పాండిచ్చేరిలో కాంగ్రెస్ కు వరుస షాక్ లు : మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా

పాండిచ్చేరిలో కాంగ్రెస్ కు వరుస షాక్ లు : మరో ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా

Three more Congress MLAs resign : పాండిచ్చేరి మరో మధ్యప్రదేశ్, గోవా కాబోతుందా…? కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అంచున నిల్చుందా..? తాజా పరిణామాలు చూస్తే అంతే అనిపిస్తుంది. అధికార పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఇవాళ మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. వారిలో ముఖ్యమంత్రి నారాయణస్వామి అనుంగు అనుచరుడు జాన్ కుమార్ కూడా ఉండడం అందరినీ నివ్వెర పరిచింది. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జాన్ కుమార్ రాజీనామా చేసిన తర్వాత మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదే బాటలో నడిచారు.

ముఖ్యమంత్రి నారాయణ స్వామి అత్యవసరంగా క్యాబినెట్‌ సమావేశం ఏర్పాటు చేశారు. అటు ప్రభుత్వం మైనార్టీలో పడిందని, వెంటనే అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని అన్నాడీఎంకె డిమాండ్ చేస్తోంది. పాండిచ్చేరి అసెంబ్లీకి మేలో ఎన్నికలు జరగనున్నాయి. మరికొన్ని రోజుల్లో రాహుల్ గాంధీ పాండిచ్చేరి పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ లోపు ఇలాంటి పరిణామాలు జరగడంపై కాంగ్రెస్‌ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

పాండిచ్చేరి పరిణామాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. గత నెల 25న మంత్రి ఎ. నమశ్శివాయన్, ఇ. తిప్పైంజన్ రాజీనామాలతో మొదలైన సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ గత ఏడాది జులైలో ధనవేలు అనే ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశారు. నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే, తెలుగు వ్యక్తి మల్లాడి కృష్ణారావు రాజీనామా సమర్పించారు. మల్లాడి రాజీనామాపై చర్చ జరుగుతుండగానే ఈ ఉదయం జాన్ కుమార్ రాజీనామా చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది.

నామినేటెడ్ సభ్యులతో కలిపి పాండిచ్చేరి అసెంబ్లీలో 33 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ 15 సీట్లు గెలిచింది. డీఎంకె మూడు స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, డీఎంకె కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో కాంగ్రెస్ బలం పదిలోపుకు పడిపోయింది. మరో వైపు ప్రతిపక్ష బీజేపీ-అన్నాడీఎంకెకు ఇప్పుడు 14 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. వారిలో నలుగురు అన్నాడీఎంకె ఎమ్మెల్యేలు కాగా, AINRC పార్టీ ఎమ్మెల్యేలు ఏడుగురు ఉన్నారు. బీజేపీకి ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.