ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు నుంచి మ‌రో జట్టు అధికారికంగా నిష్క్రమణ

ఐపీఎల్ 17వ సీజ‌న్ చివ‌రి అంకానికి చేరుకుంటోంది

ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ రేసు నుంచి మ‌రో జట్టు అధికారికంగా నిష్క్రమణ

PIC Credit @ ANI

IPL 2024 : ఐపీఎల్ 17వ సీజ‌న్ చివ‌రి అంకానికి చేరుకుంటోంది. ప్లే ఆఫ్స్ లో చోటు ద‌క్కించుకునేందుకు జ‌ట్ల మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. అయితే.. రెండు జ‌ట్లు మాత్రం లీగ్ ద‌శ నుంచే ఇంటి బాట ప‌ట్టాయి. నిన్న ముంబై ఇండియ‌న్స్ ఈ సీజ‌న్‌లో లీగ్ ద‌శ నుంచే టోర్నీ నుంచి నిష్క్ర‌మించిన మొద‌టి జ‌ట్టుగా నిల‌వ‌గా తాజాగా పంజాబ్ కింగ్స్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో ఓడిపోవ‌డంతో పంజాబ్ కింగ్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది.

ఇప్ప‌టి వ‌ర‌కు 12 మ్యాచులు ఆడిన పంజాబ్ 4 మ్యాచుల్లో మాత్ర‌మే గెలిచింది. 8 మ్యాచుల్లో ఓడిపోయింది. ఆ జ‌ట్టు ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి. నెట్ ర‌న్‌రేట్‌ -0.423గా ఉంది. పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో నిలిచింది. లీగ్ ద‌శ‌లో మ‌రో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచుల్లో గెలిచినా పెద్ద‌గా ఉప‌యోగం లేదు. అయితే.. ఈ మ్యాచుల్లో పంజాబ్ గెలిస్తే మిగిలిన జ‌ట్ల ప్లే ఆఫ్స్ అవ‌కాశాల‌ను దెబ్బ‌తీయ‌వ‌చ్చు.

Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. రోహిత్, డేవిడ్ వార్న‌ర్‌ల రికార్డు బ‌ద్ద‌లు.. ఐపీఎల్‌లో ఒకే ఒక్క‌డు

ఇదిలా ఉంటే.. గురువారం ధ‌ర్మ‌శాల వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. మొద‌ట బెంగ‌ళూరు బ్యాటింగ్ చేసింది. విరాట్ కోహ్లి (92; 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) తృటిలో శ‌త‌కం చేజార్చుకోగా, ర‌జ‌త్ పాటిదార్ (55; 23 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), కామెరూన్ గ్రీన్ (46; 27 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్‌) లు దూకుడుగా ఆడ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 241 ప‌రుగులు చేసింది.

అనంత‌రం భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో పంజాబ్ కింగ్స్ 17 ఓవ‌ర్ల‌లో 181 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో 60 ప‌రుగుల తేడాతో బెంగ‌ళూరు విజ‌యం సాధించింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో రిలీ రూసొ(61; 27 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) పోరాడినా ఫ‌లితం లేక‌పోయింది. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ సిరాజ్ మూడు వికెట్లు తీశాడు. స్వ‌ప్నిల్ సింగ్‌, లాకీ ఫెర్గూస‌న్‌, క‌ర్ణ్ శ‌ర్మ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

Mumbai Indians : ముంబై ఇండియ‌న్స్ ముక్క‌లైందా? హార్దిక్‌, తిల‌క్ వ‌ర్మల‌ మ‌ధ్య తీవ్ర వాగాద్వం?