teresa

అమర్త్య సేన్
స్వాతంత్ర భారతంలో దేశానికి మరో నోబెల్ బహుమతి సాధించిపెట్టిన ఆర్థిక నిపుణుడు, తత్వ శాస్త్రవేత్త అమర్త్య సేన్. ఆయనకు 1998లో మానవ అభివృద్ది సిద్ధాంతము, సంక్షేమ ఆర్థికశాస్త్రము, పేదరికానికి గల కారణాలు, పొలిటికల్ లిబరలిజంలలో చేసిన విశేష కృషికిగానూ నోబెల్ బహుమతి లభించింది. ఆయన పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో 1933 నవంబర్ 3న జన్మించారు. 1941లో ఢాకాలో ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసుకొన్నాడు. 1947లో దేశవిభజన తర్వాత భారతదేశానికి తిరిగివచ్చి విశ్వభారతి, ప్రెసిడెన్సీ కళాశాలలో చదివారు. కేంబ్రిడ్జిలోని ట్రినిటి కళాశాల నుంచి 1956లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నాడు. 1959లో పి.హెచ్.డి పట్టా పుచ్చుకున్నారు. పి.హెచ్.డి పూర్తికాగానే కోల్‌కతా విశ్వ విద్యాలయంలోనూ, ఢిల్లీలోని జాదవ్‌ పూర్ విశ్వ విద్యాలయంలోనూ, ఆ తర్వాత ఆక్స్‌ఫర్డ్ విశ్వ విద్యాలయంలోనూ అర్థశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు. సంక్షేమం, పేదరికం, నిరుద్యోగం వైపు అమర్త్యా సేన్ కృషి అమోఘమైనది. సంక్షేమ అర్థశాస్త్రం వైపు దృష్టి సారించి ప్రజలకు కనీస అవసరాలు ఎలాగో ప్రజాస్వామిక హక్కులు కూడా అంతే ముఖ్యమని చెప్పాడు. ప్రపంచంలోని అన్ని దేశాలు తమతమ రక్షణ బడ్జెట్ ను తగ్గించాలని హితవు పలికాడు. ప్రస్తుతం ఆయన అమెరికాలో నివసిస్తున్నారు.

Amartya Sen

 

కైలాష్ సత్యార్థి
స్వతంత్ర భారతంలో నోబెల్ బహుమతి సాధించిన మరో భారతీయుడు కైలాష్ సత్యార్థి. బాలల హక్కుల కోసం పోరాడుతున్నందుకుగాను, ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 2014లో మలాలా యూసఫ్ జాయ్‌తో కలిసి నోబెల్ బహుమతి అందుకున్నారు. సామాజిక ఉద్యమకారుడైన సత్యార్థి.. బాలల హక్కుల కోసం విశేష కృషి చేశారు. 1980లో ఆయన అధ్యాపక వృత్తిని వదులుకుని, బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్ (బానిసత్వ విముక్తి సంస్థ) అనే సంస్థకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ సమయంలోనే బచ్‌పన్ బచావో ఆందోళన్ స్థాపించి 80వేల మంది పిల్లల హక్కులు కాపాడేందుకు ఎంతో కృషి చేశారు. ఆయన చేసిన కృషికిగాను నోబెల్ శాంతి బహుమతి దక్కింది. కైలాష్ తన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని భారత జాతికి అంకితం చేశారు. ఈ బహుమతిని ‘రాష్ట్రపతి భవన్’ (రాష్ట్రపతి నివాసం) మ్యూజియంలో ఉంచారు. ఈ పతకం 18 క్యారెట్ల బంగారం మరియు 196 గ్రాముల బరువు ఉంటుంది. ప్రస్తుతం ఆయన అంతర్జాతీయంగా అనేక సామాజిక అంశాల రుగ్మతల నివారణకు కృషి చేస్తున్నారు.

Kailash Satyarthi

విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు
దేశంలో నివసిస్తున్న వారికే కాకుండా.. మన దేశం నుంచి వేరే దేశానికి వలస వెళ్లిన మరికొంతమంది ప్రముఖులకు కూడా నోబెల్ బహుమతులు దక్కాయి. హర్ గోవింద్ ఖొరానా, సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, వెంకీ రామకృష్ణన్, అభిజిత్ బెనర్జీకి నోబెల్ దక్కింది.
హర్ గోవింద్ ఖొరానా
శరీర ధర్మశాస్త్రం, మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతి సాధించిన భారతీయ సంతతి వ్యక్తి హర గోవింద్ ఖొరానా. ఆయన భారత్‌లో జన్మించినప్పటికీ అమెరికాలో ఉన్న సమయంలోనే నోబెల్ బహుమతి సాధించారు. హరగోవింద్ ఖొరానా పంజాబ్‌లోని రాయపూర్ గ్రామంలో 1922 జనవరి 9న జన్మించారు. లాహోర్‌లోని పంజాబ్ యూనివర్సిటీలో చదివారు. 1943లో బీఎస్సీ, 1945లో ఎమ్మెస్సీ పట్టాను పొందారు. అదే సంవత్సరంలో ఆయన ఇంగ్లండు వెళ్లి, లివర్‌పూల్ విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ 1948లో కర్బన రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా సాధించారు. 1952లో ఖొరానా కెనడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. తర్వాత 1960లో విస్కాన్‌సిన్‌లోని ఎంజైమ్‌ల పరిశోధన సంస్థలో చేరారు. జీవ కణాలలోని ప్రొటీన్లు నిర్వహించే విధులను నిర్ణయించే జన్యువుల కోడ్‌ను సంకేతాలను మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. ఖొరానా చేసిన అనేక పరిశోధనల ఫలితంగా ‘బయో టెక్నాలజీ’ అనే ప్రత్యేకమైన శాస్త్ర విభాగం ఏర్పడింది. శరీర ధర్మ శాస్త్రంలో ఆయన చేసిన కృషికిగాను 1968లో ఆయనకు నోబెల్ బహుమతి దక్కింది. తర్వాత 2011లో అమెరికాలో ఆయన మరణించారు.

