నల్గొండ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు

నల్గొండ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు

CM KCR Public Meeting In Halia : నల్గొండ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లా అభివృద్ధి విషయంలో భారీగా నిధులు ప్రకటించారు. సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్‌ నియోజకర్గంలో పర్యటించారు. నెల్లికల్ వ‌ద్ద 13 ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం హాలియా మండలం పాలెంలో ధన్యవాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘నల్గొండ జిల్లాలో 844 గ్రామ పంచాయతీలున్నాయి. అన్ని గ్రామ పంచాయతీలకు డబ్బులు ఇచ్చాను. ఇక్కడ ఇవ్వలేదు. బాగా పనిచేస్తున్నారు. చెట్లు పెంచుతున్నారు. గర్వంగా ఉంది. ఇంకా బాగా పని చేయాలని..ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు, మండల కేంద్ర అభివృద్ధి కోసం రూ. 30 లక్షలు మంజూరు చేస్తున్నాం.

జిల్లాలో 8 మున్సిపాల్టీలున్నాయి..మిర్యాలగూడ మున్సిపాల్టీకి రూ. 5 కోట్లు, ఒక్కో మున్సిపాల్టీకి రూ. 1 కోటి మంజూరు చేస్తున్నా. మొత్తంగా ప్రభుత్వానికి రూ. 1086 కోట్లు ఖర్చవుతున్నాయి. రేపే జీవో జారీ చేస్తాం. నిధులు మంజూరు చేస్తాం’ అన్నారు సీఎం కేసీఆర్. నెల్లికల్లు భూ నిర్వాసితుల సమస్యలను రెండు, మూడు రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కరోనా వల్ల చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. త్వరలోనే..అర్హులైన వారికి కొత్త పెన్షన్ మంజూరు ప్రక్రియ చేపడుతామని, నూతన రేషన్ కార్డుల ప్రక్రియ జారీ చేస్తామన్నారు.

ఎత్తిపోతల పథకాలతో హుజూర్‌నగర్‌, సాగర్‌, దేవరకొండ నియోజకవర్గాల పరిధిలోని చివరి భూములకు కృష్ణా జలాలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.2వేల 395 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు పలుచోట్ల ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో లక్షా 4వేల 600 ఎకరాల టెయిల్‌లాండ్‌ భూములకు సాగునీరు అందించేందుకు 13 లిఫ్ట్‌ ఇరిగినేషన్‌ ప్రాజెక్టులను చేపడుతున్నారు.