టీకాంగ్రెస్‌కు ఇంట్లోనే శత్రువులు.. వాళ్లెవరంటే?

  • Published By: sreehari ,Published On : July 24, 2020 / 01:50 PM IST
టీకాంగ్రెస్‌కు ఇంట్లోనే శత్రువులు.. వాళ్లెవరంటే?

తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ వెన్నుపోట్లకు బలవుతూనే ఉందంటున్నారు. 2014లో ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా ప్రచారం చేసుకుని… ఒకరి కింద ఒకరు మంట పెట్టుకుని పార్టీకి ఓటమికి కారణమయ్యారు.

ఆ తర్వాత జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి… జీహెచ్‌ఎంసీ అన్నపూర్ణ పథకం కింద పెడుతున్న ఐదు రూపాయల భోజనంలో చాలా బ్రహ్మాండంగా ఉందని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు. అంతే గ్రేటర్‌ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. కేవలం రెండు డివిజన్లలో గెలిచినా.. వారిద్దరినీ కూడా కాపాడుకోలేకపోయారు. దీంతో భాగ్యనగరంలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండాపోయింది.

టీడీపీ పొత్తు ఇష్టం లేదంట :
2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీలో పలువురు నేతలకు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం అసలు ఇష్టం లేదు. ఏపీలో పొత్తు లేకుండా తెలంగాణలో పొత్తు ఎందుకని కాంగ్రెస్‌ నేతలు బాహాటంగానే ప్రశ్నించారు. చివరకు అధిష్టానం ఒత్తిడితో టీడీపీతో పోటీ చేసి బొక్కబోర్లా పడింది. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం ముచ్చటగా మూడు స్థానాల్లో గెలిచి పరువు కాపాడుకుంది. ఆ తర్వాత జరిగిన హుజూర్‌నగర్‌ ఉప ఉన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పద్మావతిని గెలిపించుకోలేకపోయారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.

ఆ తర్వాతే ఇతరులకు పార్టీ పగ్గాలు :
టీపీసీసీ చీఫ్‌గా ఉండి భార్యను గెలిపించుకోలేక పోయారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఉప ఎన్నిక తర్వాత టీపీసీసీ పదవికి రాజీనామా చేసి హూజూర్‌నగర్‌లోనే ఉంటానని ఉత్తమ్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు రాజీనామా లేఖ మాత్రం అధిష్టానానికి పంపలేదు. తెలంగాణ కాంగ్రెస్‌ పగ్గాలను చేపట్టి ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఉత్తమ్‌ పదవీకాలం 2021 మార్చి వరకు ఉంది. అధిష్టానం ఆ తర్వాతనే ఇతరులకు పార్టీ పగ్గాలు ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఈలోపు మార్చే అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.

టీ కాంగ్రెస్‌లో తలో దారి :
కాంగ్రెస్‌ పార్టీ నుంచి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను కూడా కాపాడుకోలేకపోయారు. అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష హోదాను నిలుపుకోలేకపోయారు. పార్టీలో ఉత్తమ్‌ది ఒకదారి… వర్కింగ్‌ ప్రసిడెంట్లది మరోదారి. రేవంత్‌రెడ్డి, వి.హనుమంతరావు లాంటి నేతలు ఎవరికి వారు కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న అజహరుద్దీన్‌ అసలు గాంధీభవన్‌ మెట్లెక్కడానికి కూడా ఇష్టపడటం లేదు.

విద్యుత్‌ బిల్లులపై విద్యుత్‌ సౌధ ముట్టడికి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ పిలుపునిస్తే… రేవంత్‌, పొన్నం ప్రభాకర్‌ లాంటి నేతలు ఎక్కడా కనిపించ లేదు. కాంగ్రెస్‌లో ఎవరి గోల వారిదే అన్నట్టుగా ఉంది. దీంతో పార్టీకి ప్రత్యర్ధి పార్టీ కంటే ఎక్కువ నష్టం కలుగుతోంది. అంతర్గత కుమ్ములాటలే ప్రధాన శత్రువు అని గాంధీ భవన్ గోడలు చెవులు కొరుక్కుంటున్నాయి.