వరంగల్‌లో టెక్ మహీంద్రా, సైయెంట్ యూనిట్లను ప్రారంభించిన కేటీఆర్

  • Published By: sreehari ,Published On : January 7, 2020 / 08:30 AM IST
వరంగల్‌లో టెక్ మహీంద్రా, సైయెంట్ యూనిట్లను ప్రారంభించిన కేటీఆర్

వరంగల్ జిల్లాలో పర్యటనలో భాగంగా మడికొండ, ఐటీ పార్క్‌లో సైయెంట్‌, టెక్‌ మహీంద్రా క్యాంపస్‌లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ జిల్లాలో ఐటీ రంగాన్ని అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వరంగల్ నియోజకవర్గంలో కూడా ఒక టెక్స్ట్ టైల్ రంగానికి సంబంధించిన సంస్థలను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు.

హైదరాబాద్ నుంచి వరంగల్‌కు ఒక హెలి కాప్టర్  సౌకర్యాన్ని కూడా ఎవరైనా తీసుకొస్తే బాగుంటుందని అన్నారు. వరంగల్‌లో సౌకర్యాలు బాగున్నాయని, ఎవరైనా క్లయింట్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి వరంగల్ వచ్చేందుకు అనువుగా ఉందనే భావన కలిగేలా ఉండాలన్నారు. అప్పుడే వరంగల్ కు మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చేందుకు ఆస్కారం ఉంటుందని కేటీఆర్ ఆకాంక్షించారు. 

ఒకవైపు.. మామునూర్ ఎయిర్ పోర్టును తిరిగి తెరిపించే ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు. మరోవైపు ఒక హెలీ పోర్టు సర్వీసును కూడా అతి త్వరలోనే ప్రారంభించే దిశగా సీఎంను సంప్రదించి ఆ తర్వాత సరైన నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు.

ఖమ్మం, కరీంనగర్‌లోనూ ఐటీ హబ్ :
ఒక్క వరంగల్ లోనే కాకుండా అతి త్వరలోనే ఇదే ఏడాదిలో కరీంనగర్‌లో ఐటీ హబ్, ఖమ్మంలోనూ ఐటీ హబ్ ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఏడాది చివరిలో నిజామాబాద్, మహబూబ్ నగర్ లో కూడా ఐటీ హబ్ లను ప్రారంభించబోతున్నామని చెప్పారు. వచ్చే ఏడాదిలో నల్గొండలో సైతం ఒక ఐటీ హబ్ ప్రారంభించే యోచనలో ఉన్నట్టు కేటీఆర్ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లో అన్నింటిలో ఈ ఏడాదిలోనే ఐటీలను విస్తరిస్తామనే ధృడవిశ్వాసంతో ప్రభుత్వం ఉందని అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో సైయెంట్‌, టెక్‌ మహీంద్రా ప్రతినిధులు, మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

వరంగల్ ఐటీ పార్కులో అత్యాధునిక హంగులతో 5 ఎకరాల్లో సైయెంట్‌ నూతన భవనాన్ని నిర్మించారు. 600 నుంచి 700 మంది ఉద్యోగులు పనిచేసేలా భవన నిర్మాణాన్ని చేపట్టారు. టెక్‌ మహీంద్రాలో దాదాపు 100 మంది ఉద్యోగులు వరకు విధులు నిర్వర్తించనున్నారు. 2016 ఫిబ్రవరిలోనే వరంగల్‌ ఐటీ సెజ్‌లో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. మొదటి దశలో భాగంగా 2017లో 5 ఎకరాల్లో మూడు కంపెనీలను కేటీఆర్ ప్రారంభించారు.