ఎమర్జెన్సీ వార్డులో పూజలు : పాము కరిచిందని ఆస్పత్రికి వెళ్తే.. మంత్రాలతో వైద్యం

  • Published By: sreehari ,Published On : November 1, 2019 / 01:00 PM IST
ఎమర్జెన్సీ వార్డులో పూజలు : పాము కరిచిందని ఆస్పత్రికి వెళ్తే.. మంత్రాలతో వైద్యం

ఇదో ప్రభుత్వ ఆస్పత్రి.. ఇక్కడ ఇంగ్లీషు మందులతో వైద్యం చేయరు. మంత్రాలతో వైద్యం చేస్తారు. పాము కాటువేసిన బాధితులకు మంత్రాలతో చికిత్స అందిస్తారు. కొన్నాళ్లుగా ఇదే అనవాయితీ కొనసాగుతోంది. ఎవరికి పాము కరిచినా వింతైన పద్ధతుల్లో పూజలు చేస్తుంటారు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులే మంత్రాలతో చికిత్స చేసే వింతైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. యోగేంద్ర సింగ్ రాథోడ్ అనే వ్యక్తికి పాము కరిచింది. వెంటనే అతన్ని సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స అందించాల్సిన వైద్యులు ప్రాణపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి మంత్రతంత్రాలతో పూజలు నిర్వహించారు. విషప్రభావంతో బాధపడుతున్న బాధితుడికి ఎమర్జెన్సీ వార్డులో గడ్డిపూసలతో పూజలు చేస్తూ మంత్రాలు చదివారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బాధితుడిని ప్రాణపాయ పరిస్థితుల్లో అతడి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యం చేసి ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు గడ్డిపరకలు చేతిలో పట్టుకుని వింతగా మంత్రాలు చదువుతూ నిలబడిపోయారు. చేతిలో సెలైన్ బాటిల్స్ పట్టుకుని పూజలు చేయడం విడ్డూరంగా ఉంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయి  ఆస్పత్రి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీనిపై స్పందించిన అధికారులు ఆస్పత్రిలో మంత్ర వైద్యం చేయడాన్ని తప్పుబట్టారు. దీనిపై విచారణ జరిపి.. బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆస్పత్రి ఆర్ఎంఓ ఎస్ఎన్ బిందాల్ తెలిపారు.