GOLD RBI : ఆర్‌బీఐలో 800 టన్నుల గోల్డ్‌ స్టాక్‌.. మూడు నెలల్లో 10 టన్నుల బంగారం కొనుగోలు

బంగారం కేవలం అలకారం మాత్రమే కాదు..పెట్టుబడి కోసం కూడా..ఏదైనా అవసరం వస్తే బంగారం ఉందనో భరోసా కోసం బంగారాన్ని కొని దాచుకుంటుంటారు. బంగారం అంటే మహిళలకు మక్కువ అంటారు. కానీ మహిళలు బంగారం కొనేది కేవలం అలకారం కోసమేకాదు ముందస్తు జాగ్రత్త కోసం..ఏ అవసరం వచ్చినా బంగారం ఉంటుందనో భరోసా కోసం..అలా ఆర్బీఐ కూడా ఆలోచించింది. బంగారాన్ని భారీగా కొనేసి నిల్వ చేస్తోంది.

GOLD RBI : ఆర్‌బీఐలో 800 టన్నుల గోల్డ్‌ స్టాక్‌.. మూడు నెలల్లో 10 టన్నుల బంగారం కొనుగోలు

RBI Increases Its Gold Holdings

GOLD RBI : భద్రమైన పెట్టుబడి ఏమిటంటే బంగారమే అని ఠక్కున చెబుతారు ఎవరైనా.. మహిళలు రూపాయి రూపాయి పొదుపు చేసి బంగారాన్నే కొంటారు. అది ఆడవాళ్లకు బంగారం అంటే మక్కువ అని వాడుకలోని మాట. కానీ మహిళలు బంగారం కొనటం వెనుక ముందు చూపు ఉంటుంది.ఇంట్లో ఏ ఆర్థిక అవసరం వచ్చినా పసిడి ఉందనే భరోసా కోసం. అమ్మాయి పెళ్లి కోసం పాపాయి చిన్ననాటినుంచే బంగారాన్ని కొంతకొంతగా కొని జమచేస్తుంటారు. ఇది మధ్యతరగతి మహిళల ముందుచూపు. అంతేకాదు ఇంటాయనకు వ్యాపారానికైనా..వ్యవసాయం పెట్టుబడికైనా…ఇంకేదైనా అవసరానికైనా ఆదుకునేది ఇంట్లో ఉండేబంగారమే. చిన్న సన్నకారు రైతుల నుంచి మధ్యతరగతి జనం వరకు.. బడాబాబులు నుంచి బిలియనీర్ల వరకు ఎవరైనా పొదుపు ఆలోచన చేస్తే ముందుగా ఎంచుకునేది పుత్తడినే.. ఇప్పుడు మన రిజర్వు బ్యాంకు కూడా పుత్తడిపై భారీ ఆశలు పెట్టుకుంది. భవిష్యత్‌లో మన ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే రీతిలో.. మన రూపాయి ప్రపంచ వాణిజ్యంలో స్ట్రాంగ్‌గా ఉండేలా బంగారం నిల్వలను భారీగా పెంచేసింది ఆర్‌బీఐ.

ఆర్థిక వ్యవస్థ స్ట్రాంగ్‌గా ఉండాలంటే గోల్డ్‌ స్టాక్‌ ఎక్కువగా ఉండాలనే స్ట్రాటజీ తీసుకుంది ఆర్‌బీఐ. గత కొన్నేళ్లుగా  బంగారాన్ని కొని స్టాక్ పెడుతోంది. గత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఆర్‌బీఐ వద్ద ఏకంగా 800 టన్నుల బంగారం నిల్వ ఉన్నట్లు రిజర్వు బ్యాంకు లెక్కలను బేరీజువేచి చెబుతున్నారు ఆర్థిక వేత్తలు. డాలర్‌ ధర పడిపోవటం.. అంతర్జాతీయంగా అనిశ్చితి కొనసాగుతుండటంతో పసిడి కొనుగోళ్లే సేఫ్‌ అని పెట్టుబడిదారులు బులియన్‌ మార్కెట్‌కు పరుగులు తీస్తుంటే.. ఆర్‌బీఐ కూడా అదే మంత్రం జపిస్తుండటం ఆసక్తికరంగా మారింది. గత మార్చి త్రైమాసికంలో 10 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన ఆర్‌బీఐ.. గత ఆర్థిక సంవ్సతరంలో 40 టన్నుల బంగారాన్ని సేకరించింది.

