MLA Ramvriksh Sada : ఈ రోజుల్లోనూ ఇలాంటి ఎమ్మెల్యే ఉంటారా? ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం, బోరున విలపించిన ప్రజాప్రతినిధి

నీతి, నిజాయితీ పక్కనపెట్టి భారీ మొత్తంలో ఆస్తులు వెనకేసుకుంటూ లేనిపోని ఆడంబరాలకు పోతున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ సాదాసీదా నేతలు, నిరుపేద ఎమ్మెల్యేలు ఉన్నారంటే నమ్ముతారా?

MLA Ramvriksh Sada : ఈ రోజుల్లోనూ ఇలాంటి ఎమ్మెల్యే ఉంటారా? ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం, బోరున విలపించిన ప్రజాప్రతినిధి

MLA Ramvriksh Sada : ఈ రోజుల్లో రాజకీయాలు, రాజకీయ నాయకులు, వారి అవినీతి, అక్రమాస్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ప్రజాప్రతినిధులు ఒకరిని మించి మరొకరు సంపాదిస్తున్నారు. భారీగా ఆస్తులు పోగేసుకోవడంలో పోటీలు పడుతున్నారు. ఇక ఎమ్మెల్యే అంటే పెద్ద బంగ్లా, ఖరీదైన కార్లు, వందల మంది అనుచరులు ఉండటం కామన్. లీడర్లు.. నీతి, నిజాయితీ పక్కనపెట్టి భారీ మొత్తంలో ఆస్తులు వెనకేసుకుంటూ లేనిపోని ఆడంబరాలకు పోతున్న రోజులివి. అలాంటి ఈ రోజుల్లోనూ సాదాసీదా నేతలు, నిరుపేద ఎమ్మెల్యేలు ఉన్నారంటే నమ్ముతారా?

అవును ఉన్నారు. నూటికో, కోటికో ఒక్కరు అన్నట్టుగా ఎక్కడో ఓ చోట నీతి, నిజాయితీ, విలువలకే కట్టుబడి ఉన్న ప్రజాప్రతినిధులు ఇంకా ఉన్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు?

ఆయన పేరు రామ్ వ్రిక్ష్ సదా. బీహార్ ఆర్జేడీ ఎమ్మెల్యే. ఆ రాష్ట్రంలో అతి పేద ఎమ్మెల్యే ఈయనే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు బహుమతిగా ఇవ్వడంతో ఎమ్మెల్యే రామ్ వ్రిక్ష్ ఎమోషన్ అయిపోయారు. కన్నీరు పెట్టుకున్నారు. ‘నేను జీవితంలో సొంతింట్లో ఉంటానని అస్సలు ఊహించలేదు. కానీ, సీఎం నాకు ఇంటి తాళం ఇవ్వగానే భావోద్వేగానికి లోనయ్యా’ అని ఎమ్మెల్యే రామ్ వ్రిక్ష్ బోరున విలపించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

లాలూ ప్రసాద్ యాదవ్ తనను ఓ నాయకుడిగా తీర్చిదిద్దారని రామ్ వ్రిక్ష్ సదా తెలిపారు. 1995లో తాను ఓ ఇటుక బట్టీలో పనిచేసే సమయంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఓ ఎన్నికల ర్యాలీకి వచ్చారని, ఆయన్ని చూడ్డానికి వెళ్లానని, అప్పుడే తొలిసారిగా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. 2000 సంవత్సరంలో అలౌలి నియోజకవర్గం నుంచి పశుపతి కుమార్‌పై ఆర్డేడీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు సదా. 2005 లో కూడా పోటీ చేసి ఓడిపోయారు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి 2020 సంవత్సరంలో ఎట్టకేలకు ఎమ్మెల్యేగా గెలిచారు.

2020 నాటి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రామ్‌వ్రిక్ష్ సదా పేర్కొన్న రూ.70 వేల విలువైన ఆస్తుల్లో 25 వేలు నగదు తనవి, తన భార్య వద్ద ఉన్న మరో రూ. 5 వేల నగదు, సొంతూరైన రౌన్ గ్రామంలో రూ. 30 వేల విలువ చేసే తను ఉంటున్న 2 గదుల ఇల్లు, రూ. 10 వేల విలువ చేసే కొద్దిపాటి వ్యవసాయ భూమి.. అన్నీ కలిపి మొత్తం రూ. 70 వేలే అతడి ఆస్తి.

బీహార్ అసెంబ్లీలోనే అత్యంత నిరుపేద ఎమ్మెల్యేగా పేరొందిన రామ్‌వ్రిక్ష్ సదాకు తాజాగా బీహార్ సర్కార్ మూడంతస్తుల భవనం ఇంటి తాళాలు అందించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. అది కూడా పాట్నాలోని బీహార్ అసెంబ్లీకి కూతవేటు దూరంలోనే ఉన్న బీర్ చంద్ పటేల్ పథ్ ప్రాంతంలో. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కట్టించి ఇస్తున్న హౌజింగ్ ప్రాజెక్టులో ఇల్లు పొందిన 8 మంది లక్కీ ఎమ్మెల్యేల్లో రామ్ వ్రిక్ష్ ఒకరు. తాను ఇంతటి భాగ్యానికి నోచుకుంటానని కలలో కూడా అనుకోలేదంటూ ఎమోషన్ అయ్యారు రామ్ వ్రిక్ష్.