Har Gobind Khorana

సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్
నోబెల్ బహుమతి అందుకున్న భారత సంతతి వ్యక్తుల్లో సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ ఒకరు. ఆయనకు భౌతిక శాస్త్రంలో 1983లో నోబెల్ బహుమతి దక్కింది. ఆయన అవిభక్త భారత్‌లో పంజాబ్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది)లో 1910, అక్టోబర్ 19న జన్మించారు. చంద్రశేఖర్ చెన్నైలోని హిందూ హైస్కూల్‌లో చేరారు. తరువాత చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతికశాస్త్రంలో బీఎస్సీ ఆనర్స్ పట్టా పొందారు. చంద్రశేఖర్ బీఎస్సీ చదివే రోజుల్లో ఆర్నాల్డ్ సోమర్‌ఫెల్ట్ అనే శాస్త్రజ్ఞుడి ఉపన్యాసానికి ఉత్తేజితుడయ్యాడు. ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో 1930లో ఇంగ్లండు వెళ్లి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ట్రినిటీ కాలేజీలో ప్రొఫెసర్ ఫౌలర్ వద్ద రీసెర్చి ప్రారంభించారు. అనంతరం ఆయనతో కలిసి నక్షత్రాలపై జరిపిన పరిశోధనకుగాను సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్‌కు నోబెల్ బహుమతి లభించింది. ఇద్దరూ కలిసి సంయుక్తంగా ఈ బహుమతి అందుకున్నారు. 1995 ఆగష్టు 21న అమెరికాలో మరణించారు.

Subrahmanyan Chandrasekhar

వెంకట రామన్ రామకృష్ణన్
నోబెల్ బహుమతి పొందిన మరో భారత సంతతి వ్యక్తి వెంకట రామన్ రామకృష్ణన్ అలియాస్ వెంకీ రామకృష్ణన్. జీవ రసాయన శాస్త్రంలో ఆయనకు 2009లో నోబెల్ బహుమతి లభించింది. రిబోసోమ్స్ నిర్మాణాన్ని కనుగొన్నందుకుగానూ 2009లో నోబెల్ పురస్కారాన్ని మరో శాస్త్రవేత్తతో కలిసి పంచుకున్నారు. తమిళనాడులోని చిదంబరంలో జన్మించిన వెంకట్రామన్ అమెరికాలో బయోలజీ విద్యనభ్యసించారు. అక్కడే శాస్త్రవేత్తగా పనిచేశారు. తర్వాత అమెరికా నుంచి 1999లో బ్రిటన్ వలస వెళ్లారు. అక్కడ జరిపిన పరిశోధనలకు గాను ఆయనకు నోబెల్ బహుమతి లభించింది. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి బ్రిటన్‌లోనే నివసిస్తున్నారు.

Venkatraman Ramakrishnan

అభిజిత్ వినాయక్ బెనర్జీ
నోబెల్ బహుమతి పొందిన మరో భారతీయుడు అభిజిత్ వినాయక్ బెనర్జీ. ఆయనకు 2019లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ప్రస్తుతం ఆయన అమెరికాలో నివసిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో 1961 ఫిబ్రవరి 21న జన్మించిన ఆయన.. కొంతకాలం మహారాష్ట్రలో కూడా ఉన్నారు. దేశంలో కాలేజీ విద్య పూర్తైన తర్వాత అమెరికా వెళ్లి హార్వర్డ్ యూనివర్సిటీలో, ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. ప్రస్తుతం మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ప్రపంచ పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రయోగాత్మక విధానం అనే అంశంపై ఆయన జరిపిన పరిశోధనలకుగాను, 2019లో ఎస్తేర్ డుఫ్లో, మైఖేల్ క్రీమెర్‌లతో కలిసి నోబెల్ బహుమతి అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన అమెరికాలోనే నివసిస్తున్నారు.

Abhijit Vinayak Banerjee

దలైలామా
దేశం నుంచి నోబెల్ అందుకున్న మరో మహనీయుడు 14వ దలైలామా. టిబెట్‌లో జన్మించిన ఆయన ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. 1959 నుంచి ఇక్కడే ఉంటున్న ఆయనకు 1989లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. శాంతియుత మార్గంలో టిబెట్ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నందుకు గాను ఆయనకు ఈ బహుమతి దక్కింది.

14th Dalai Lama