ఫస్ట్ డేనే ఇరగదీశారు : సిడ్నీ టెస్టులో 300 పరుగులు

  • Published By: veegamteam ,Published On : January 3, 2019 / 09:42 AM IST
ఫస్ట్ డేనే ఇరగదీశారు : సిడ్నీ టెస్టులో 300 పరుగులు

సిడ్నీ టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. ఫస్ట్ డే నే మనోళ్లు ఇరగదీశారు. తొలి రోజు మనదే పైచేయి. నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఫస్ట్ డే ఆట ముగిసే సమయానికి కోహ్లి సేన 4 వికెట్ల నష్టానికి 303 రన్స్ చేసింది. ఛటేశ్వర్ పుజారా మరోసారి సెంచరీతో చెలరేగిపోయాడు. 250 బంతుల్లో 130 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అగర్వాల్ 112 బంతుల్లో 77 రన్స్ చేశాడు. మరో ఎండ్‌లో విహారీ 39 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి నిరాశపరిచినా పుజారా మాత్రం నిలబెట్టాడు. శతకం బాది భారత జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీ రోల్ ప్లే చేశాడు.
18వ సెంచరీ:
సిరీస్‌లో ఇది చివరి టెస్టు. టాస్ గెల్చిన భారత బ్యాటింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లి నమ్మకాన్ని మన బ్యాట్స్‌మెన్ వమ్ము చేయలేదు. ఆసీస్ బౌలర్లలో హేజిల్ వుడ్ 2 వికెట్లు, లియాన్ 1, స్టార్క్ చెరో వికెట్ తీశారు. 199 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో పుజారా సెంచరీ బాదాడు. టెస్టుల్లో అతడికిది 18వ శతకం. ఈ సిరీస్‌లో మూడవది. మొదటి, మూడవ టెస్టుల్లోనూ పుజారా శతకాలు చేశాడు. పుజారా సెంచరీతో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది.