ఆడిన మ్యాచ్‌లకే డబ్బులు చెల్లించండి

ఆడిన మ్యాచ్‌లకే డబ్బులు చెల్లించండి

Sponsors

Sponsors & Advertisers: ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడిన తర్వాత.. మ్యాచ్‌ల ప్రసార హక్కులు ఉన్న స్టార్‌ ఇండియా ఛానల్‌ తమ స్పాన్సర్లు, ప్రకటనకర్తలకు అండగా నిలిచింది. 2018-2022 ఐదు సంవత్సరాలకు గాను స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానల్‌.. ఐపీఎల్‌ టీవీ, డిజిటల్‌ హక్కులను రూ.16,348 కోట్లకు కొనుక్కోగా.. ఒక్కో మ్యాచ్‌కు రూ.54.5 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ క్రమంలోనే అడ్వర్టైజ్‌మెంట్‌లు కోసం.. పలు బ్రాండ్లు, స్పాన్సర్లకు టైమ్‌స్లాట్‌లను పెద్ద మొత్తంలో అమ్ముకుంది స్టార్‌ ఇండియా. ఈ సీజన్‌లో మొత్తం 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా విరామ సమయాల్లో ప్రకటనల కోసం భారీ డిమాండ్ ఉంది. ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు జరగగా.. 31 మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. దీంతో అడ్వర్టైజ్‌మెంట్లు ఇచ్చేవాళ్లు, స్పాన్సర్లు తీవ్రంగా నష్టపోతున్నారు.

స్పాన్సర్లు భారీ ఎత్తున నష్టపోకుండా.. స్టార్‌ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. స్పాన్సర్లు, అడ్వర్టైజర్లు.. జరిగిన మ్యాచ్‌ల వరకే డబ్బు చెల్లించాలని కోరుతుంది. మిగిలిన డబ్బులు.. బీసీసీఐ ఎప్పుడు మిగిలిన మ్యాచ్‌లను నిర్వహిస్తుందో అప్పుడు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లకే ఇప్పుడు చెల్లింపులు జరపాలని కోరింది.

గతేడాది ఐపీఎల్‌తో పోలిస్తే ఈసారి టీవీ వీక్షకుల సంఖ్య బాగా పెరిగినట్లుగా చెబుతోంది స్టార్ యాజమాన్యం. 2020లో 349 మిలియన్ల మంది వీక్షించగా ఈసారి ఆ సంఖ్య 352 మిలియన్లుగా నమోదైందని బార్క్‌ గణాంకాలు చెబుతున్నాయి.