IPL 2023..Jio Cinemas OTT : ఓటీటీపై అంబానీ కన్ను..జియో సినిమా యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు, సబ్‌స్క్రిప్షన్ లేకున్నా ఫ్రీగా చూడొచ్చు..
ముఖేశ్ అంబానీ.. ఏం చేసినా సంచలనమే. అంబానీ కంపెనీ నుంచి కొత్త ప్రాజెక్ట్ వస్తుందంటే.. మార్కెట్‌లో సంచలనం సృష్టించాల్సిందే. అటువంటి అంబానీ..ఓటీటీని టార్గెట్ చేశారా? క్రికెట్ అంటే పూనకాలతో ఊగిపోయే ఇండియాలో.. ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా చూడండంటున్నారు ముకేశ్..

IPL 2023 In Jio Cinemas OTT
IPL 2023..Jio Cinemas OTT : ముఖేశ్ అంబానీ.. ఏం చేసినా సంచలనమే. అంబానీ కంపెనీ నుంచి కొత్త ప్రాజెక్ట్ వస్తుందంటే.. మార్కెట్‌లో సంచలనం సృష్టించాల్సిందే. అటువంటి అంబానీ..ఓటీటీని టార్గెట్ చేశారా? క్రికెట్ అంటే పూనకాలతో ఊగిపోయే ఇండియాలో.. ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా చూడండంటున్నారు ముకేశ్ అంబానీ..
2016 సెప్టెంబర్.. టెలికాం మార్కెట్లో పెనుసంచలనం.. ప్రత్యర్థి కంపెనీలకు అదో విధ్వంసం. అప్పటి వరకూ కాస్త కాస్ట్‌లీ వ్యవహారంగా ఉన్న ఇంటర్నెట్.. జియో సిమ్ ఫ్రీ అనే ఒక్కమాటతో పరిస్థితి రాత్రికి రాత్రే మారిపోయింది. జియో పేరు దేశంలో మార్మోగిపోయింది. వేల కొద్దీ జనం జియో కనెక్షన్ల కోసం కిలోమీటర్ల మేర బారులుతీరారు. ఇంటర్నెట్ ఫ్రీ నినాదంతో వచ్చిన జియో.. మార్కెట్‌లో సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఓవర్‌నైట్ కోట్ల మంది యూజర్లను పట్టేసింది జియో. అప్పటి వరకూ మార్కెట్‌లో ఉన్న ప్రత్యర్థులు దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి. డేటా చార్జీలను కూడా అమాంతం ఆకాశం నుంచి నేలకు దించేడయంతో డేటా వినియోగం పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే డేటా విప్లవమే వచ్చింది. అలాంటిదే మరో సంచలనానికి తెరలేపారు రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ. ఈసారి ఓటీటీ మార్కెట్‌పై కన్నేసిన ఈ అపర కుబేరుడు.. వస్తూవస్తూనే మరో బంపరాఫర్ ప్రకటించేశారు.
ఇండియాలో క్రికెట్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. క్రికెట్ మ్యాచ్‌లంటే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. అందులోనూ ఐపీఎల్ అంటే ఇక చెప్పనేఅక్కర్లేదు. అలాంటి ఐపీఎల్ మ్యాచ్‌లను అరచేతిలో.. ఉచితంగా చూసే అవకాశం కల్పించబోతున్నారు ముఖేశ్ అంబానీ. ఇండియన్స్‌కి అత్యంత ఇష్టమైన ఐపీఎల్ మ్యాచ్‌లను ఓటీటీలో ఫ్రీగా వీక్షించే అవకాశం కల్పించబోతున్నారు. జియో సినిమా యాప్ ద్వారా మార్చి 31 నుంచి జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా వీక్షించేలా బంపరాఫర్ ప్రకటించేశారు. సుమారు 3 గంటల పాటు జరిగే ఒక్కో మ్యాచ్.. ఐపీఎల్ సీజన్ మొత్తం కలిపి దాదాపు 72 మ్యాచ్‌లను ఫ్రీగా చూసేయొచ్చనమాట. గతేడాది జరిగిన బిడ్డింగ్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్‌కి చెందిన వయకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్.. పారామౌంట్ గ్లోబల్ కంపెనీతో కలిసి దక్కించుకుంది. గతంలో స్ట్రీమింగ్ హక్కులు కలిగిన డిస్నీ కంటే.. దాదాపు మూడు రెట్లు ఎక్కువ రేటు పెట్టి మరీ హక్కులను కొనేశారు ఈ ఇండియన్ టైకూన్.
ఐపీఎల్ మ్యాచ్‌ల స్ట్రీమింగ్ హక్కులను సుమారు 2.7 బిలియన్ డాలర్లు అంటే.. దాదాపు 22 వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరీ దక్కించుకుంది రిలయన్స్ గ్రూప్. బిడ్డింగ్‌లో ఉన్న డిస్నీ, అమెజాన్‌ను వెనక్కి నెట్టి మరీ ఈ డీల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. వేల కోట్లు ఖర్చు చేసి హక్కులు కొనుగోలు చేసిన వయకామ్ 18, దాని అనుబంధ సంస్థ.. ఐపీఎల్ మ్యాచ్‌లను వినియోగదారులు ఫ్రీగా చూసే అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. జియో తరహాలోనే ఓటీటీ మార్కెట్‌ను కూడా శాసించేందుకు కొత్త స్ట్రాటజీలతో సిద్ధమైపోయారు అంబానీ. ఇండియాలో క్రికెట్ ఫీవర్‌ని తమకు అనుకూలంగా మలుచుకోవడంతో పాటు.. యూజర్లను తమవైపు తిప్పుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటి వరకూ వినియోగదారులు ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ చెల్లించాల్సి ఉండేది. వాటిని ఉచితంగా అందించడం ద్వారా తొలుత యూజర్లకు దగ్గర కావాలనేది వయకామ్ వ్యూహంగా తెలుస్తోంది.
