ఐపీఎల్‌తో బీసీసీఐ వేల కోట్లు ఎలా సంపాదిస్తుంది.. అసలు ఎంత వస్తుందో తెలుసా?

  • Published By: vamsi ,Published On : September 20, 2020 / 01:56 PM IST
ఐపీఎల్‌తో బీసీసీఐ వేల కోట్లు ఎలా సంపాదిస్తుంది.. అసలు ఎంత వస్తుందో తెలుసా?

బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తున్న ధనాధన్‌ లీగ్‌ ఐపీఎల్ లీగ్.. ప్రపంచ క్రికెట్‌లో ఇన్‌కమ్ పరంగా ఈ లీగ్‌ను తలదన్నే టోర్నీనే లేదు.. అసలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కాసుల గలగల అనేంతలా ఈ టోర్నీ మారిపోయింది. అయితే కాసులెలా వస్తాయి. అందులోనూ ఈసారి ప్రేక్షకులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్న.

క్రికెట్ అంటే ఓ మతంగా మారిపోయిన మన ఇండియాలో కోట్లాది మంది ఈ ఆట అంటే పడిచస్తారు. ఆ అభిమానమే.. బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తుంది. ఐపీఎల్‌లో ఆడేందుకు చాలామంది విదేశీ స్టార్ ఆటగాళ్లు కూడా ఆసక్తి చూపిస్తారు.

కొన్నిసార్లు అయితే సొంత దేశానికి ప్రాతనిధ్యం వహించకుండా.. ఐపీఎల్‌ సీజన్‌కు వచ్చేసి ఆడేస్తుంటారు. వాళ్లకి కోట్ల రూపాయలు బ్యాంక్‌ అకౌంట్‌లో వచ్చిపడి పోతాయి. అయితే బయటకు ఖర్చు మాత్రమే కనిపిస్తుంది. అసలు రాబడి ఎక్కడ వస్తుంది. అసలు షుమారు ఎన్ని కోట్లు ఐపీఎల్ వల్ల లాభం ఉంటుంది అంటే..



అసలు వాస్తవానికి ఈ ఏడాది అసలు ఐపీఎల్ జరగదనే అందరూ భావించారు. కరోనా కష్టకాలంలో ఐపీఎల్ అసాధ్యం అని అందరూ అనుకున్నారు. కానీ, అసాధ్యం అనుకున్నది కాస్త సుసాధ్యం అయ్యింది. ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి కరోనా వైరస్ వినాశనం మధ్య, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 6 నెలల ఆలస్యంగా యూఏఈలో ప్రారంభమైంది.

ఐపిఎల్ 13 వ సీజన్ జరగకపోతే, ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బిసిసిఐ మూడు నుంచి నాలుగు వేల కోట్ల నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుందని నివేదికలు ఉన్నాయి. భారీ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, భారత్‌కు బదులుగా ప్రేక్షకులు లేకపోయినా.. యూఏఈలో మ్యాచ్‌లు నిర్వహిస్తుంది బీసీసీఐ.



అయితే, ఈ టోర్నమెంట్ ద్వారా రెండు నెలల్లో వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించవచ్చనే ప్రశ్న ప్రతి ఒక్కరికి తలెత్తుతుంది. ఐపీఎల్‌ను చూడడానికి జనం రాకపోయినా కూడా ఐపిఎల్‌ ప్రసార హక్కులు మరియు స్పాన్సర్‌ల నుంచి బీసీసీఐకి భారీ మొత్తంలో డబ్బులు వస్తాయి.

ప్రసార హక్కులు అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడే మ్యాచ్‌ల ప్రసారం ఏ టీవీ ఛానెల్‌లో ఉంటుంది. ఐపిఎల్ మొదటి సీజన్ 2008 లో జరిగింది. ఆ సమయంలో సోనీ ఎంటర్టైన్మెంట్ ఐపిఎల్ ప్రసార హక్కులను కొనుగోలు చేసింది. కానీ 2017 లో స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ మ్యాచ్‌ల బ్రాడ్‌కాస్ట్ హక్కులను ఐదేళ్లకు రూ .16,300 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే ఐదేళ్లపాటు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఒక మ్యాచ్ కోసం బిసిసిఐకి సుమారు రూ .55 కోట్లు చెల్లించాలి. ఒకవేళ మ్యాచ్‌లు జరగగకపోతు ఆ డబ్బులు మొత్తం కోల్పోవలసి వచ్చేది.



ఇండియన్ ప్రీమియర్ లీగ్ సంపాదనలో 60 శాతం స్పాన్సర్‌తో ముడిపడి ఉంటుంది. స్పాన్సర్‌లో ప్రధానంగా టైటిల్ స్పాన్సర్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ స్పాన్సర్ మరియు మిగిలిన అవార్డులు మ్యాచ్‌కు సంబంధించినవి. 2016-17 సంవత్సరంలో ఐపీఎల్‌కు టైటిల్ స్పాన్సర్‌గా మారడానికి వివో బీసీసీఐకి రూ .400 కోట్లు చెల్లించింది. దీని తరువాత, వివో 2017 నుంచి 2022 వరకు టైటిల్ స్పాన్సర్‌గా మారడానికి బిసిసిఐకి రూ .2200 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది.

అయితే, 2020 సంవత్సరంలో భారత్, చైనా మధ్య వివాదం కారణంగా వివో టైటిల్ స్పాన్సర్‌గా వైదొలగాల్సి వచ్చింది. వివోకు బదులుగా, Dream11 ఇప్పుడు ఐపీఎల్ 2020 సీజన్‌కు టైటిల్ స్పాన్సర్‌గా మారింది. ఇందుకోసం బిసిసిఐకి రూ .222 కోట్లు చెల్లించింది.

బిసిసిఐకి ఐపిఎల్ ఆదాయంలో ఎక్కువ భాగం అందులో పాల్గొనే ఫ్రాంచైజీల నుండి వస్తుంది. మొత్తం 8 జట్లు ఐపీఎల్‌లో పాల్గొంటాయి. ఈ జట్లు ఐపిఎల్ ఫ్రాంచైజీలుగా మారడానికి బిసిసిఐకి భారీ ధర చెల్లించడమే కాదు, ఈ జట్లు తమ సంపాదనలో 20 శాతం ప్రతి సంవత్సరం బిసిసిఐకి ఇస్తాయి. ఇది కాకుండా, ఐపిఎల్ టెలికాస్ట్ హక్కులను విదేశాలలో బిసిసిఐ విడిగా విక్రయిస్తుంది. దీని ద్వారా బిసిసిఐ చాలా డబ్బు సంపాదిస్తుంది. మొత్తంగా ఒక్క ఐపీఎల్‌ ద్వారా బీసీసీఐ మొత్తం రూ. 50వేల కొట్ల వరకు సంపాదిస్తుంది అనేది ఒక అంచనా.