మీ తరం కాదు: ధోనీపైనే మాన్కడింగా..!!

మీ తరం కాదు: ధోనీపైనే మాన్కడింగా..!!

ఐపీఎల్ సీజన్ 12లోని 4వ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్… రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ఆడింది. ఈ సందర్భంగా రవిచంద్రన్ అశ్విన్.. జోస్ బట్లర్ ను అవుట్ చేసిన విధానం చర్చనీయాంశంగా మారింది. మాన్కడింగ్ విధానం ద్వారా బట్లర్ ను రనౌట్ చేశాడు. మరోసారి ఇదే సీజన్లో మాన్కడింగ్ తెరమీదకి వచ్చింది. అది కూడా స్టంపౌట్ లో స్పెషలిస్ట్ గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ మీదే ప్రయోగించాలని చూశాడు కృనాల్ పాండ్యా. 

చెన్నై బ్యాటింగ్ చేస్తుండగా 14వ ఓవర్లో కేదర్ జాదవ్ స్ట్రైకింగ్ లో.. నాన్ స్ట్రైకింగ్లో మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. కృనాల్ పాండ్యా తన రెండో ఓవర్ ను బౌలింగ్ చేస్తున్నాడు. హఠాత్తుగా వేసే బౌలింగ్ ను ఆపేసి ధోనీపై మాన్కడింగ్ పద్ధతి అమలు చేయాలని చూశాడు. కానీ, ప్రతి క్షణం ఎలర్ట్ గా ఉండే ధోనీ ముందుగా పసిగట్టి కృనాల్ కు ఆ అవకాశం ఇవ్వలేదు. అదే క్షణంలో అక్కడ జరిగిన సన్నివేశాన్ని చూసి వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కాసేపు నవ్వుకున్నాడు. 

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నైకు ముంబై 170 పరుగులు చేసింది. చేధనకు దిగిన చెన్నై 20ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్లు నష్టపోయి 133పరుగులు పూర్తి చేసింది. ఫలితంగా చెన్నై 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఐపీఎల్ సీజన్ 12లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది తొలి ఓటమి.