Snake Bite Treatment in India : పాముకాటుకు భారత్ లో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది..?

పాముకాటుకు గురి అయిన బాధితులను భారత్ లో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది..? బాధితులకు అవసరమైనంత వ్యాక్సిన్ అందుబాటులో ఉందా?

Snake Bite Treatment in India : పాముకాటుకు భారత్ లో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది..?

Snake Bite Treatment in India (1)

Snake bite treatment in India : పాముకాటుకు గురి కావటం అనేది చిన్న సమస్య కాదు. పాముకాటు నుంచి తప్పించుకుని బతికి బయటపడ్డా..జీవితాంతం అంగవైకల్యంలో బాధపడేవాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటి పాముకాట్లకు మన దగ్గర ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది. ఏడాదికేడాది మరణాలు ఎందుకు పెరుగుతున్నాయ్ ? విరుగుడుకు కూడా కొరత ఏర్పడిందా.. పాముకాటుకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

పాము కాటు మరణాలు అనేవి.. అనుకునేంత, కనిపించేంత చిన్న సమస్య కాదు. వేల మంది ప్రాణాలు విడుస్తుంటే.. లక్షల మంది అంగవైకల్యంతో బాధపడుతున్నారు. పాముల నుంచి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. నేలపై పడుకున్నప్పుడు పాము కాటుకు గురైతే… విషం సాధారణం కంటే 6 రెట్లు వేగంగా ఒంట్లోకి వ్యాపిస్తుంది. దోమతెరలు వాడితే పాముకాటు నుంచి బయటపడొచ్చు. ఎలుకలు ఎక్కువగా తిరిగే ధాన్యం నిల్వ ఉంచిన గదులు, వంటింటి దగ్గర్లోనే పాములు వాటిని తినేందుకు వస్తుంటాయి కాబట్టి అక్కడ పడుకోవద్దు. ఇంటి చుట్టపక్కల వెలుతురు ఉండేలా లైట్లు ఏర్పాటు చేసుకోవాలి.

Also read : Snake Bites Deaths in India : భారత్ లో పాము కాటుతో 20 ఏళ్లలో 12లక్షలకు పైగా మరణాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం.. దేశంలో ఏటా 10లక్షల మంది పాము కాట్లకు గురవుతున్నారు. వారిలో కేవలం సగం మందికే పాము విషం ఎక్కుతోంది. ఐతే పాము కాట్ల కారణంగా అంధత్వం మొదలుకుని అవయవాలు తొలగించటం వరకూ.. వేలాది మంది శాశ్వత వైకల్యానికి లోనవుతున్నారు. ప్రత్యేకించి పేద, గ్రామీణ జనాభాకు పాము కాట్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. పాము కాటు విరుగుడు వారికి అందుబాటులో లేకపోవటం, ఆధునిక వైద్య సదుపాయాలు లేకపోవటం, సంప్రదాయ చికిత్సల మీద ఆధారపడుతుండటం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

పాము విషాల వల్ల జరిగే నష్టాన్ని నివారించటానికి, నిలువరించటానికి యాంటీవీనమ్ వేగంగా ఎక్కించాలి. పాము కాట్లు అధికంగా ఉండే చాలా దేశాల్లో సొంతంగా యాంటీవీనమ్ ఉత్పత్తి చేసే సదుపాయాలే లేవు. నాలుగు కంపెనీలే ఆ నాలుగు రకాల పాముల విషానికి విరుగుడు తయారు చేస్తున్నాయ్. దేశంలో ఏటా 15లక్షల వయల్స్‌ యాంటీ వీనం ఉత్పత్తి అవుతుండగా… ఒక్కో పాముకాటు బాధితుడికి పరిస్థితి ప్రకారం.. 10 నుంచి 20 వయల్స్‌ అవసరం అవుతాయ్. ఐతే ఈ లెక్కన ఏటా కేవలం లక్ష మంది పాముకాటు బాధితులకే విరుగుడు మందు అందుబాటులో ఉంది. ఏటా సరాసరి 10లక్షల మంది పాముకాటుకు గురయితే.. లక్ష మంది బాధితులకు సరిపోయే వయల్స్‌ మాత్రమే అందుబాటులో ఉంటున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు పూర్తిస్థాయిలో మందు దొరకడం లేదు.

కారణాలు ఏవైనా ఇప్పుడు పాము కాటు ప్రాణాంతక సమస్యగా మారుతోంది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ బయటపెట్టిన లెక్కలు మరింత భయం పుట్టిస్తున్నాయ్. మళ్లీ పాము పగ చర్చకు వస్తోంది. పాములు పగబడతాయో లేదో కానీ మనిషి నిర్లక్ష్యమే శాపంగా మారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వాటి నుంచి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం కూడా జనాల్లో అవగాహన తీసుకురావాలి. పాము కాటు వేసినప్పుడు మూఢ నమ్మకాలు.. స్వయం చికిత్సను పక్కనపెట్టి.. ఆసుపత్రికి తీసుకువచ్చేలా జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి. దేశంలోని అన్ని ప్రాథమిక కేంద్రాల్లో పాము విషం విరుగుడును అవసరం అయిన స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.