KCR Shankersinh Vaghela : కేసీఆర్‌తో ముగిసిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి భేటీ.. ఏం చర్చించారంటే..

జాతీయ రాజకీయాలు సహా ఇతర అంశాలపై నేతలిద్దరూ చర్చించారు. దేశ రాజకీయాల్లో మార్పు ఆవశ్యకతపై ఇరువురి మధ్య డిస్కషన్ జరిగింది.

KCR Shankersinh Vaghela : కేసీఆర్‌తో ముగిసిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి భేటీ.. ఏం చర్చించారంటే..

KCR Shankersinh Vaghela : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా భేటీ ముగిసింది. హైదరాబాద్‌ కు వచ్చిన శంకర్ సింగ్ ప్రగతిభవన్‌లో కేసీఆర్ ను కలిశారు. జాతీయ రాజకీయాలు సహా ఇతర అంశాలపై నేతలిద్దరూ చర్చించారు. దేశ రాజకీయాల్లో మార్పు ఆవశ్యకతపై ఇరువురి మధ్య డిస్కషన్ జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైనా చర్చించారు. భవిష్యత్తులో కలిసి పని చేసే అంశంపైనా కేసీఆర్, శంకర్ సింగ్ మాట్లాడుకున్నారు.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా కేసీఆర్‌ పార్టీని ప్రకటిస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో శంకర్‌సింగ్ ఆయనతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి కూడా కేసీఆర్‌ ను కలిశారు.

కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు గుజరాత్ మాజీ సీఎం శంకర్ సింగ్ ఇటీవలే ప్రకటించారు. త్వరలో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తరపున అభ్యర్ధులను బరిలోకి దింపనున్నారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే పలువురు జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో ఆయన భేటీ అయ్యారు. బీజేపీయేతర ప్రభుత్వం రావాలని కేసీఆర్ సంకల్పించారు. దీంట్లో భాగంగా 2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని, దీనికోసం కలిసి వచ్చే పార్టీలతో కలిసి పనిచేస్తామని కేసీఆర్ ప్రకటించారు. బీజేపీ ముక్త్ భారత్ దిశగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల కాలంలో నొక్కి చెబుతున్నారు. బీజేపీయేతర పార్టీల నేతలు, సీఎంలను కేసీఆర్ కలుస్తున్నారు. బీహర్, బెంగాల్, కేరళ, తమిళనాడు, రాష్ట్రాల సీఎంలతో ఇదివరకే కేసీఆర్ భేటీ అయ్యారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నేతలతో కూడా చర్చలు జరిపారు.

ఇటీవలే కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. హైదరాబాద్ వచ్చి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలపై చర్చించారు. దసరాలోపే.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని కుమారస్వామి చెప్పారు.

మరోవైపు కేసీఆర్ మూడేళ్ల తర్వాత విజయవాడ వెళ్లనున్నారు. సీపీఐ జాతీయ మహాసభల్లో పాల్గొననున్నారు. ఈ మహాసభల్లో బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నేతలతో సీపీఐ నేతలు సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కేసీఆర్ కు కూడా ఆహ్వానం పలికారు.