వంతెనను వదల్లేదు : ఢిల్లీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీ చోరీ!

  • Published By: veegamteam ,Published On : October 30, 2019 / 09:21 AM IST
వంతెనను వదల్లేదు : ఢిల్లీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీ చోరీ!

ఓ బ్రిడ్జీని దొంగలు దోచుకెళ్లారు అంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మకపోగా..జోక్ అనుకుంటారు. కానీ ఇది నిజం. పాదచారుల కోసం ప్రభుత్వం నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జీని దొంగలు దోచుకుపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇది జరిగింది. వినటానికి ఇది చిత్రమనిపించినా ఇది అక్షరాలా జరిగింది. 

సౌత్ సెంట్రల్ ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వద్ద రోడ్డును దాటేందుకు పాదచారుల సౌకర్యార్థం ఎనిమిది సంవత్సరాల క్రితం 2010లో అంటే   ఒక ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. రెండేళ్ల క్రితం పీడబ్ల్యుడీ ఈ ఫుట్ ఓవర్‌బ్రిడ్జిని మూసివేసింది. దీని గురించి అందరూ పట్టించుకోవటం మానేశారు. 

దీంతో కొద్ది కొద్దిగా ఈ బ్రిడ్జ్ పార్ట్ లను కనిపించకుండా పోతున్నాయి. అంటే చోరీకి గురవుతున్నాయి. ఎలివేటర్ స్విచ్, రెయిలింగ్ లతో పాటు ఆఖరికి ఇటుకవలను కూడా దొంగలు వదల్లేదు. రూ. 4 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ బ్రిడ్జిని గతంలో 10 వేల మంది వరకూ పాదచారులు వినియోగించేవారు. 

బ్రిడ్జ్ చోరీ గురించి తమకు ఎటువంటి సమాచారం గానీ..నివేదికలు గానీ  తమకు రాలేదని పోలీసులు  తెలిపారు. 
కాగా ఈ బ్రిడ్జ్ ని మూసివేసిన తరువాత ఈ రోడ్డుపై ప్రమాదాలు పెరిగాయని..ఇప్పటికైనా ఈ బ్రిడ్జిని పునరుద్ధరించాలని స్థానికులు  అధికారులను కోరుతున్నారు.