ఓ ఎలుక వల్ల ఆ షోరూమ్ యజమానికి కోటి రూపాయల నష్టం, 6 నెలల తర్వాత బయటపడిన నిజం

  • Published By: naveen ,Published On : August 21, 2020 / 08:48 AM IST
ఓ ఎలుక వల్ల ఆ షోరూమ్ యజమానికి కోటి రూపాయల నష్టం, 6 నెలల తర్వాత బయటపడిన నిజం

ఏంటి, టైటిల్ చూసి షాక్ తిన్నారా? ఓ ఎలుక వల్ల కోటి రూపాయలు నష్టం రావడం ఏంటి? ఇదెలా సాధ్యం అనే ధర్మ సందేహం వచ్చింది కదూ. కానీ ఇది నిప్పులాంటి నిజం. ఓ ఎలుక ఓ షోరూమ్ యజమాని కొంపముంచింది. అతడికి ఏకంగా కోటి రూపాయల నష్టం మిగిల్చింది. ఎలుక వల్ల నష్టం జరిగిన మాట ఒక హైలైట్ అయితే, 6 నెలల తర్వాత ఈ నిజం బయటపడటం మరో హైలైట్. నిజానికి ఈ ఘటన ఎప్పుడో జరిగింది. కానీ, ఆ అగ్నిప్రమాదానికి, నష్టానికి అసలు కారణం ఎలుక అని ఇప్పుడే తెలిసింది. దీనికి సంబంధించి పక్కా ఆధారాలు లభించడంతో అందరూ విస్తుపోతున్నారు.



ఫిబ్రవరి 8న కార్ సర్వీస్ సెంటర్‌లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం:
లక్షలు, కోట్లు కుమ్మరించి వ్యాపారం చేసే చోట ఎలుకలు కనిపిస్తే.. ఎలుకే కదా అని లైట్ తీసుకోవద్దు అని చాటి చెప్పే ఘటన ఇది. ఎందుకంటే ఒక ఎలుక చేసిన పనికి ఓ వ్యక్తి ఏకంగా కోటి రూపాయలకుపైగా నష్టపోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. దాదాపు ఆరు నెలల క్రితం.. అంటే 2020 ఫిబ్రవరి 8న ముషీరాబాద్‌లోని మిత్రా మోటార్స్ అనే ఓ కార్ సర్వీస్ సెంటర్‌లో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది.





షార్ట్ సర్క్యూట్ కాదు ఎలుక వల్లే అగ్నిప్రమాదం జరిగిందని 6 నెలల తర్వాత నిర్దారణ:
ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఆ సర్వీస్ సెంటర్ యజమాని కోటి రూపాయలకిపైగా నష్టపోయాడు. అప్పట్లో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉంటుందని తేల్చేశారు. అయితే ఈ అగ్ని ప్రమాదం జరిగిన సర్వీస్ సెంటర్‌లో సీసీటీవీ విజువల్స్‌ని క్షుణ్ణంగా పరిశీలించిన ఓ ప్రముఖ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరి, ఫైర్ యాక్సిడెంట్ కు అసలు కారణం షార్ట్ సర్క్యూట్ కాదు.. ఎలుక అని తేల్చింది. ఓ మూషికం ఆ ఆఫీసు కొంపకు నిప్పటించింది అని తేల్చేశారు. వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నప్పటికీ ఎలుకే ఈ అగ్ని ప్రమాదానికి కారణమైందనే ఆధారాలతో కూడిన ఫోటోలను సదరు ఫోరెన్సిక్ సైన్స్ సంస్థ బయటపెట్టింది.





ఉదయం 10 గంటలకు దీపం వెలిగించిన ఉద్యోగి:
భారీ అగ్నిప్రమాదం జరిగిన ఆఫీసులో ఫిబ్రవరి 7న ఉదయం 10 గంటలకు పూజ కోసం ఓ ఉద్యోగి దీపం వెలిగించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. అయితే, ఆ గదిలో పెద్దగా గాలి వీయకపోవడంతో ఆ దీపం రాత్రి వరకు ఆరకుండా అలా వెలుగుతూనే ఉంది. ఎప్పటిలాగే సిబ్బంది తమ పని ముగించుకుని సాయంత్రం వేళ ఆఫీస్ మూసేసి ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. ఆ తర్వాతే అసలు ఘోరం జరిగిపోయింది.





మండుతున్న దీపపు వొత్తిని తీసుకెళ్లి కుర్చీలో వేసిన ఎలుక:
అర్ధరాత్రి 11:51 సమయంలో సర్వీస్ సెంటర్‌లోని కస్టమర్ సర్వీస్ రూంలో ఓ టేబుల్‌పై ఎలుక తచ్చాడుతూ కనిపించింది. 11:55కి ఆ ఎలుక నిప్పులాంటి వస్తువు నోట కర్చుకుని తిరిగిన దృశ్యాలు కూడా సీసీటీవీలో రికార్డయ్యాయి. అలా ఆ ఎలుక ఆ నిప్పు లాంటి వస్తువును తీసుకెళ్లి ఓ కుర్చీపై వదిలేయడం కూడా ఈ దృశ్యాల్లో కనిపించింది. అది బహుశా పూజ కోసం వెలిగించిన దీపంలోని వొత్తి అయ్యుంటుందని తేల్చారు. ఆ తర్వాత 5 నిమిషాల వ్యవధిలోనే కుర్చీలో మంటలు ఎగిసిపడటం.. ఆ అగ్నికీలలు సర్వీస్ సెంటర్ లోని ఫర్నిచర్ మొత్తానికి వ్యాపించడం క్షణాల్లోనే జరిగిపోయిందని, నిమిషాల వ్యవధిలోనే మంటలు గ్రౌండ్ ఫ్లోర్‌కు వ్యాపించి తీరని నష్టం జరిగిందని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అభిప్రాయపడింది.



ఇప్పుడీ న్యూస్ సెన్సేషనల్ గా, వైరల్ గా మారింది. ఎలుక చేసిన పనికి అంతా విస్తుపోతున్నారు. మూషికం ఎంత పని చేసింది అని నోరెళ్లబెడుతున్నారు. ఈ ఘటన ఆఫీసులు, షో రూమ్ నిర్వాహాకుల వెన్నులో వణుకు పుట్టించింది. ఇకపై ఎలుకలను లైట్ గా తీసుకోకూడదని కొందరు నిర్ణయించారు. ఎలుకల పని పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.