వేల కోట్లు పోసి హక్కులు కొనుక్కున్న రిలయన్స్ గ్రూప్.. కొత్త మార్కెట్ స్ట్రాటజీలతో ముందుకు రానుంది. యూజర్లకు ఫ్రీగా మ్యాచ్‌లు చూసే అవకాశం కల్పిస్తూ.. యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించేలా ప్రణాళికలు రూపొందించుకుంటోంది. యూజర్లకు ఉచిత సేవలు అందిస్తూ.. యాడ్ రెవెన్యూతోనే మార్కెట్‌ను శాసిస్తున్న గూగుల్, పేస్‌బుక్ వంటి దిగ్గజాల సక్సెస్ సీక్రెట్‌ను అనుసరిస్తోంది. ఇప్పటికే రిలయన్స్ జియోకు 550 మిలియన్లు.. అంటే సుమారు 55 కోట్ల మంది యూజర్లు ఉండడం కూడా మరో ప్లస్ పాయింట్. వీళ్లందరి ఫోన్లలో జియో సినిమా యాప్ ఉంది. అంటే జియో సినిమాకు కూడా 55 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లే. కాకపోతే అందులో కంటెంట్ అప్‌డేటెడ్‌గా లేకపోవడంతో ఎక్కువమంది ఓపెన్ చేయరు. కానీ, అందరితోనూ ఓపెన్ చేయించడమే కాకుండా.. కొత్త వాళ్లను కూడా జియో నెట్‌వర్క్‌లోకి లాగడానికి.. జియో సినిమాలో ఐపీఎల్ మ్యాచ్‌లను ఫ్రీగా స్ట్రీమింగ్ చేయబోతున్నారు అంబానీ. ఈ స్కీమ్‌తో ఓటీటీ మార్కెట్ షేక్ అవుతుందన్న అంచనాలో ఉన్నారు అంబానీ టీమ్.
ఐపీఎల్ మ్యాచ్‌లను జియో సినిమా యాప్‌లో ఫ్రీగా ఇవ్వడం వెనుక మరో వ్యూహం కూడా ఉంది. ఇండియాలో ఆన్‌లైన్ యూజర్ల సంఖ్య రాకెట్ వేగంతో దూసుకెళ్తుంటే.. టీవీ కనెక్షన్ల సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతోంది. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గణాంకాల ప్రకారం.. పే టీవీ వీక్షకుల సంఖ్య కొద్ది సంవత్సరాలుగా తగ్గుతూ వస్తోంది. 2018లో పెయిడ్ టీవీ ఛానళ్లు చూసే టీవీ కనెక్షన్లు16 కోట్లుగా ఉంటే .. 2019లో 13.3 కోట్లకు పడిపోయింది. ఆ తర్వాతి ఏడాది 2020లో 12.9 కోట్లు.. 2021లో 12.5 కోట్లకు తగ్గింది. ఇక 2022లో ఆ సంఖ్య 10.8 కోట్లకు పడిపోయింది. అదే టైంలో.. ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో ప్రస్తుతం యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య దాదాపు 70 కోట్లు. అది 2025 నాటికి 90 కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. ఇంత స్పీడుగా పెరిగిపోతున్న ఇంటర్నెట్ యూజర్లను టార్గెట్ చేసిన అంబానీ.. ఓటీటీలోనూ చక్రం తిప్పేందుకు సిద్ధమైపోయారు.
దేశంలోని ప్రతి ఒక్కరినీ.. ప్రతి మూలకీ చొచ్చుకుపోవాలన్నదే దీని వెనుకున్న అంబానీ కొత్త స్ట్రాటజీ. ఇంటర్నెట్ నుంచి.. బ్రాడ్‌బ్యాండ్.. డీటీహెచ్.. కేబుల్ నెట్‌వర్క్ వరకూ.. స్మార్ట్ ఫోన్ నుంచి.. టీవీ ప్రసారాలు.. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఓటీటీ కంటెంట్ వరకూ.. తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు కంట్రోల్ హోమ్ కాన్సెప్ట్‌తో ముందుకెళ్తున్నారు. ఇంటర్నెట్ ఇండియాలో ప్రతి ఇంటికీ తమ సేవలను దగ్గర చేసేలా కొత్త వ్యూహాలు రచించారు. ఇప్పటికే సుమారు 50 కోట్ల మంది యూజర్లున్న జియో అందుకు ప్రధాన సాధనంగా మారనుంది. జియోని టీవీకి కనెక్ట్ చేయడం ద్వారా.. ఇంటర్నెట్ నుంచి కేబుల్ వరకూ అంతా తన కంట్రోల్‌లోకి తెచ్చుకునేందుకు భారీగానే ప్లాన్ చేశారీ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్.