Mangoes : మామిడిలో ఎరువుల యాజమాన్యం

జింకు లోపం సాధారణంగా చౌడు నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి, పాలిపోయి చనిపోతాయి.

Mangoes : మామిడిలో ఎరువుల యాజమాన్యం

Mango Cultivaton

Mangoes : ఫలాల్లో రాజుగా మామిడిని చెబుతాం. మామిడి సాగుకు మన రాష్ట్రంలోని వాతావరణము చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి నాణ్యమైన దిగుబడిని ఇస్తుంది. మన రాష్ట్రములో పండించే మామిడి పండ్లు మన దేశంములోనే కాక ఇతర దేశాల వారు కూడా దిగుమతి చేసుకొని ఇష్టంగా తింటున్నారు. తెలుగు రాష్ట్రాలలో సుమారుగా 7,64,500 ఎకరాల విస్తీర్ణంలో సాగవుతుంది. మామిడిని ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్, విశాఖపట్నం, చితూరు, కడప, అదిలాబాదు, నల్గొండ జిల్లాల్లో విస్తారంగా సాగుచేస్తున్నారు. మామిడి సాగు చేస్తున్న రైతులు సరైన ఎరువుల యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎరువుల యాజమాన్యం విషయంలో రైతులు తగిన జాగ్రత్తులు పాటించటం ముఖ్యం.

ఎరువుల యాజమాన్యము :

తక్కువ వర్షప్రాతం గల ప్రదేశాల్లో ఎరువులను, పోషక పదార్థాలను వర్షాకాలం ఆరంభంలోను, రెండవ సారి వర్షాకాలం చివరిలోను వెయ్యాలి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వర్షాకాలం చివర్లో వేసుకోవాలి. తేలికపాటి భూముల్లో తగినంత చెజవు మట్టిగాని, కంపోస్టు గాని వేయాలి. ఒక్కో మొక్కకు మొదటి సంవత్సరం 100 గ్రా. నత్రజని, 100 గ్రా. భాస్వరం,100 గ్రా. పొటాష్‌ నిచ్చే ఎరువులు అందించాలి. తర్వాత ప్రతి సంవత్సరం 100 గ్రా. నత్రజని, భాస్వరం, పొటాష్‌ పెంచుతూ పదవ సంవత్సరం మరియు ఆ తర్వాత ఒక్కో కిలో నత్రజని, భాస్వరం, పొటాష్‌ నిచ్చే ఎరువులను వేయాలి. యూరియా, 6250 గ్రా. ల సింగిల్‌ సూపర్‌ఫాస్స్ఫేట్స్‌ 1670 గ్రా.ల మ్యూరేట్‌ ఆఫ్‌ పాటాష్‌. ఫిబ్రవరి చివరి వారంలో లేక మార్చి మొదటి వారంలో పిందె ఏర్పడిన తర్వాత సిఫారుసు చేసిన ఎరువుల్లో నాలుగవ భాగం మొక్కకు ఇవ్వడం ద్వారా ఎక్కువ దిగుబడితోపాటు తర్వాత సంవత్సరపు కాతకు దోహదపడుతుంది.

నత్రజనిని 50 శాతం పశువుల ఎరువు రూపంలో ఇవ్వాలి. మిగిలిన 50 శాతం రసాయన ఎరువుల రూపంలో అందించాలి. కాపుకు రాని తోటల్లో సిఫారసు చేసిన ఎరువులను 2-3 నెలలకు ఒకసారి వేయాలి. మామిడి కోత అయిన వెంటనే సిఫారసు చేసిన 2/3 వంతు ఎరువులను వేయాలి. మిగతా 1/3 భాగం ఎరువులను కాయ ఎదుగుదల దశలో వేయాలి. తొలకరిలోనే జూన్‌-జూలై నెలల్లో జీలుగ 10కి. ఎకరానికి లేదా జనుము 25 కి. ఎకరానికి లాంటి పచ్చిరొట్ట పైర్లను మామిడి చెట్ల మధ్య వేసి 45-50 రోజులలో భూమిలో కలియ దున్నాలి. సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడాలి. బాగా చివికిన పశువుల ఎరువు సుమారు 100 కిలోలు లేదా వర్మికంపోస్టు 10 కిలోలు ప్రతి చెట్టు పాదులో వేయాలి.