GOLD Stock In Bharath : ప్రపంచంలో ఎక్కువ బంగారం నిల్వలున్న దేశాల్లో 10 స్థానంలో భారత్ .. ఏదేశాల్లో ఎంతెంత ఉందంటే..

ఆర్‌బీఐ ఇంత భారీగా బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు ఆర్థిక వేత్తలు. స్విస్ ప్రైవేట్ బ్యాంక్ J. సఫ్రా సరాసిన్ లిమిటెడ్ గత నెల 24న విడుదల చేసిన నివేదిక ప్రకారం అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో ప్రభుత్వ బ్యాంకులు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు లెక్కలు విడుదల చేసింది. స్విస్‌ బ్యాంకు చూపిన లెక్కల పరిశీలిస్తే ప్రపంచంలో బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో మన దేశం ఐదో స్థానంలో నిలిచింది. సింగపూర్, రష్యా, చైనా, టర్కీలతో సహా ప్రపంచంలోని మొదటి ఐదు బంగారు కొనుగోలుదారులలో RBI ఒకటని చెప్పింది స్విస్‌ బ్యాంక్‌. మన ఆర్థిక వ్యవస్థ భద్రతకు భారీ స్థాయిలో బంగారం పోగేయడం మేలైన విధానమని ఆర్‌బీఐ.. ఈ విధానాన్ని అనుసరిస్తుందని చెబుతున్నారు పరిశీలకులు.

2022-23 ఆర్థిక సంవత్సరంలో 40 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిన ఆర్‌బీఐ అంతకు ముందు 27 టన్నులు సేకరించింది. బంగారం నిల్వలను పెంచుకోవాలని భావించిన ఆర్‌బీఐ గత ఐదేళ్లుగా మొత్తం 230 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. 2018 నుంచి 2023 వరకు ఏటా బంగారం నిల్వలను పెంచుకుంటూ వెళ్లింది ఆర్‌బీఐ. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బంగారం నిల్వలను పెంచుకోవాలని నిర్ణయించిన ఆర్‌బీఐ వైఖరి వల్ల ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా చలామణీ అవుతున్న డాలర్ విలువ తగ్గుతుందని చెబుతున్నారు ఆర్థిక వేత్తలు. ఈ స్థానంలో భవిష్యత్‌లో మన రూపాయి విలువ పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.

ప్రపంచ పరిణామాలతో ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమైనా.. మన దేశంపై పెద్దగా ప్రభావం చూపకుండా ఉండేలా ఎప్పటికప్పుడు మన ఆర్‌బీఐ బంగారంపై పెట్టుబడులు పెడుతుంటుంది. తన విధానాన్ని సమీక్షించుకుని మన ఆర్థిక వ్యవస్థకు మద్దతు దక్కేలా చూస్తుంది. 2009లో 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది ఆర్‌బీఐ. ఆ తర్వాత కొన్నాళ్లు గ్యాప్‌ ఇచ్చి మళ్లీ 2018 నుంచి బంగారం నిల్వలు పెంచుకుంటూ వెళ్లోంది. గత ఐదేళ్లలో మన రిజర్వు బ్యాంకులో బంగారం నిల్వలు 560 టన్నుల నుంచి 790 టన్నులకు చేరుకున్నాయి. ఏటా పెరుగుతున్న బంగారం ధరలు కూడా మన ఆర్‌బీఐ బంగారంపై పెట్టుబడులు పెంచుకోవడానికి ఓ కారణంగా చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే బంగారం ధరలు 9శాతం పెరగడంతో భారీగా లాభపడింది ఆర్‌బీఐ. ఇది దృష్టిలో పెట్టుకునే మార్చిలో ఒకేసారి 10 టన్నులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు పరిశీలకులు. ధరలు ఇదే విధంగా పెరిగితే భవిష్యత్‌లో మన ఆర్‌బీఐ మరింత ఎక్కువగా బంగారంపై ఫోకస్‌ పెట్టొచ్చని అంటున్నారు ఆర్థికవేత్తలు.