ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లు జరుగుతాయా? వరల్డ్ కప్ పరిస్థితి ఏంటీ?

ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లు జరుగుతాయా? వరల్డ్ కప్ పరిస్థితి ఏంటీ?

Remaining Ipl 2021 Games Could Be Played Before Or After T20 World Cup

ప్రతి సమ్మర్‌లో సందడి చేసే ఐపీఎల్ మ్యాచ్‌లు.. రెండేళ్లుగా కరోనా కారణంగా వాయిదా పడుతూ.. జరుగుతూ.. సాగుతూ వస్తుంది. గతేడాది సెప్టెంబర్‌లో కరోనా కాస్త తగ్గుముఖం పట్టగా.. యూఏఈలో ఐపీఎల్ నిర్వహించింది బీసీసీఐ. ఐపీఎల్ 14వ సీజన్ మాత్రం భారత్‌లోనే జరగగా.. 29 మ్యాచ్‌ల తరువాత కరోనా కారణంగా వాయిదా వేయాలని నిర్ణయించారు నిర్వాహకులు.

ఐపీఎల్ అత్యవసర పాలక మండలి సమావేశంలో టోర్నమెంట్‌ను వాయిదా వేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి కఠినమైన నిర్ణయం తీసుకుంది. అయితే మిగిలిన 31 మ్యాచ్‌లు ఎప్పుడు ఉండవచ్చో ఐపీఎల్ చైర్మన్ బ్రజేష్ పటేల్ చెప్పినప్పటికీ, ఇక ఆ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందా? అనేది సందేహమే.

ఐపీఎల్ చైర్మన్ బ్రజేష్ పటేల్ ఒక ఛానెల్‌తో మాట్లాడుతూ, “ఐపీఎల్ వంటి టోర్నమెంట్‌ను వాయిదా వేయడం ఎప్పుడూ కష్టమైన నిర్ణయం, అయితే నాలుగు జట్లలో ప్లేయర్లకు కరోనా రావడంతో.. టోర్నమెంట్ షెడ్యూల్‌ను కొనసాగించడం సాధ్యం కాలేదు. నాలుగు జట్ల షెడ్యూల్‌ను మార్చడం కుదరలేదు అని అన్నారు.

లీగ్‌ను తిరిగి ప్రారంభించే ప్రణాళికలు ఏమిటి? అని అడిగినప్పుడు.. ఈ సీజన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లు టి20 ప్రపంచ కప్‌కు ముందు లేదా ఆ తర్వాత జరుగుతాయని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో టీ 20 ప్రపంచ కప్ భారతదేశంలో జరగవలసి ఉంది. అయితే పరిస్థితి అదుపులో లేకపోతే.. ఆ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించే అవకాశం ఉంది.