ఫిట్‌నెస్ ఫెయిల్: హార్దిక్ పాండ్యా ఔట్

ఫిట్‌నెస్ ఫెయిల్: హార్దిక్ పాండ్యా ఔట్

ఇటీవల షిప్‌‌లో సముద్రం మీద ప్రయాణిస్తూ ఎంగేజ్‌మెంట్ చేసుకుని సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి వచ్చాడు హార్దిక్ పాండ్యా. పిక్కలు, వెన్ను గాయం కారణంగా ఆటనుంచి దూరమైన హార్దిక్.. ట్రీట్మెంట్ తీసుకుని మళ్లీ బరిలోకి దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో భారత జట్టు ఎంపికకు సరిగ్గా ఒక రోజు ముందు అనూహ్య పరిణామం జరిగింది. న్యూజిలాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమయ్యాడు. 

బోర్డు నిబంధనల ప్రకారం తన ఫిట్‌నెస్‌ నిరూపించుకునేందుకు ప్రయత్నించిన పాండ్యా శనివారం జరిగిన పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఇంటర్నేషనల్ ప్రమాణాలకు తగిన విధంగా ఫిట్‌నెస్‌ టెస్టులో సాధించాల్సిన కనీస స్కోరును అందుకోలేకపోయాడు. భారత్‌ ‘ఎ’ జట్టు తరఫున పేరు ప్రతిపాదించడంతో శనివారమే న్యూజిలాండ్‌ బయల్దేరాల్సి ఉంది. 

దీంతో పాండ్యా స్థానంలో మరో ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో చివరిసారిగా భారత్‌కు ఆడిన హార్దిక్‌ చాలా కాలంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవలే కోలుకుని కివీస్ టూర్ కు వెళ్లేందుకు సిద్దమయ్యాడు. అతనిపై నమ్మకం ఉంచి మైదానంలోకి దిగకపోయినా సెలక్టర్లు ‘ఎ’ జట్టుకు ఎంపిక చేసేశారు. ఇప్పుడు ఫిట్‌నెస్ ఫెయిల్ అయి పాండ్యాకు చేదు అనుభవం ఎదురైంది.