ప్రపంచకప్ క్రికెట్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్న ఐసీసీ

  • Published By: vamsi ,Published On : October 15, 2019 / 02:51 AM IST
ప్రపంచకప్ క్రికెట్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్న ఐసీసీ

2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్ భారత్ మర్చిపోదు. అలాగే ప్రపంచకప్ ఫైనల్ ప్రపంచం మర్చిపోదు. ఎంతో ఆసక్తికరంగా న్యూజిలాండ్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన పోరు ‘టై’ కావడంతో విజేతను తేల్చేందుకు ‘సూపర్‌ ఓవర్‌’ ఆడించారు. అది కూడా ‘టై’ అవడంతో బౌండరీల లెక్కతో ఇంగ్లండ్‌ను విశ్వ విజేతగా ప్రకటించారు. దశాబ్దాల తర్వాత విశ్వవిజేతగా ఇంగ్లాండ్ చరిత్రను లిఖించింది.

అయితే ఈ మ్యాచ్ రిజల్ట్ వివాదాలకు కారణం అయ్యింది కూడా. బౌండరీల ద్వారా విజేతను ప్రకటించడం అనేది కరెక్ట్ కాదని, జంటిల్ మెన్ గేమ్ అయిన క్రికెట్లో బౌండరీలకే ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతందని విమర్శించారు మాజీ క్రికెటర్లు సైతం. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఆ దిశగా అడుగులు వేసింది. ఈ క్రమంలో ఓ కమిటీ వెయ్యగా.. ఐసీసీ బోర్డు మీటింగ్‌లో సెమీఫైనల్, ఫైనల్‌ మ్యాచ్‌ల్లో సూపర్‌ ఓవర్‌ ‘టై’ అయితే ఫలితం తేలేవరకు సూపర్‌ ఓవర్లను ఆడిస్తూనే ఉండాలని నిర్ణయం తీసుకుంది.

కేవలం నాకౌట్‌ దశలోనే ఆడించే సూపర్‌ ఓవర్లను ఇకపై లీగ్‌ దశలోనూ ఆడించాలని నిర్ణయం తీసుకుంది. లీగ్ దశలో మాత్రం ‘సూపర్‌ ‘టై’ అయితే మ్యాచ్‌ను ‘టై’గానే పరిగణిస్తారు. ఇదే మీటింగ్‌లో జింబాబ్వే, నేపాల్‌ జట్లపై విధించిన నిషేధంను కూడా ఐసీసీ ఎత్తేసింది. ఇక మహిళల మెగా ఈవెంట్‌ విజేతలకు ఇచ్చే ప్రైజ్‌మనీని ఐసీసీ భారీగా పెంచింది.

టీ20 ప్రపంచకప్‌ విజేతకు 10లక్షల డాలర్లు(రూ.7 కోట్లు), రన్నరప్‌ జట్టుకు 5 లక్షల డాలర్లు(రూ. 3.5 కోట్లు) ఇవ్వాలని నిర్ణయించింది. వన్డే ప్రపంచకప్‌ మొత్తం ప్రైజ్‌మనీని 3.5 మిలియన్‌ డాలర్లు (రూ.24.8 కోట్లకు) పెంచింది. 2021 నుంచి అండర్‌–19 మహిళల టి20 వరల్డ్‌ కప్‌ నిర్వహించాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది.