మోడీ చుట్టూ ఉన్న వాళ్ల నుంచే…ఆర్థిక మందగమనంపై రాజన్ కీలక వ్యాఖ్యలు

  • Published By: venkaiahnaidu ,Published On : December 8, 2019 / 09:55 AM IST
మోడీ చుట్టూ ఉన్న వాళ్ల నుంచే…ఆర్థిక మందగమనంపై రాజన్ కీలక వ్యాఖ్యలు

ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొనేందుకు మోడీ సర్కార్ తీసుకోవాల్సిన తొలి చర్య దాన్ని అర్థం చేసుకోవడమేనని మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ప్రధాని కార్యాలయంలో అధికారం కేంద్రీకృతం కావడం ద్వారా దేశంలో ఆర్థిక వృద్ధి మందగమనం కొనసాగుతోందని  రాజన్‌ అన్నారు. ప్రతి విమర్శకులకూ రాజకీయ దురుద్దేశం అంటగట్టడం సరికాదని, మందగమనం తాత్కాలికమనే భావనను విడనాడాలని రఘురాం​ రాజన్‌ హితవు పలికారు. మూలధనం, భూమి, కార్మిక మార్కెట్లు, పెట్టుబడులు, వృద్ధిని సరళీకరించేలా సంస్కరణలు అవసరమని ఓ మ్యాగజైన్ కు రాసిన వ్యాసంలో ఆయన తెలిపారు. 

ఆర్థిక వృద్ధి మందగమనం నేపథ్యంలో తప్పు ఎక్కడ జరుగుతుందనే దాన్ని ముందుగా మనం అర్ధం చేసుకోవాలని, మొదట ప్రస్తుత ప్రభుత్వంలో అధికార కేంద్రీకరణ గురించి ప్రస్తావించాలని రాజన్ తన ఆర్టికల్ లో తెలిపారు. నిర్ణాయక వ్యవస్థలోనే కాదు సలహాలు, ప్రణాళికలు సైతం ప్రధాని చుట్టూ, ప్రధాని కార్యాలయంలో చేరిన కొద్ది మంది నుంచే వస్తున్నాయని రాజన్‌ స్పష్టం చేశారు. ఇది పార్టీ రాజకీయ, సామాజిక అజెండాకు ఉపకరిస్తున్నా ఆర్థిక సంస్కరణల విషయంలో ఫలితాలను ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రస్ధాయిలో కాకుండా దేశవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణపై వీరికి పెద్దగా అవగాహన ఉండటం లేదని అన్నారు.

గత ప్రభుత్వాలు సంకీర్ణ సర్కార్‌లు అయినా తదుపరి ఆర్థిక సరళీకరణను స్ధిరంగా ముందుకు తీసుకువెళ్లాయన్నారు. మోడీ ప్రభుత్వం కనిష్ట ప్రభుత్వం..గరిష్ట పాలన నినాదంతో అధికారంలోకి వచ్చినా దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నారు. పోటీతత్వాన్ని పెంపొందించడం, దేశీయ సమర్ధతను మెరుగుపరిచేందుకు భారత్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో చేరాలని కోరారు.