30 years దోస్త్ మేరా దోస్త్ : పేద ఫ్రెండ్ కి ‘ఇల్లు’ గిఫ్ట్‌ ఇచ్చిన క్లాస్ మేట్స్..

  • Published By: nagamani ,Published On : November 20, 2020 / 05:03 PM IST
30 years దోస్త్ మేరా దోస్త్ : పేద ఫ్రెండ్ కి ‘ఇల్లు’ గిఫ్ట్‌ ఇచ్చిన క్లాస్ మేట్స్..

Tamil Nadu: స్నేహం.సృష్టిలో తీయనిది..కడదాకా నిలిచేది. నిజమైన స్నేహం ఎన్ని కష్టాలు వచ్చిన చెడిపోదు. స్నేహితులు కష్టంలో ఉన్నారని తెలిస్తే రెక్కలు కట్టుకుని ఎగిరి వెళ్లి వాలిపోతారు. డార్లింగ్ సినిమాలో తరచూ కలుసుకుని సెలబ్రేట్ చేసుకునే స్నేహితులు కష్టనష్టాల్లో కూడా తోడుగా నిలిచారు. కానీ అది సినిమా. అటువంటి స్నేహితులు నిజంగా ఉంటారా? తోటి స్నేహితులు కష్టాల్లో ఉంటే ఆదుకుంటారా? అంటే నిజమే అంటాం తమిళనాడులో కొంతమంది స్నేహితులు చేసిన గొప్ప పని తెలుసుకుంటే..



ప్రస్తుత కాలంలో పాత స్కూల్స్ మేట్స్. .క్లాస్ మేట్స్ తిరిగి చాలా సంవత్సరాల తరువాత కలుసుకోవటానికి గెట్ టూ గెదర్ లు పెట్టుకుంటున్నారు. సాధ్యమైనంతమంది కలుస్తారు. ఒక రోజంతా ఆడుకుంటూ పాడుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుని సంతోషపడిపోతుంటారు. అపుడు నువ్వలాఉన్నావ్..నాతో తగవులు పెట్టుకున్నావ్..అలా చేశాం..ఇలా చేశాం అంటూ పాత సంగతులన్నీంటినీ నెమరువేసుకుంటారు. తరువాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతారు.




https://10tv.in/karnataka-mysuru-barber-rs-50000/
తరువాత గ్రూపుల్లో గుడ్ మార్నింగ్ లు, గుడ్ నైట్ లు, పుట్టినరోు శుభాకాంక్షలు, పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. కానీ వారిలో ఓ స్నేహితుడు దుర్భర కష్టాల్లో ఉన్నాడని తెలిస్తే ఎంతమంది ముందుకొస్తారు అతన్ని ఆదుకోవటానికి అంటే ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే..కానీ అటువంటి ఓ స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని ఇల్లు లేక..కరోనా వచ్చి నానా కష్టాలు పడుతున్నాడని తెలిసి స్నేహితులంతా ఒక్కటయ్యారు. అతనికి ఓ ఇల్లు కట్టి ఇచ్చారు.


వివరాల్లోకి వెళితే..వారంతా స్కూల్‌కు వీడ్కోలు చెప్పి 30 ఏళ్లు అవుతుంది. అంతకాలం అయినా పాత స్నేహితులను మరచిపోలేదు. చదువులు పూర్తిచేసుకుని..ఉద్యోగాలు, పెళ్లిళ్లు ఇలా అందరూ వేరే వేరే ప్రాంతాల్లో సెటిల్ అయ్యారు. ఎవరి జీవితాల్లో వారు బిజీ బిజీ అయిపోయారు. కుటుంబాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ఎవరి బాధ్యతల్లో తలమునకలైనా.. వారి స్నేహం కొనసాగిస్తూనే ఉన్నారు.



కాలం వేగంగా మారి పరుగులు పెడుతున్నక్రమంలో తమ పాత స్నేహితుడు.. సరైన ఉపాధి లేక నిరుపేద జీవితాన్ని గడపడం ఆ స్నేహితుల గుండెకు భారంగా అనిపించింది. అతడి పేదరికానికి కరోనా వైరస్ తోడైంది. జీవితాన్ని మరింత దయనీయంగా మార్చేసింది. అది తెలుసుకున్న స్నేహితులంతా ఒక్కటయ్యారు.


ఎప్పుడు కూలిపోతుందో తెలియని గుడిసెలో.. భార్య, పిల్లలతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఆ స్నేహితుడిని ఆదుకోవాలను మిత్రులంతా కలిసి. ఒక నిర్ణయానికి వచ్చారు. వారే స్వయంగా ఒక ఇల్లు కట్టి నవంబర్ 14, 2020 న వచ్చిన ఈ దీపావళికి కానుకగా ఇచ్చారు. ఆ స్నేహితుడి కళ్లల్లో కోటి దీపాల వెలుగుల్ని నింపారు. తమిళనాడులోని పుడుక్కొట్టైలో ఈ ఘటన చోటుచేసుకుంది.


