ODI World Cup 2023 : ఉప్పల్‌లో ప్ర‌పంచ‌క‌ప్‌ వార్మప్ మ్యాచ్ నిర్వహణపై గందరగోళం..!

సెప్టెంబ‌ర్ 29న ఉప్ప‌ల్ స్టేడియంలో న్యూజిలాండ్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య వార్మ‌ప్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ నిర్వ‌హ‌ణ‌పై గందరగోళం ఏర్ప‌డింది.

ODI World Cup 2023 : ఉప్పల్‌లో ప్ర‌పంచ‌క‌ప్‌ వార్మప్ మ్యాచ్ నిర్వహణపై గందరగోళం..!

Uppal Stadium

ODI World Cup : అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. హైద‌రాబాద్ న‌గ‌ర‌వాసులు నిరాశ‌లో ఉన్నారు. టీమ్ఇండియా ఆడే మ్యాచులు ఒక్క‌టి కూడా భాగ్య‌న‌గ‌రంలో జ‌ర‌గ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఈ బాధ‌లో ఉన్న అభిమానుల‌కు మ‌రో షాక్ త‌గిలింది. సెప్టెంబ‌ర్ 29న ఉప్ప‌ల్ స్టేడియం (Uppal Stadium) లో న్యూజిలాండ్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య వార్మ‌ప్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్పుడు ఈ మ్యాచ్ నిర్వ‌హ‌ణ‌పై గందరగోళం ఏర్ప‌డింది. ఈ మ్యాచ్‌కు ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌కూడ‌ద‌ని హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) నిర్ణ‌యించింది.

ఈ మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు అంటే సెప్టెంబ‌ర్ 28న గ‌ణేష్ నిమ‌జ్జనం, మిలాద్‌ ఉన్‌ నబీ పండ‌లు ఉన్నాయి. దీంతో మ్యాచ్‌కు భ‌ద్ర‌త క‌ల్పించ‌లేమ‌ని హైద‌రాబాద్ పోలీసులు ఇప్ప‌టికే హెచ్‌సీఏకు తెలిపారు. మ్యాచ్ తేదీ మార్చుకోవాల‌ని సూచించారు. ఈ విష‌యాన్ని హెచ్‌సీఏ పెద్ద‌లు బీసీసీఐ దృష్టికి తీసుకువెళ్లారు. ప్ర‌ధాన మ్యాచ్ కాక‌పోవ‌డంతో తేదీ మార్చాల్సిన అవ‌స‌రం లేద‌ని బీసీసీఐ తెలిపింది. దీంతో ప్రేక్ష‌కులు లేకుండా మ్యాచ్ నిర్వహించాల‌ని హెచ్‌సీఏ భావించి ఆ విష‌యాన్ని బీసీసీఐకి తెలియ‌జేసింది.

ఈ మేర‌కు సోమ‌వారం బీసీసీఐకి లెట‌ర్ రాసింది. బీసీసీఐ నుంచి అధికారిక స‌మాచారం కోసం ఎదురుచూస్తున్న‌ట్లు హెచ్‌సీఏ వ్య‌వ‌హారాలు చూస్తున్న జ‌స్టిస్ లావు నాగేశ్వ‌ర రావు పీఏ దుర్గాప్రసాద్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇప్ప‌టికే వార్మ‌ప్ మ్యాచ్ టికెట్ల‌ను ప్రేక్ష‌కుల‌కు విక్ర‌యించారు. ఒక‌వేళ ఫ్యాన్స్‌ను మ్యాచ్‌కు అనుమ‌తించ‌కుంటే టికెట్ డ‌బ్బుల‌ను తిరిగి ఇచ్చేయ‌నున్నారు.

మూడు వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు

ఉప్ప‌ల్ వేదిక‌గా మూడు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. అక్టోబర్ 6న పాకిస్తాన్ తో నెదర్లాండ్స్, అక్టోబర్ 9న న్యూజిలాండ్ తో నెదర్లాండ్స్, అక్టోబర్ 10న పాకిస్తాన్‌తో శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచుల‌కు ఉప్ప‌ల్ స్టేడియం వేదిక కానుంది.

సర్వాంగ సుందరంగా ముస్తాబువుతున్న ఉప్పల్ స్టేడియం

ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచుల కోసం ఉప్ప‌ల్ స్టేడియాన్ని ఆధునీక‌రిస్తున్నారు. ఇప్పటికే స్టేడియం సౌకర్యాలు, అభివృద్ధి కోసం 110కోట్లను బీసీసీఐ కేటాయించింది. ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. కొత్త ఫ్లడ్ లైట్స్, ప్రేక్షకుల సీటింగ్, కొత్త రూప్ టాప్స్, పెయింటింగ్స్, అన్నీ చోట్ల సీసీ కెమెరాలు, ప్రేక్షకుల సౌకర్యం కోసం మరో రెండు లిఫ్ట్ లను ఏర్పాటు చేశారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్టేడియం అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

Asian Games 2023 : చ‌రిత్ర సృష్టించిన ష‌ఫాలీ వ‌ర్మ‌.. సెమీస్ చేరిన భార‌త్‌