T20 World Cup 2022: శ్రీలంక జట్టుకు షాకిచ్చిన నమీబియా.. 55 పరుగుల తేడాతో విజయం ..
టీ20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో నమీబియా శ్రీలంకను చిత్తు చేసింది. ఆసియా కప్ గెలిచి ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టిన లంక జట్టుకు ఇది భారీ ఎదురుదెబ్బ. ఈ మ్యాచ్‌లో నమీబియా 55 పరుగుల తేడాతో విజయం సాధించింది.

T20 World Cup
T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్-2022 టోర్నీ షురూ అయింది. ఆస్ట్రేలియాలో జరిగే ఈ మెగా టోర్నీలో భాగంగా శ్రీలంక వర్సెస్ నమీబియా మధ్య తొలిపోరు జరిగింది. ప్రపంచ కప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. వీటిలో ఎనిమిది జట్లు నేరుగా సూపర్ -12లో చోటు దక్కించుకున్నాయి. మరో ఎనిమిది జట్లు సూపర్-12లో బెర్త్ కోసం పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం సైమండ్స్ స్టేడియంలో శ్రీలంక, నమీబియా మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో నమీబియా ఆటగాళ్లు శ్రీలంక జట్టుకు ఊహించని షాక్ ఇచ్చారు.
శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లల్లో ఏడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. నమీబియా ఇన్నింగ్ ఆశించిన స్థాయిలో ఆరంభం కాలేదు. ప్రారంభంలోనే వికెట్లను కోల్పోయింది. వెంటవెంటనే ఓపెనర్లు అవుట్ అయ్యారు. మైఖెల్ వాన్ లింగెన్-3, దివాన్ లా కాక్-9 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. జాన్ ఫ్రైలింక్, జొహాన్నెస్ జొనాథన్ స్మిత్ ధాటిగా ఆడారు. జాన్ ఫ్రైలింక్ 28 బంతుల్లోనే 44 పరుగులు, జొనాథన్ స్మిత్ 16 బంతుల్లో 31 పరుగులు చేశాడు. దీంతో చివరి ఐదు ఓవర్లలో నమీబియా జట్టు 63 పరుగులు రాబట్టింది. ఫలితంగా ఏడు వికెట్లు నష్టపోయి 163 పరుగులు చేసింది.
T20 World Cup: వీడిన ఉత్కంఠ.. భారత్ జట్టులోకి మహ్మద్ షమీ.. బుమ్రా స్థానంలో ఎంపిక
అనంతరం 164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఏ దశలోనూ ప్రత్యర్థి జట్టుకు పోటీ ఇవ్వలేక పోయింది. నమీబియా బౌలర్ల దెబ్బకు లంక బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాటపట్టారు. పాథుమ్ నిస్సాంక(9), కుశాల్ మెండిస్ (6), ధనంజయ డిసిల్వా (12), ధనుష్క గుణతిలక (0), భానుక రాజపక్స(20), కెప్టెన్ దసున్ షనక (29), వనిందు హసరంగ (4), చమిక కరుణరత్నె(5), ప్రమోద్ మధుషన్ (0), దుష్మంత చమీర (8) పరుగులు మాత్రమే చేశారు. దీంతో కేవలం 108 పరుగులకే ఆల్ అవుట్ అవ్వటంతో 55 పరుగుల తేడాతో నమీబియా విజయం సాధించింది.