దాదా డిశ్చార్జ్

దాదా డిశ్చార్జ్

Sourav Ganguly Discharged : ఛాతి నొప్పితో బాధ పడుతూ..కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన బీసీసీ చీఫ్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అందుకే ఇంటికి పంపించామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే..కొన్ని రోజులు పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. కోల్‌కతాలోని తన నివాసంలో ఇంతకుముందు జిమ్‌లో వర్క్ఔట్ చేస్తూ అస్వస్థతకి గురై కిందపడిపోయిన గంగూలీకి.. 2021, జనవరి 27వ తేదీ బుధవారం ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు.

తొలుత గుండెపోటు వచ్చిన సమయంలోనే ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేయగా.. 13 మంది డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఐదు రోజుల చికిత్స అనంతరం 2021, జనవరి 7న గంగూలీ డిశ్చార్జి అయ్యారు. అంతా బాగుందని అనుకోగా.. బుధవారం మరోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు. యాంజియోప్లాస్టీ చేయడంతో గురువారం రాత్రి వరకూ దాదాకు ఐసీయూలోనే వైద్యులు చికిత్సనందించారు. డాక్టర్ దేవీ శెట్టి, డాక్టర్ అశ్విన్ మెహతాలతో కూడిన వైద్య బృందం గంగూలీకి యాంజియోప్లాస్టీ నిర్వహించింది. అతని రక్తనాళాల్లో ఏర్పడిన పూడికలను తొలగించడానికి రెండు స్టెంట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు.

సౌరవ్ గంగూలీ రెండవసారి ఆసుపత్రిలో చేరారని తెలియగానే, కుటుంబ సభ్యులతో సహా క్రికెట్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలాడిన సౌరవ్ గంగూలీ.. మొత్తం 38 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశాడు. ఐపీఎల్‌లోనూ 59 మ్యాచ్‌లాడిన దాదా 106.81 స్ట్రైక్‌రేట్‌తో 1,349 పరుగులు చేశాడు. బౌలర్‌గానూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 132 వికెట్లు, ఐపీఎల్‌ 10 వికెట్లని సౌరవ్ పడగొట్టారు.