Corona Third Wave : అంతా ప్రజల చేతుల్లోనే

కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. జనాలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరగడం ఆందోళనను

Corona Third Wave : అంతా ప్రజల చేతుల్లోనే

Corona Third Wave

Corona Third Wave : కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. జనాలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరగడం ఆందోళనను మరింత పెంచింది. త్వరలో థర్డ్ వేవ్(మూడో దశ) వ్యాప్తి చెందుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా సెకండ్ వేవ్ ఇంకా అయిపోలేదని గులేరియా అన్నారు. ఇక, ప్రజలు కొవిడ్ మార్గదర్శకాలు పాటించడం, పాటించకపోవడం అనే అంశాలపైనే థర్డ్ వేవ్ రాక, వ్యాప్తి ఆధారపడి ఉందని గులేరియా స్పష్టం చేశారు. మూడో దశలో చిన్నారులపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పేందుకు శాస్త్రీయ అధ్యయనం లేదని అన్నారు. అయితే, పిల్లలకు వ్యాక్సిన్ లేనందున ఎక్కువగా వైరస్‌ బారిన పడేవాళ్లలో పిల్లలు అధికంగా ఉంటారని అంచనా వేస్తున్నారని గులేరియా చెప్పారు. ఇప్పటివరకూ ఉన్న వ్యాక్సిన్లు బాగానే పని చేస్తున్నాయన్న ఆయన, వ్యాక్సిన్లు వేయించుకోని వారే అధికంగా కరోనా బారిన పడుతున్నారని చెప్పారు.

”ప్రత్యేకంగా ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్‌ నిబంధనలను ఏ మేరకు పాటిస్తున్నామనే అంశంపైనే వైరస్‌ వ్యాప్తి ఆధారపడి ఉంటుంది. ఏపీలో కేసుల కట్టడి ఇప్పుడు బాగుంది. హఠాత్తుగా ఒక ప్రాంతంలో కేసుల విజృంభణ జరిగితే వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఇతర ప్రాంతాల్లో కేసులు వ్యాపించకుండా ఉంటాయి. కరోనా వైరస్‌పై ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయి. వైరస్‌ కూడా రూపాంతరం చెంది వ్యాక్సిన్‌ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. హెర్డ్‌ ఇమ్యూనిటీ వైరస్‌ తీరుపై ఆధారపడి ఉంటుంది. వ్యాక్సిన్‌ ప్రభావం నుంచి వైరస్‌ తప్పించుకోగలిగితే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం కాదు” అని గులేరియా అన్నారు. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం 41వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొనేందుకు గులేరియా విశాఖ వచ్చారు. మొత్తంగా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. కోవిడ్ నిబంధనలను పాటంచాలని గులేరియా సూచించారు.