క్రాస్‌ రోడ్‌లో కాంగ్రెస్ : సైకిల్ ఎక్కుతున్న నేతలు

అమరావతి: ఏపీ కాంగ్రెస్ నేతలు ఎందుకు టీడీపీ బాట పడుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందనే భావనలో వారున్నారా.. ఒక వైపు రాహుల్.. చంద్రబాబుతో

  • Published By: veegamteam ,Published On : February 6, 2019 / 07:56 AM IST
క్రాస్‌ రోడ్‌లో కాంగ్రెస్ : సైకిల్ ఎక్కుతున్న నేతలు

అమరావతి: ఏపీ కాంగ్రెస్ నేతలు ఎందుకు టీడీపీ బాట పడుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందనే భావనలో వారున్నారా.. ఒక వైపు రాహుల్.. చంద్రబాబుతో

అమరావతి: ఏపీ కాంగ్రెస్ నేతలు ఎందుకు టీడీపీ బాట పడుతున్నారు. రాష్ట్రంలో మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తుందనే భావనలో వారున్నారా.. ఒక వైపు రాహుల్.. చంద్రబాబుతో దోస్తీకి సై అంటుంటే.. ఏపీలో కాంగ్రెస్ నేతలు మాత్రం పార్టీని కాదని బాబుకు జై కొడుతున్నారు.. కిరణ్ రెడ్డి లాంటి నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల నాటికి మెజార్టీ కాంగ్ నేతలు సైకిలెక్కబోతున్నారా.

 

జాతీయ స్థాయిలో టీడీపీ కాంగ్రెస్‌తో జత కట్టింది. దీంతో… ఏపీలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని కాంగ్రెస్ సీనియర్లు భావించారు. కానీ… ఆ పరిస్థితి లేదని హైకమాండ్ స్పష్టం చేయడంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఫైలుపైనే తొలి సంతకం పెడతామని కాంగ్రెస్ స్పష్టమైన హామీ ఇచ్చింది. కాంగ్రెస్‌తో జతకట్టేందుకు ఇదే ప్రధాన ప్రాతిపదికని టీడీపీ చెబుతోంది. అయినా.. ఏపీలో కాంగ్రెస్ నేతలు మాత్రం.. దీని వల్లే తమ పార్టీకి అనూహ్యంగా ఓట్లు వచ్చేవి కాదని అభిప్రాయానికొచ్చేశారు.. టీడీపీతో పొత్తు ఉంటే సర్దుబాట్లలో భాగంగా కొన్ని సీట్లు వచ్చేవని కాంగ్రెస్ సీనియర్లు భావించారు. కానీ.. ఒంటరి పోరే అని హైకమాండ్ ప్రకటించడంతో సీనియర్లు సైతం పార్టీని వీడడానికి సిద్దమవుతున్నారు.

 

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్లు.. మాజీ కేంద్ర మంత్రులు వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు ఇప్పటికే టీడీపీలో చేరేందుకు సిద్దమైపోయామన్న సంకేతాలు పంపుతున్నారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేశారు. వీరిలాగానే యూపీఏ 2లో ఉత్తరాంధ్ర నుంచి కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన ఓ నేత, నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మాజీ కేంద్ర మంత్రి కూడా టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారంటున్నారు. టీడీపీతో పొత్తు ఎలాగూ లేదు.. సింగిల్‌గా కాంగ్రెస్‌కు ఏపీలో ఏం ఆశించలేమంటూ ఆ పార్టీ నేతలే మాట్లాడుతున్నారు. ఒక వేళ కేంద్రంలో కాంగ్రెస్ పెద్దన్న పాత్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే.. ఏదో కొందరు నేతలకు రాజకీయంగా పదవులు దక్కుతాయోమో కానీ.. కాంగ్రెస్ పార్టీ ఎదగడానికి స్కోప్ లేదని పార్టీలోనే కొందరు నేతలంటున్నారు.. ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు వేరే వేరే దారులు వెతుక్కుంటున్నారు.

 

ఇక ఆ మధ్యనే కాంగ్రెస్‌లో తిరిగి చేరిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. పార్టీలో రాహుల్ సమక్షంలో తిరిగి చేరినప్పుడు .. ఆ తర్వాత విశాఖలో జరిగిన ద్రోణంరాజు సత్యనారాయణ శత వర్థంతి సభలో తప్ప.. కిరణ్ ఆ తర్వాత ఎక్కడా కనిపించడం లేదు.. రఘువీరారెడ్డి , కిరణ్‌ల మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం పార్టీలో బలంగా సాగుతోంది. మాజీ సీఎంగా పనిచేసిన తాను.. రఘువీరా నేతృత్వంలో ఎలా పనిచేస్తాననే భావన కిరణ్‌లో ఉందనేది పార్టీ వర్గాల మాట.. రెండోది యాక్టివ్‌గా ఉంటే.. పార్టీ కార్యక్రమాల కోసం ధన సహాయం కోసం ఆధారపడతారేమోనన్న భయం కూడా కిరణ్ అండ్ టీంలో ఉందంటున్నారు.. ఇప్పటికే కిరణ్ సోదరుడు పీలేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఎలా వ్యవహరిస్తారనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.

 

అయితే కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక పార్టీని వీడుతున్నవారిని, నిరాశలో ఉన్న వారికి చంద్రబాబు అండ్ టీం గాలం వేస్తోంది. రాజకీయంగా పనికొచ్చేవారిని వెంటనే పార్టీలో చేర్చుకోవడానికి చంద్రబాబు వెనుకాడటం లేదంటున్నారు. ప్రధానంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాలే గెలుపు లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. అందుకే బలమైన, ప్రభావిత వ్యక్తులను ఎంపీ అభ్యర్థులుగా రంగంలోకి దించాలనుకుంటోంది.. కొన్ని చోట్ల ఆర్థిక స్థోమత అర్హతగా ఉన్నా.. కొందరి విషయంలో మాత్రం.. వ్యక్తిత్వం.. ఆయా ప్రాంతాల్లో అభ్యర్థి ప్రభావం, గత చరిత్ర ఆధారంగా చంద్రబాబు ఎంపీ అభ్యర్థులపై గురిపెట్టారు.. కర్నూలు నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, అరకు పార్లమెంట్ నుంచి కిశోర్ చంద్రదేవ్‌లు టీడీపీలో చేరితే.. ఖచ్చితంగా ఏదైనా అద్భుతం జరిగితే తప్ప.. టీడీపీ ఖాతాలో ఆ రెండు సీట్లు చేరతాయని విశ్లేషకుల అంచనా.. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కాంగ్రెస్‌ను వీడుతున్న సీనియర్లు ఎవరూ.. వైసీపీ వైపు చూడకపోవడం.. ఏదెమైనా.. ఏపీలో కాంగ్రెస్‌కు ఎదురీత తప్పేలా కనిపించడం లేదు. ఇంకా ఎన్నికల నాటికి ఎంతమంది సీనియర్లు పార్టీ మారుతారో చూడాలి.