పది సంవత్సరములు, ఆ పైబడిన చెట్లకు 1 కిలో నత్రజని సుమారు 2.2 కిలోల యూరియా, 1 కిలో పొటాషియం 1.6 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, మరియు 1కిలో భాస్వరం, 6 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్స్‌ ఎరువులను జూన్‌-జులై నెలల్లో చెట్టు ప్రధాన కాండం నుంచి 1.5 నుంచి 2 మీ దూరంలో పాదులో వేయాలి. కాయలు నిమ్మకాయ పరిమాణంలో ఉన్నప్పుడు పొటాషియం నైట్రేట్‌ను 13-0-45 10 గ్రా॥ల చొప్పున ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. రైతులు సకాలంలో, సరియైన సమయంలో సమగ్ర పోషకాల యాజమాన్యం పాటించక పోవడం వల్ల పూత, పిందె దశల్లో ఫలకృతి సరిగా జరుగక పోవడం వల్ల రైతులు దిగుబడులు తగ్గిపోవడం జరుగుతుంది.

సూక్ష్మధాతు లోపాల నివారణ:

జింకు లోపం సాధారణంగా చౌడు నేలల్లో ఎక్కువగా కనిపిస్తుంది. జింకు లోపమున్న నేలల్లో మొక్కల పెరుగుదల క్షీణించి, పాలిపోయి చనిపోతాయి. పెరుగుదల దశలలో జింకు లోపమున్న ఎడల అకులు చిన్నవిగా మారి సన్నబడి, పైకి లేదా క్రిందికి ముడుచుకొని పోతాయి. కణుపులమధ్యదూరం తగ్గిపోయి, అకులు గులాబి రేకుల వలె గుబురుగా తయారవుతాయి. మొక్కల పెరుగుదల క్షీణించి, కాయల పెరుగుదల, నాణ్యత మరియు దిగుబడి తగ్గిపోతుంది.

కాయలు కోసిన వెంటనే జూన్‌ – జూలై మాసాల్లో 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు లీటరు నీటికి 5 గ్రా. జింక్‌ సల్ఫేట్‌తో పాటు 10 గ్రా. యూరియాను మరియు 0.1 మి.లీ స్టికర్‌/ వెట్టర్‌ కలిపి పిచికారచేయటం వలన జింకు లోపాన్ని నివారించవచ్చు. బోరాన్‌ లోపం గల చెట్ల ఆకులు కురచబడి, ఆకుకొనలు నొక్కుకుపోయినట్లయి పెళుసుగా తయారవుతాయి.కాయదశలో కాయలు పగుళ్లు చూపడం సర్వసాధారణంగా కనపడే లక్షణం.బోరాన్‌ లోప నివారణకు ప్రతి మొక్కకు 100 గ్రా॥ బోరాక్స్‌ భూమిలో వేయాలి లేదా 0.1 నుండి 0.2 శాతం బోరాక్స్‌ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినపుడు ఒకటి లేదా రెండుసార్లు పిచికారి చేయాలి.

ఇనుపధాతులోపం గల చెట్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోతాయి. ఆకుల సైజు తగ్గిపోయి, తీవ్రమయిన లోపం ఉన్న ఎడల మొక్కల ఆకులు పై నుండి క్రిందికి ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపు రాయి ఉన్న నేలలో సాధారణంగా కనబడుతుంది. దీని నివారణకు 2.5 గ్రా॥ అన్నభేది + 1గ్రా నిమ్మఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం లీటరు నీటిలో కలిపి15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

సూక్ష్మపోషక లోపాలు అధికంగా ఉన్న తోటల్లో చెట్టుకి 50-75 గ్రా॥ బోరాక్స్‌, 125-150 గ్రా॥ జింక్‌ సల్ఫేట్‌ మరియు 125-150 గ్రా॥ మెగ్నీషియం సల్ఫేట్‌ జూన్‌-జులై నెలల్లో పాదుల్లో వేయాలి. 1-2 గ్రా. జింక్‌ సల్ఫేట్‌ మరియు 1.25 గ్రా. బోరాన్‌ (19%) లీటరు నీటికి కలిపి కొత్త చిగురువచ్చేటప్పుడు మరియు పూమొగ్గల పెరుగుదల దశలో ఉన్నప్పుడు చెట్లు బాగా తడిసేటట్లు పిచికారి చేయాలి.