పూర్తి వివరాల్లోకి వెళితే..పుడక్కొట్టైలోని 44 ఏళ్ల ముత్తుకుమార్ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇంతలో కరోనా వల్ల వచ్చిన లాక్‌డౌన్.. ముత్తును మరిత కష్టాల్లోకి నెట్టేసింది. లాక్‌డౌన్‌కు ముందు ముత్తు నెలకు రూ.10 వేలు నుంచి రూ.15 వేలు సంపాదించుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. కానీ లాక్‌డౌన్ తర్వాత అతని ఆదాయం రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పడిపోయింది.




అప్పటికే అంటే 2018 నవంబర్ లో విరుచుకుపడిన గజా తుఫాన్ వల్ల అతడి గుడిసె బాగా దెబ్బతింది. ఆర్థిక సమస్యల వల్ల ముత్తు ఆ గుడిసెకు కనీస మరమత్తులు కూడా చేయించుకోలేకపోయాడు. అప్పటి నుంచి కూలిపోయే స్థితిలో ఉన్న ఆ గుడిసెలోనే నివసిస్తున్నాడు. దానికి తోడు కరోనా దెబ్బ ఇక కోలుకోలేకపోయాడు. రోజు గడవటమే కష్టంగా మారింది.




ఈక్రమంలో ముత్తు కుమార్ గత సెప్టెంబర్ నెలలో తమ స్కూల్ టీచర్ ఇంటికి వెళ్లాడు. అక్కడ తన స్కూల్ ఫ్రెండ్ కె.నాగేంద్రన్‌ను కలిశాడు. చాలాకాలానికి కలుసుకోవటంతో ఇద్దరు కౌగలించుకుని క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముత్తు కుమార్ నాగేంద్రన్‌ను తన ఇంటికి ఆహ్వానించాడు. ముత్తు ఇంటికి వచ్చిన నాగేంద్రన్‌కు ముత్తు ఇల్లు చూసేసరికి అతను ఎంత కష్టంలో ఉన్నాడో అర్థం అయిపోయింది. నాగేంద్ర ఎంతగానో బాధపడ్డాడు. ముత్తుకు ఎలాగైనా సరే సహాయం చేయాలని అనుకన్నాడు నాగేంద్రన్.



ముత్తు ఇంటిని తన ఫోన్ తో ఫోటోలు తీసి తమ స్కూల్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. ఆ ఫోటోలు చూసిన మిగతా స్నేహితులంతా కూడా బాధపడ్డారు. మేం సహాయం చేస్తామంటే మేం చేస్తాం అంటూముందుకొచ్చారు.



అలా స్నేహితులంతా కలిసి తలా చేయి వేశారు. రూ. 1.5 లక్షలతో మూడు నెలల్లోనే ఇల్లు కట్టి ముత్తూకు ఇచ్చారు. ఇందులో చిత్రమైన విషయం ఏమిటంటే.. ముత్తు స్నేహితులు ఇంజినీర్ల సాయం లేకుండానే స్వయంగా ఆ ఇల్లు వారే కట్టారు. అలా కట్టిన ఆ ఇంటిని దీపావళి కానుకగా ముత్తుకు అందించారు.

ఆ ఇంటికి సమీపంలోనే ముత్తు తల్లి కోసం ప్రత్యేకంగా ఒక గుడిసె కూడా కట్టారు. తల్లికి ముత్తుతో కలిసి ఉండే కంటే కొడుకును చూసుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకంగా తన ఓపిక ఉన్నంత వరకూ ఉండటమే ఇష్టమని తెలిసి ఆమెకు కూడా ఓ ఇల్లు కట్టి ఇచ్చారు.



స్నేహితులు కట్టి ఇచ్చిన ఇంటి గురించి ముత్తు మాట్లాడుతూ..‘నేను పుట్టినప్పటి నుంచి ఇదే ఈ గుడిసెలోనే ఉంటున్నా..ట్రక్కు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా.. లాక్‌డౌన్ వల్ల వచ్చే ఆదాయం తగ్గిపోయింది. అలా గత ఆరు నెలల నుంచి చాలా కష్టాలు పడుతున్నా. తుఫాన్ సమయంలో చెట్లు పడిపోయి.. నా ఇల్లు ధ్వంసమైంది. ఇప్పటికీ దాన్ని బాగు చేయించుకోలేకపోయాను. వేరేదారి లేక ఆ ఇంట్లోనే జీవించాల్సి వస్తోంది. నా సమస్య తెలుసుకుని స్నేహితులు ఆదుకున్నారు. వారి సాయాన్ని ఎప్పటికీ మరవలేనని తెలిపాడు.


ముత్తుకు ఇల్లు నిర్మించటానికి ప్రధాన పాత్ర వహించిన నాగేంద్రన్ మాట్లాడుతూ.. ‘‘మన జీవితంలో స్కూల్ రోజులు చాలా చాలా ప్రత్యేకం. స్కూల్ ఫ్రెండ్స్ కూడా చాలా ప్రత్యేకమైనవాళ్లు. అనేళ్లు వారితో టచ్‌లో ఉండటం కూడా కష్టమే. వారిలో ఎవరు కష్టంలో ఉన్నా అంత కలిసి ఆదుకోవాలి. ఈ లాక్‌డౌన్‌లో చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. మీ స్నేహితులు ఎవరైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కుంటున్నారని తెలిస్తే.. తప్పకుండా సాయం చేయండి’’ అని సూచించాడు.