బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు..మరో 15 మంది అరెస్ట్‌

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు..మరో 15 మంది అరెస్ట్‌

15 more arrested in Boinpally kidnapping case : బోయిన్‌పల్లి కిడ్నాప్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. మరో 15 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో బోయిన్‌పల్లి కిడ్నాపర్ల జాబితా 19కి చేరింది. మరో 9 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. భార్గవరామ్‌, ఆయన తల్లిదండ్రులు, మాదాల శ్రీను కోసం గాలిస్తున్నారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. నిన్న కిడ్నాప్‌లో విజయవాడకు చెందిన సిద్దార్థ్‌ది కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. కిడ్నాప్‌ కోసం మొత్తం మనుషులను భార్గవరామ్‌కు సిద్ధార్థ్ సరఫరా చేశాడు. భార్గవరామ్ ఆదేశాలతో 15 మందిని విజయవాడ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన సిద్ధార్థ్.. వారందరితో నకిలీ ఐటీ రైడ్స్ నిర్వహించాడు. ముగ్గురిని కిడ్నాప్ చేసిన తర్వాత సిద్ధార్థ్ అండ్ గ్యాంగ్ పరారైంది.

సిద్ధార్థ్‌ సహా గ్యాంగ్‌లో కొందరిని పోలీసులు గోవాలో పట్టుకున్నారు. సిద్ధార్థ్ విజయవాడ కేంద్రంగా బౌన్సర్లను సరఫరా చేస్తుంటాడు. అతడు గతంలో అఖిలప్రియ, భార్గవరామ్‌లకు పర్సనల్ గార్డ్‌గా ఉన్నట్లు తేల్చారు పోలీసులు. ఇలా.. బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏకంగా 23 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను ఏ1 ముద్దాయిగా పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలోకి తీసుకుని విచారించిన సమయంలో అఖిలప్రియ ఏం చెప్పారు… అసలు కిడ్నాప్ కేసులో ఎవరి క్యారెక్టర్ ఏమిటీ…? అనేవే ప్రధానంగా మారనున్నాయి.

భూమా అఖిలప్రియ సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కిడ్నాపర్లతో ఆమె తరచూ మాట్లాడినట్లు పోలీసులు సిగ్నల్స్‌ ఆధారాలు సేకరించారు. ఆమె సొంత ఫోన్‌తో పాటు.. మరో సెల్‌ఫోన్‌ కూడా వాడినట్టు పోలీసులు గుర్తించారు. విజయవాడ నుంచి కూకట్‌పల్లిలోని అపార్ట్‌మెంట్ వరకు ఆమె రెండు ఫోనుల్లో మాట్లాడుకుంటూ వచ్చినట్లు తెలుస్తోంది.

పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో అఖిలప్రియ ఉపయోగించిన రెండు ఫోన్లు ఆమె ఇంట్లోనే ఉండిపోయాయి. వాటిని స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తే మరిన్ని ఆధారాలు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం అఖిలప్రియ ఇళ్లకు తాళం వేసి ఉంది. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి ఇంటి తాళం తీసి సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు కిడ్నాప్ కేసులో జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్ రామ్ తల్లి కిరణ్మయి, సోదరుడు చంద్రహాస్‌ను నిందితులుగా చేర్చిన పోలీసులు.. వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కిడ్నాప్ కుట్ర గురించి వీరికి ముందే తెలుసని.. వీరి సమక్షంలోనే కిడ్నాపర్లతో చర్చించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు పరారీలో ఉన్న భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.