కష్టకాలంలో టీడీపీని ఒంటి చేత్తో నడిపిన కరణం బలరాం, ఎందుకు దూరమయ్యారు

జిల్లా రాజకీయాలతో ఆయనది విడదీయరాని బంధం.. ఇంకా సూటిగా చెప్పాలంటే టీడీపీతో ఆయనది మూడున్నర దశాబ్దాల అనుబంధం.. అలాంటి బంధాన్ని ఒక్క రోజులో పేగు

  • Published By: veegamteam ,Published On : March 14, 2020 / 10:51 AM IST
కష్టకాలంలో టీడీపీని ఒంటి చేత్తో నడిపిన కరణం బలరాం, ఎందుకు దూరమయ్యారు

జిల్లా రాజకీయాలతో ఆయనది విడదీయరాని బంధం.. ఇంకా సూటిగా చెప్పాలంటే టీడీపీతో ఆయనది మూడున్నర దశాబ్దాల అనుబంధం.. అలాంటి బంధాన్ని ఒక్క రోజులో పేగు

జిల్లా రాజకీయాలతో ఆయనది విడదీయరాని బంధం.. ఇంకా సూటిగా చెప్పాలంటే టీడీపీతో ఆయనది మూడున్నర దశాబ్దాల అనుబంధం.. అలాంటి బంధాన్ని ఒక్క రోజులో పేగు బంధం కోసం తెంచేసుకున్నారు. అనుబంధమా? పేగు బంధమా? ఏది ముఖ్యమన్న సంఘర్షణ నడుమ నలిగిన ఆయన.. చివరకు పేగు బంధానికే ప్రాధాన్యం ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో అధికార పార్టీతో అనురాగ బంధం పెంచుకోక తప్పలేదు.  

2004లో జిల్లా నుంచి టీడీపీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే:
ప్రకాశం జిల్లాలో టీడీపీ అంటే వెంటనే గుర్తుగు వచ్చేది కరణం బలరాం కృష్ణమూర్తి. చంద్రబాబు కష్టకాలంలో ఉన్న సమయంలో జిల్లాలో టీడీపీని ఒంటిచేత్తో నడిపించిన సమర్ధుడు. 1978లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి శాసనసభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బలరాం.. 1983లో అద్దంకి శాసనసభ్యుడిగా బరిలో నిలిచి, ఆనాటి ఎన్టీఆర్ ప్రభంజనంలో ఓడిపోయారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి, క్రియాశీలక నాయకుడిగా, అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉంటూ తిరుగులేని నేతగా ఎదిగారు. చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీ కష్టకాలంలో సైతం తానున్నానంటూ భరోసాగా నిలబడ్డారు. దివంగత వైఎస్ఆర్ హయాంలో 2004లో జరిగిన ఎన్నికల్లో జిల్లాలో తానొక్కడే గెలిచి, సత్తా చాటుకున్నారు. 

చీరాలలో ఎదురవుతోన్న ఇబ్బందుల నేపథ్యంలో వైసీపీకి మద్దతు:
వైసీపీ అధినేత జగన్ సునామీలో సైతం 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎన్నికలకు కొద్ది రోజు ముందు చీరాల నుంచి పోటీ చేసి తిరుగులేని విజయాన్ని సాధించి తన సత్తా ఏంటో మరోసారి రుజువు చేశారు కరణం బలరాం. తన 42 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ఒక ఎత్తు. చంద్రబాబు ఆదేశాల మేరకు అద్దంకి నుంచి చీరాలలో తన పొలిటికల్ లైఫ్ మొదలైన తర్వాత ఎదురవుతున్న ఇబ్బందులే ఆయనను టీడీపీకి దూరం చేశాయంటున్నారు. చీరాల ఎమ్మెల్యేగా పదవిని చేపట్టిన కరణం బలరాంకు అదే ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్‌తో నిత్యం ఏదో ఒక విషయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. 

తాను పార్టీ కండువా కప్పుకోకుండా కుమారుడిని వైసీపీలో చేర్చించిన బలరాం:
అందుకే గతంలో మాదిరిగా కాకుండా రాజకీయ చతురత ప్రదర్శించారు బలరాం. చీరాలలో యుద్ధం చేయడం కంటే వైసీపీలోని కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేతలతో చనువుగా మెలగడమే బెటరనే ఆలోచనకు వచ్చారట. అందుకే వైసీపీకి బయట నుంచి మద్దతుగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారట. కుమారుడు వెంకటేశ్‌ను మాత్రం వైసీపీలో అధికారికంగా చేర్పించిన ఆయన.. కండువా కప్పుకోకుండానే పార్టీకి మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారు. బాలినేనితో సన్నిహితంగా ఉంటున్నా ఆమంచి నుంచి మాత్రం ఎదురు దాడి తప్పడం లేదు. అందుకే ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చారంటన్నారు. 

కుమారుడి రాజకీయ భవిష్యత్‌ కోసమే టీడీపీకి దూరం:
మరోపక్క, అద్దంకిలో కరణం బలరాంకు గొట్టిపాటి రవికి మధ్య గొడవలున్నాయి. గొట్టిపాటిపై ప్రజల్లో సానుభూతి ఉండడంతో వరుసగా నాలుగు సార్లు గెలిచారు. దీంతో అద్దంకిలో కొనసాగే పరిస్థితులు లేవని కరణం గ్రహించారు. భవిషత్తు రాజకీయాల దృష్ట్యా కుమారుడు వెంకటేశ్‌ కోసం చీరాలలోనే కొనసాగాలనే నిర్ణయానికి వచ్చారట బలరాం. తన అనుచరులుగా ఉన్న పోతుల సునీత వంటి వారిని ముందుగానే వైసీపీలోకి పంపించిన బలరాం… ఇప్పుడు తన కుమారుడిని కూడా వైసీపీలో చేర్పించారట. అంతేనా రెండు పార్టీల్లోనూ తనకు సన్నిహితులుండేలా చేసుకున్నారు. తన ప్రధాన అనుచరుడు యడం బాలాజీని టీడీపీ నియోజకవర్గ బాధ్యుడిగా నియమించేలా చేసిన బలరాం.. ఇప్పుడు వల్లభనేని వంశీ మాదిరిగానే వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారని టీడీపీ నాయకుల మాటగా ఉంది. 

చీరాలను అడ్డాగా మార్చుకొనేందుకు బలరాం ఎత్తులు:
ఎప్పటి నుంచో అద్దంకిలో ఉన్న తనను కాదని గొట్టిపాటి రవికి అవకాశం ఇవ్వడంతో చంద్రబాబుపై కొంత అసంతృప్తిగానే ఉన్నారట బలరాం. అసంతృప్తితో ఉన్న బలరాంను వైసీపీలోకి లాగాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నా ఆయన మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చారట. అన్ని అంచనాలు వేసుకున్న తర్వాత తన కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై మంత్రి బాలినేనితో చర్చించి ఈ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. ఇప్పుడు చీరాలను కూడా తన అడ్డాగా మార్చుకొనేందుకు అన్ని ఎత్తులు వేస్తున్నారట. మరి చీరాలలో వైసీపీ బాధ్యుడిగా ఆమంచి కృష్ణమోహన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయో లేదో చూడాల్సిందే. 

Also Read | ఓ దిశా నువ్వెక్కడ ? : మహిళలకు ఎన్నికల్లో నిలబడే హక్కు లేదా – లోకేష్ ట్వీట్