Black Gram : వేసవి అపరాల సాగులో తెగుళ్ళు… నివారణ

రక్షక పంటలైన జొన్న,మొక్కజొన్న,సజ్జ పంటలను 4 వరుసలలో పొలం చుట్టూ విత్తుకోవాలి. విత్తిన 15-20 రోజులకు వేప నూనే 5 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

Black Gram : వేసవి అపరాల సాగులో తెగుళ్ళు… నివారణ

Agri

Black Gram : తెలుగు రాష్ట్రాల్లో రబీ పంటల తర్వాత, వేసవిలో తక్కువ కాల పరిమితి కలిగిన పెసర,మినుము పంటలను ఏక పంటలుగా లేదా వివిధ పంటలలో కూడా సాగు చేస్తున్నారు. అయితే వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతలు,గాలిలో తక్కువగా ఉండే తేమ బెట్ట వాతావరణ పరిస్థితులను వలన రసంపీల్చే పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది.దాని వలన వైరస్ తెగుళ్ళ వ్యాప్తికి కారణమై ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి.తద్వారా దిగుబడులు గణనీయంగా తగ్గడంతో పాటు రైతు ఆర్ధిక పరిస్థితిపై తీవ్రప్రభావం కలిగిస్తున్నాయి.

రసంపీల్చు పురుగులైన తెల్లదోమ,తామర పురుగులు,పేనుబంక వంటి వాటి ద్వారా ఈ వైరస్ తెగుళ్ళు వ్యాప్తి చెందుతాయి.ఈ వైరస్ తెగుళ్ళ ఉనికి,ఉదృతిపై రైతులకు సరైన అవగాహన లేకపోవడం ఇవి మొక్కల మధ్య త్వరగా వ్యాప్తి చెందడం వలన రైతులు సకాలంలో గుర్తించలేకపోతున్నారు.ఈ వైరస్ తెగుళ్ళ నివారణకు మందులు లేవు.కావున వాటి లక్షణాలను ముందుగా గుర్తించి ,వాటిని వ్యాపింపచేసే కీటకాలను నివారించడంవల్ల పంటల్లో వైరస్ తెగుళ్ళను నివారించుకోవచ్చును.

పల్లాకు తెగులు ఇది జెమిని వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ సోకిన మొక్కల నుండి మరియు ఇతర కలుపు మొక్కల నుండి తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది.తెగులు లక్షణాలు గమనించినట్లైతే ,తెగులు సోకిన మొక్కలలో ఆకులు పసుపు మరియు ఆకుపచ్చ రంగులోకి మారతాయి.అందువల్ల దీన్ని మొజాయిక్ తెగులు అని అంటారు.లేత దశలో ఈ తెగులు ఆశిస్తే పైరు పసుపు రంగుకు మారి పూత,పిందే ఏర్పడక అత్యదిక నష్టం వాటిల్లుతుంది.పూత,పిందే దశలో ఈ తెగులు ఆశిస్తే పిందెలు కాయలు కూడా పసుపు రంగులోకి మారి తాలు కాయలు ఏర్పడతాయి.

పెసర, మినుము పంటలకు సంబంధించి తెగులు తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. పెసరలో డబ్లూ.జి. జి-37, డబ్లూ.జి. జి-42,యండి.జి.జి-35, మినుములో ఎల్.బి.జి 9752,ఎల్.బి.జి-787,డి.యం-31. ఎంపిక చేసుకోవాలి. పంట విత్తుకునే ముందు కిలో విత్తనానికి 5మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 5గ్రా.థయోమిథాక్సం కలిపి విత్తనశుద్ది చేయాలి. కలుపు మొక్కలు లేకుండా నివారించుకోవాలి. తెల్లదోమ ఉనికి గమనించడానికి పసుపు రంగు జిగురు ఆకర్షక అట్టలను ఎకరానికి 15-20 చొప్పున అమర్చాలి.

రక్షక పంటలైన జొన్న,మొక్కజొన్న,సజ్జ పంటలను 4 వరుసలలో పొలం చుట్టూ విత్తుకోవాలి. విత్తిన 15-20 రోజులకు వేప నూనే 5 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1.5గ్రా లేదా ఎసిటామిప్రిడ్ 0.25గ్రా లేదా థయోమిథాక్సం 0.25గ్రా ఏదైన ఒక మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. దోమ ఉదృతిని బట్టి వారం రోజులకు ఒకసారి మందులను మార్చి పిచికారి చేయాలి.

తలమాడు తెగులు లేదా మొవ్వు కుళ్ళు తెగులు కు దీనికి సంబంధించి ఈ తెగులు తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనుకకు ముడుచుకొని మెళికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి.ఆకుల అడుగు భాగంలో ఈనెలు రక్త వర్ణంలో ఉంటాయి.లేత దశలో ఈ తెగులు సోకినప్పుడు మొక్కల తలలు మాడిపోయి మొక్కలు గిడసబారి చనిపోతాయి.పైరు పూత,పిందె దశలో ఈ తెగులు సోకితే కాపు తగ్గుతుంది.

దీని నివారణకు తామరపురుగులను ఆకర్షించడానికి నీలి రంగు జిగురు అట్టలను ఎకరాకు 15-20 వరకు అమర్చాలి. విత్తిన 15-20 రోజులకు వేప నూనె 5 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తామరపురుగుల నివారణకు ఎసిఫేట్ 1.5గ్రా లేదా మోనొక్రొటోఫాస్ 1.6మి.లీ లేదా థయోమిథాక్సం 2 మి.లీ లేదా మిథైల్ డెమొటాన్ 2.0 మి.లీ ఏదైన ఒక మదును లీటను నీటికి కలిపి పిచికారి చేయాలి. పూతదశలో తెగులు ఉదృతి ఎక్కువగా ఉంటే స్పైనోశాడ్ 0.3మి.లీ పిచికారి చేయాలి.

సీతాఫలం తెగులుకు సంబంధించి ఈ తెగులు పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది.ఈ తెగులు సోకిన మొక్కల ఆకుల వెడల్పుగా ఉండి ,దగ్గరగా ముడతలు పడి ఉబ్బెత్తుగా మారి సీతాఫలం మాదిరి కనిపిస్తాయి.తెగులు సోకిన ఆకులు ముదురు పచ్చరంగుకు పూత ఏర్పడక వెర్రి తలలు వేస్తాయి.ఈ తెగులు విత్తనం ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. దీని నివారణకు నాణ్యమైన వైరస్ సోకని పొలం నుండి విత్తనం సేకరించుకోవాలి.

పైరు బెట్టకు గురికాకుండా పొటాషియం నైట్రేట్ 5గ్రా .లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. విత్తనశుద్ది చేయాలి.దీనికిగాను 5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 5గ్రా థయోమిథాక్సం మందును కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ది చేసుకోవాలి. పేనుబంక నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ లేదా ఎసిటామిప్రిడ్ 0.25గ్రా లేదా డైమిథోయేట్ 2.0మి.లీ ఏదైనా ఒక మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

రైతులు వాతావరణంలో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ సకాలంలో వాటిని గుర్తించి తగిన నివారణ చర్యలు పాటించడం వలన వైరస్ తెగుళ్ళని అధిగమించి అధిక దిగుబడిని అందుకోవచ్చు.