Punjab New CM : పంజాబ్ సీఎంగా సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌ధావా ఎన్నికయ్యే చాన్స్!

పంజాబ్‌లో ఉత్కంఠకు తెరపడింది. పంజాబ్‌ కొత్త సీఎంగా సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌ధావాను ఎంపిక చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం.

Punjab New CM : పంజాబ్ సీఎంగా సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌ధావా ఎన్నికయ్యే చాన్స్!

Punjab

Punjab New CM పంజాబ్‌లో ఉత్కంఠకు తెరపడింది. పంజాబ్‌ కొత్త సీఎంగా సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌ధావాను ఎంపిక చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. అధికారికంగా పేరు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఎన్నికల ముందు కొత్త సీఎం ఎంపిక కావడంతో జాగ్రత్తగా కసరత్తు చేసేందుకు పార్టీ హైకమాండ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలందరి అభిప్రాయాలు తీసుకుని సుఖ్‌జిందర్ సింగ్ రణ్‌ధావాను ఏఐసీసీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కొత్త సీఎం ఎంపిక కోసం పార్టీ నియమించిన పరిశీలకులు రాహుల్ గాంధీతో వీడియో కాల్‌లో మాట్లాడినట్టు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అమరీందర్‌ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన అనుభవం సుఖ్‌జిందర్‌కు ఉంది. కాంగ్రెస్‌కు వీరవిధేయుడిగా సుఖ్‌జిందర్‌ సింగ్ కి  పేరు ఉంది.

కాగా, ఓ దశలో కొత్త సీఎంగా పీపీసీసీ మాజీ చీఫ్ సునీల్ జాఖర్ పేరు బలంగా వినిపించినప్పటికీ చివరి నిమిషంలో పార్టీ పునరాలోచనలో పడినట్టు చెబుతున్నారు. హిందూ నేతను ఎంపిక చేయాల్సి వస్తే రాజ్యసభ సభ్యురాలు అంబికా సోని పేరు ప్రతిపాదించే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో సిక్కు నేతకే సీఎం పగ్గాలు ఇవ్వాలని అంబికా సోని అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది. పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ రేసులో ఉన్నప్పటికీ పలువురు సీనియర్లు ఆయన అభ్యర్థిత్వం పట్ల సముఖంగా లేనట్లు వార్తలు వినిపించాయి. నవజ్యోత్ సింగ్ సిద్ధూను కానీ, ఆయన అనుయాయులను కానీ సీఎంగా ప్రకటిస్తే అసెంబ్లీలో బలపరీక్షకు కెప్టెన్ అమరీందర్ డిమాండ్ చేసే అవకాశాలను కూడా అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో సిక్కు నేత, క్యాబినెట్ మంత్రిగా ఉన్న సుఖ్‌జిందర్‌ సింగ్  వైపే అధిష్టానం మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.

అమరీందర్ రాజీనామా-సీఎల్ఫీ భేటీ వాయిదా

ఇటీవల పంజాబ్ పీసీసీ పగ్గాలు నవజోత్ సింగ్ సిద్దూకి అప్పగించడంపై అమరీందర్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సిద్దూ,అమరీందర్ మధ్య చాలాకాలం పాటు కోల్డ్ వార్ నడిచింది.దీంతో ఇద్దరినీ ఢిల్లీకి పిలిచి సయోధ్య కుదిర్చే ప్రయత్నం జరిగింది. అయితేఇటీవల ఈ కోల్డ్‌వార్ సద్దుమణిగినట్లు కనిపించినప్పటికీ… తాజా పరిస్థితులు గమనిస్తుంటే ఇరువురి మధ్య గ్యాప్ ఇంకా కొనసాగుతున్నట్లుగానే ఉంది. సిద్దూ ప్రోద్బలంతోనే అమరీందర్ సింగ్‌ వ్యతిరేక వర్గం ఆయనపై తిరుగుబాటు చేస్తూ వస్తోందనే వాదన ఉంది. తాజాగా అమరీందర్ వ్యతిరేక వర్గం అధిష్ఠానానికి లేఖ రాయడం వెనుక కూడా సిద్దూ హస్తం ఉందనే వాదన లేకపోలేదు. అటు అమరీందర్ సింగ్ కూడా అధిష్టానం తన ప్రాధాన్యతను తగ్గిస్తూ వస్తోందనే భావనలోనే ఉన్నారు.ఇంత ఒత్తిడి నడుమ సీఎంగా కొనసాగడం కంటే రాజీనామా చేయడమే ఉత్తమమని ఆయన భావించినట్లు తెలుస్తోంది.

సగానికి పైగా ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉండటం, పార్టీ హైకమాండ్‌ ఒత్తిడి చేయడంతో అమరీందర్ కు విధిలేని పరిస్థితులు ఎదురయ్యాయి. బలాన్ని తెలుసుకోవడానికి తన ఫామ్‌హౌస్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పంపిస్తే 13 మంది ఎమ్మెల్యేలే వచ్చారు. దాంతో ఆయనకు సీఎల్‌పీలో ఎదురయ్యే పరిస్థితి ఏంటో అర్థమైంది. అందుకే పార్టీలో తనకు అవమానం జరిగిందంటూ కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ సీఎం పదవికి శనివారం రాజీనామా చేశారు. అప్పటి నుంచి​ తదుపరి సీఎంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

శనివారం సాయంత్రం సీఎల్​పీ భేటీ జరిగినప్పటికీ.. అందులో స్పష్టత రాలేదు. అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ఎవరి పేరు చెబితే.. వారే సీఎం అని కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు తీర్మానించారు. అయితే ఈ విషయంలో అధిష్ఠానం ఇప్పటికీ తర్జనభర్జన పడుతున్నట్టు తాజా పరిణామాలు గమనిస్తే అర్థమవుతుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎల్​పీ భేటీ జరగాల్సి ఉంది. హైకమాండ్​ నుంచి స్పందన లేకపోవడం వల్ల చివరి నిమిషంలో భేటీ వాయిదా పడింది.