అత్యాచారం కేసు, 20 ఏళ్ల పాటు జైలులో..నిర్ధోషిగా హైకోర్టు తీర్పు

అత్యాచారం కేసు, 20 ఏళ్ల పాటు జైలులో..నిర్ధోషిగా హైకోర్టు తీర్పు

Falsely accused of rape

20 years in jail : ఒక సంవత్సరం కాదు..రెండు సంవత్సరాలు కాదు..ఏకంగా 20 ఏళ్ల పాటు జైలులో జీవితం గడిపాడు. తర్వాత..నిర్దోషి అంటూ..కోర్టు తీర్పును వెలువరించింది. జైలుకు వెళ్లినప్పుడు అతని వయస్సు 23 ఏళ్లు. తన జీవితం మొత్తం జైలులోనే గడిచిపోయిందని, తప్పుడు కేసులు బనాయించడంతో సర్వం కోల్పోయానని ఆ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం తన వయస్సు 43 సంవత్సరాలు. తనకు న్యాయం జరగాలని పోరాటం చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలిపాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో లలిత్ పూర్ లో చోటు చేసుకుంది.

విష్ణు తివారీ లలిత్ పూర్ లో నివాసం ఉంటున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఓ యువతి అత్యాచారం కేసు పెట్టింది. పనికి వెళ్లి తిరిగి వస్తుండగా..నోరు నొక్కేసి తనపై విష్ణు తివారీ అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు యువతి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. 2000 సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన పోలీసులు విష్ణును అరెస్టు చేశారు. తాను తప్పు చేయలేదని వాదించాడు. కేసు విచారణ జరుగుతుండగా..అతడు మూడేళ్ల పాటు జైలులో ఉండిపోయాడు. విచారించిన లలిత్ పూర్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం ప్రకారం జీవిత ఖైదును విధిస్తున్నట్లు ప్రకటించింది.

ట్రయల్ కోర్టును సవాల్ చేస్తూ..అలహా బాద్ హైకోర్టు మెట్లు ఎక్కాడు. ఇక అక్కడి నుంచి కథ ప్రారంభమైంది. లలిత్ పూర్ జైల్ నుంచి ఇతడిని ఆగ్రా సెంట్రల్ జైల్ కు తరలించారు. విచారణ ఏళ్లకు ఏళ్లు పట్టింది. జనవరి నెలాఖరులో హైకోర్టు డివిజన్ కోర్టు విష్ణును నిర్దోషిగా తేల్చింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. 14 ఏళ్లు జైలు శిక్ష పూర్తయిన తర్వాత..సంబంధిత శాఖ అతడి గురించి పట్టించుకోకపోవడం శోచనీయమని వెల్లడించింది. వాస్తవానికి తగిన ఆధారాలు కనిపించలేదని, వైద్యుల రిపోర్టులో అత్యాచారం జరిగినట్ల ఆనవాళ్లు లేవని, ఇది పూర్తిగా తప్పుడు కేసుగా భావిస్తున్నట్లు తెలిపింది. అతడి తప్పు లేకపోయినా…జైలు శిక్ష అనుభవించాడని తుది తీర్పును వెలువరించింది.

హైకోర్టు తీర్పు అనంతరం జైలు నుంచి విడుదల కావడానికి అతడికి మరో నెల రోజుల సమయం పట్టింది. ఎట్టకేలకు బుధవారం అతడు జైలు నుంచి విడుదలయ్యాడు. దీనిపై ఆవేదన వ్యక్తం చేశాడు. జైలుకు వెళ్లే సమయానికి తనకు పెళ్లి కాలేదు. అమ్మ..నాన్న చనిపోయారని తెలిపాడు. ప్రస్తుతం అన్న ఉన్నా..అతని కుటుంబం అతనిదేనని, జైలులో సంపాదించినవి కేవలం రూ. 600 మాత్రమే ఉన్నాయని వాపోయాడు. బస్సులో సొంతూరుకు వెళ్లిన అనంతరం గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అతనికి అండగా ఉంటామని ప్రకటించారు.