ఆలయ భూ వివాదంలో పూజారిని సజీవ దహనం చేసిన నిందితులు

  • Published By: murthy ,Published On : October 9, 2020 / 04:33 PM IST
ఆలయ భూ వివాదంలో పూజారిని సజీవ దహనం చేసిన నిందితులు

Temple priest burnt alive : రాజస్ధాన్ లో ఘోరం జరిగింది. ఆలయ నిర్వహణ కోసం ఇచ్చిన భూవివాదంలో కొందరు వ్యక్తులు ఆలయ పూజారిని సజీవ దహనం చేసిన ఘటన వెలుగు చూసింది. రాజస్ధాన్ లోని జైపూర్ కు 177 కిలోమీటర్ల దూరంలోని కరౌలీ జిల్లాలోని ఓ గ్రామంలో రాధాకృష్ణ ఆలయంలో ధూప దీప నైవేద్యాలు, పూజల నిర్వహణ కోసం 5.2 ఎకరాల భూమిని గ్రామ పెద్దలు ఆలయ పూజారి బాబాలాల్ వైష్ణవ్ కి(50) అప్ప చెప్పారు.

ఆ భూమిలో ఒక పక్కన ఇల్లు నిర్మించుకునేందుకు పూజారి ప్లాట్ చదను చేసే పని చేపట్టారు. దీన్ని ఒప్పుకోని గ్రామంలో ఆధిపత్యం ఉన్న మీనా వర్గీయులు అభ్యంతరం చెప్పారు. ఆభూమి తమదని అందులో నిర్మాణాలు చేపట్టవద్దని వారు అభ్యంతరం చెప్పారు. వివాదం పెద్దదై గ్రామ పెద్దల వద్దకు చేరింది. వారు పూజారికి అనుకూలంగా తీర్పు చెప్పారు.



గ్రామ పెద్దలు తీర్పు చెప్పటంతో పూజారి భూమి చదును చేసి… ఆ భూమిలో తన పంట దిగుబడిని ఉంచాడు. పూజారి చదును చేసిన స్ధలంలో గుడిసె నిర్నించేందుకు మీనా వర్గానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పూజారికి, వారికి మధ్య ఘర్షణ చెలరేగింది. స్ధలంలో ఉంచిన పంటకు నిందితులు నిప్పు పెట్టారు.

అదే సమయంలో పూజారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారని పోలీసులుకిచ్చిన మరణ వాంగ్మూలంలో పూజారి వివరించాడు. కాలిన గాయాలతో పూజారి జైపూర్ లోని ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం అక్టోబర్ 8వ తేదీ రాత్రి కన్నుమూశాడు.



నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిలో కైలాష్ మీనా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. శంకర్, నామో మీనా తో సహా మరో ముగ్గురు నిందితులు కోసం గాలింపు చేపట్టినట్లు సీనియర్ పోలీసు అధికారి హర్జీ లాల్‌ యాదవ్‌ చెప్పారు.