కేంద్రమంత్రి జుట్టుపట్టుకుని లాగేసిన యూనివర్శిటీ విద్యార్థులు

10TV Telugu News

కోల్‌ కతాలోని జాదవ్‌పూర్ యూనివర్శిటీలో కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ(సెప్టెంబర్-19,2019) జాదవ్ పూర్ యూనివర్శిటికీ బాబుల్ సుప్రియో వెళ్లారు. అయితే కేంద్రమంత్రి ఈ కార్యక్రమానికి హాజరుకావడాన్ని వ్యతిరేకిస్తున్న SFI,AISA సభ్యులు బాబిల్ సుప్రియో రాకను అడ్డుకున్నారు. క్యాంపస్ లోకి అడుగుపెట్టనీయకుండా ఆయనను చుట్టుముట్టి నల్ల జెండాలు చూపించి వెళ్లిపోవాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చివరకు యూనివర్శిటీ ఛాన్సలర్ అయిన గవర్నర్ జగదీప్ ధనకర్ స్పాట్ కి చేరుకుని కేంద్రమంత్రిని తన కారులో అక్కడినుంచి తీసుకెళ్లారు.

కొంతమంది విద్యార్థులు తనపై చెయ్యి చేసుకున్నారని,తాను పాలిటిక్స్ చేసేందుకు యూనివర్శిటీకి వెళ్లలేదని,కానీ యూనివర్శిటీలోని కొందరు విద్యార్థుల ప్రవర్తన చూసి బాధ కలిగిందని అన్నారు. తన జుట్టు పట్టుకుని కొందరు విద్యార్థులు లాగారని,తనను పక్కకు తోసేశారని కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో తెలిపారు. తమను తాము నక్సల్స్ అని చెప్పుకుంటూ ఆందోళన చేసిన కొందరు విద్యార్థులు తనను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు ఆయన తెలిపారు. నిరసనలో పాల్గొన్న AFSU నాయకుడు డెబ్రాజ్ దేబ్ నాథ్ మాట్లాడుతూ… ఫాసిస్ట్ శక్తులకు క్యాంపస్‌లో అనుమతి లేదన్నారు.

గవర్నర్ జగదీప్ ధనకర్ ఈ సంఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నారని ఆయన ప్రెస్ సెక్రటరీ విలేకరులతో అన్నారు. గవర్నర్ ఈ సంఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తారు, ఎందుకంటే ఇది కేంద్ర మంత్రిని చట్టవిరుద్ధంగా నిర్బంధించడం. ఇది రాష్ట్ర శాంతిభద్రతలపై మరియు చట్ట అమలు సంస్థల ప్రవర్తనపై చాలా తీవ్రమైన ప్రతిబింబం అని రాజ్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.