INDvsWI: తొలి వన్డే తన్నుకుపోయారు

INDvsWI: తొలి వన్డే తన్నుకుపోయారు

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‍‌లో విండీస్ ప్రతీకారం తీర్చుకుంది. మూడో టీ20ని ఉతికారేసిన భారత బ్యాట్స్‌మెన్‌ను తొలి వన్డేలో పరుగులు చేయకుండా కట్టడి చేయడమే కాకుండా భారత బౌలర్లను శాసించారు కరేబియన్ వీరులు. ముందుగా బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 288 పరుగుల టార్గెట్ ను విండీస్ ముందుంచారు. 

లక్ష్యాన్ని 47.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లే కోల్పోయి విండిస్‌ విజయం  సాధించింది. షిమ్రన్‌ హెట్మెయిర్‌, షై హోప్‌ శతకాలతో చెలరేగడంతో కరీబియన్‌ జట్టు  సునాయాస విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను శుభారంభం చేసింది. భారత్‌కు ఓటమి మూటగట్టుకుంది. 

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ 11 పరుగుల వద్దే తొలి వికెట్‌ కోల్పోయింది. దీపక్‌ చాహర్‌ ఐదో ఓవర్‌లోనే సునిల్‌ ఆంబ్రిస్‌ను 9పరుగుల వద్ద  పెవిలియన్‌కు పంపి భారత శిబిరంలో ఆశలు రేపాడు. తర్వాత  వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హెట్మెయిర్‌, హోప్‌తో కలిసి నిదానంగా ఇన్నింగ్స్‌ ఆరంభించినా తరువాత బ్యాట్‌ ఝుళిపించాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఐదో శతకం పూర్తిచేసుకున్నాడు. 

సెంచరీ తర్వాత ధాటిగా ఆడిన హెట్మెయిర్‌ షమి బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి శ్రేయాస్‌ అయ్యర్‌ చేతికి చిక్కాడు. దీంతో 218 పరుగుల భారీ భాగస్వమ్యానికి తెరపడింది. అప్పటికే విండీస్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. ఆ తరువాత హోప్‌,  నికోలస్‌ పూరన్‌ తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు.   

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ 70, రిషభ్‌పంత్‌ 71 పరుగులతో రాణించారు. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌,  కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విఫలమైనా రోహిత్‌ శర్మ 36  పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో భారత్‌ 80 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ స్థితిలో జోడీ కట్టిన పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగో వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

పంత్, అయ్యర్ కీలక సమయంలో వెనువెంటనే ఔటయ్యారు. తరువాత క్రీజులోకి వచ్చిన కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా ఆరో వికెట్‌కు 59 పరుగులు చేశారు. చివర్లో జాదవ్‌, జడేజా, శివమ్‌దూబె పెద్దగా రాణించకపోవడంతో భారత్‌ 287  పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్‌, కీమో పాల్‌, ఆల్జరీ జోసెఫ్‌ తలో రెండు వికెట్లు తీశారు.   

వెస్టిండీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్‌ తరఫున అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఐదు వన్డే సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టీమిండియాతో తొలి వన్డేలో హెట్‌ మెయిర్‌ ఈ ఫీట్‌ను  నమోదు చేశాడు. టీమిండియాతో మొదటి వన్డేలో హెట్‌మెయిర్‌ సెంచరీతో మెరిశాడు. ఇది హెట్‌మెయిర్‌కు వన్డేల్లో ఐదో సెంచరీ కాగా, 38వ ఇన్నింగ్స్‌. దాంతో ఒక అరుదైన రికార్డును హెట్‌మెయిర్‌ తన పేరిట లిఖించుకున్నాడు. ఇక మూడు వన్డేల  సిరీస్‌లో విండీస్‌ 10తో ముందంజ వేసింది. రెండో వన్డే డిసెంబరు 18న విశాఖపట్నంలో జరుగుతుంది.