కొడాలి నానితో వంగవీటి భేటి.. దేవినేనికి చెక్ చెప్పేందుకేనా?

  • Published By: vamsi ,Published On : March 11, 2019 / 03:50 AM IST
కొడాలి నానితో వంగవీటి భేటి.. దేవినేనికి చెక్ చెప్పేందుకేనా?

కృష్ణా జిల్లా వైకాపా రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తెలుగుదేశం గూటికి వెళ్తారు అని అందరూ భావించారు. అయితే ఆయన చేరలేదు. ఈ క్రమంలో బెజ‌వాడ రాజ‌కీయాల్లో తన‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న వంగ‌వీటి రాధా రాజ‌కీయ భ‌విష్య‌త్తు రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెన‌క్కి అన్నట్లుగా సాగుతుంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. జగన్ సెంట్రల్‌లో పని చేసుకోమని.. వంగవీటి రాధాకు సూచించారు. దాని ప్రకారం.. ఆయన అక్కడ పోటీకి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మల్లాది విష్ణును పార్టీలో చేరడంతో ఆయనకు సెంట్రల్ సీటు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వైసీపీకి గుడ్‌బై చెప్పారు వంగవీటి రాధ.
అయితే కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ.. వ్యక్తిగతంగా మంచి మిత్రులు. వైసీపీలో కీలకనేతగా ఉన్న  కొడాలి నానిని వైసీపీకి రాజీనామా చేసిన  వంగవీటి రాధాకృష్ణ కలవడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. గుడివాడలోనొ స్థానిక ఏలూరు రోడ్డులో ఉన్న ఫర్నిచర్‌ పార్క్‌లో నానిని కలిసిన రాధ పలు అంశాలపై చర్చించారు. గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు 24 వేలకు పైగా ఉండగా.. రాధాకృష్ణ వెంట ఆయనకు అత్యంత సన్నిహితులైన కాపు నాయకులు ఉన్నారు. ఈ భేటిలో గుడివాడలో కాపుల బలం కొడాలి నానికి ఉండేలా రాధ పావులు కదిపినట్లు తెలుస్తుంది. గుడివాడలో కోడాలి నానీకి ప్రత్యర్ధిగా దేవినేని అవినాష్ నించున్న సంగతి తెలిసిందే. దేవినేని, వంగవీటి కుటుంబాల మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది.