ఉన్నావో రేప్ కేసు…యాపిల్ కంపెనీకి ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు

ఉన్నావో రేప్ కేసు…యాపిల్ కంపెనీకి ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు

ఉన్నావ్ రేప్ కేసులో టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2017లో ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ సిటీలో 17 ఏళ్ల బాలికపై బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్ సెంగార్ అత్యాచారం చేశార్నన ఆరోపణలతో ఆయన ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. 

అయితే ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ జిల్లా జడ్జి ధర్మేష్ శర్మ…బాలికపై అత్యాచారం చేసిన రోజు ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ఎక్కడ ఉన్నారు? ఆయన లొకేషన్‌ను బహిర్గతం చేయాలని ఐ ఫోన్ల తయారీ సంస్థ ‘యాపిల్’ ను  ఆదేశించారు. ఎమ్మెల్యే ఉన్న లొకేషన్ ఈ నెల 28వతేదీలోగా అందజేయాలని జడ్జి ఆదేశించారు. అత్యాచార ఘటనలో ఎమ్మెల్యే లొకేషన్ వెల్లడైతే సాంకేతికపరంగా ఈ కేసులో ప్రధాన ఆధారం కానుంది. అత్యాచార బాధిత బాలిక తండ్రి హత్య ఘటన గురించి కోర్టు సీఐఎస్ఎఫ్ అధికారి ఇచ్చిన సాక్ష్యాన్ని కోర్టు జడ్జి రికార్డు చేశారు. 

ఆయుధ చట్టం కింద అత్యాచార బాధితురాలి తండ్రిని ఏప్రిల్ 3, 2018న పోలీసులు అరెస్టు చేయడం… ఆరు రోజుల తరువాత అతను జ్యుడీషియల్ కస్టడీలో మరణించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేనే ఈ హత్య చేయించాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.