రైతుల ఆందోళనలు : పద్మ విభూషణ్ వెనక్కి ఇచ్చేసిన ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్

  • Published By: venkaiahnaidu ,Published On : December 3, 2020 / 03:33 PM IST
రైతుల ఆందోళనలు : పద్మ విభూషణ్ వెనక్కి ఇచ్చేసిన ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్

Akali’s Parkash Badal Returns Padma Vibhushan కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రైతుల ఆందోళనలకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది.



కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తున్న పంజాబ్ రైతులకు మద్దతుగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాళీద‌ళ్ నేత‌ ప్ర‌కాశ్ సింగ్ బాద‌ల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా త‌న అసహానాన్ని వ్య‌క్తం చేశారు. తన ప‌ద్మ విభూష‌ణ్ అవార్డు(2వ అతిపెద్ద పౌర పురస్కారం)ని కేంద్ర ప్ర‌భుత్వానికి తిరిగి ఇవ్వ‌నున్నట్లు బాదల్ ప్రకటించారు.

కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌ను మోసం చేస్తున్న‌ద‌ని, అందుకు నిర‌స‌న‌గా ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డును తిరిగి ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. రైతుల కారణంగానే తాను ఇంతటివాడినయ్యానని,రైతుల కోసం తాను చేయాల్సిందంతా చేస్తానని ఆయన తెలిపారు. నూతన అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ ఇటీవల ఎన్డీయే కూటమికి శిరోమణి అకాళీదళ్ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.



మరోవైపు,శిరోమణి అకాళీదళ్(డెమోక్రటిక్)చీఫ్ మరియు రాజ్యసభ ఎంపీ సుఖేదేవ్ సింగ్ దిండ్షా కూడా తన పద్మబూషణ్ అవార్డును తిరిగిచ్చేయనున్నట్లు ప్రకటించారు. ప్రంజాబ్ కి చెందిన ప్రముఖ క్రీడాకారులు కూడా రైతులకు మద్దతుగా తమ అవార్డులను,మెడల్స్ ని తిరిగిచ్చేస్తామని మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, మంగళవారం రైతు నేతలతో జరిగిన చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఇవాళ మరోసారి రైతు సంఘాల ప్రతినిధులతో ఢిల్లీలో కేంద్రం చర్చలు జరుపనుంది. ఇక,నూతన అగ్రి చట్టాలు పూర్తిగా రద్దు చేయాల్సిందేనని రైతు నేతలు డిమాండ్ చేస్తున్నారు. అగ్రి చట్టాలు రద్దయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు. కొత్త అగ్రి చట్టాలు ఉపసంహరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని తాము డిమాండ్ చేస్తున్నారు రైతులు.



ఇవాళ రైతులతో రెండో విడత చర్చలు జరపనున్న నేపథ్యంలో…ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ భేటీ అయ్యారు. ఢిల్లీ దగ్గర్లోని హైవేలపై రైతులు చేస్తున్న ఆందోళనలు పంజాబ్ ఎకానమీపై మాత్రం ప్రభావం చూపదని..దేశ భద్రతకు కూడా పెద్ద ముప్పుగా మారుతుందని అమిత్ షాతో మీటింగ్ అనంతరం అమరీందర్ సింగ్ తెలిపారు. వెంటనే రైతుల సమస్యకి పరిష్కారం చూపాలని అమిత్ షాని కోరినట్లు అమరీందర్ చెప్పారు.