Munugodu By Election : మునుగోడు కాంగ్రెస్ లో ‘టికెట్ లొల్లి’..అభ్యర్థి ఎంపిక క్లారిటీ వచ్చిందా? ఆశావహుల నిర్ణయాలు ఎలా ఉండనున్నాయి?

మునుగోడు కాంగ్రెస్ లో ‘టికెట్ లొల్లి’ రాజుకుంది.అభ్యర్థి ఎంపిక క్లారిటీ వచ్చిందనే వార్తలతో..ఆశావహులు మండిపడుతున్నారు. మునుగోడు టికెట్ ఆశించే హస్తం నేతలు తమకు టికెట్ రాకపోతే తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండనున్నాయి?

Munugodu By Election : మునుగోడు కాంగ్రెస్ లో ‘టికెట్ లొల్లి’..అభ్యర్థి ఎంపిక క్లారిటీ వచ్చిందా? ఆశావహుల నిర్ణయాలు ఎలా ఉండనున్నాయి?

Munugodu By Election: Competition for Congress MLA ticket

Munugodu by election : మునుగోడు ఉపఎన్నిక పెద్ద ముసలాన్ని తెచ్చిపెట్టింది. మునుగోడులో గెలుపు సాధించాలని అధికారంలో ఉన్న టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్..బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో మూడు పార్టీలు అభ్యర్థి ఎంపికలో బిజీ బిజీగా ఉన్నాయి. దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో మునుగోడు అభ్యర్థి ఎవరు అనేదానిపై కసరత్తులు జరుగుతున్నాయి. మరోపక్క టికెట్ నాకంటే నాకు అంటూ నేతలు పోటీ పడుతున్నారు. టికెట్‌ ఆశిస్తున్న పలువురు నేతలు.. ఎవరికివారుగా అధిష్ఠానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇస్తే తమకే టికెట్‌ ఇవ్వాలని.. లేదంటే సహాయ నిరాకరణ తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. దీనికితోడు చెలమల కృష్ణారెడ్డిని కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఖరారు చేశారంటూ వస్తున్న వార్తలపై పాల్వాయి స్రవంతి తీవ్రస్థాయిలో స్పందించారు. కాంగ్రెస్ లో 30 ఏళ్లుగా పనిచేస్తున్నాను కాబట్టి ఈ ఉప ఎన్నికలో టికెట్ తనకే ఇవ్వాలని మునుగోడులో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి పట్టుబడుతున్నారు.

ఎవరీ కృష్ణారెడ్డి..అతనే అభ్యర్థా?..
మరోపక్క ఓయూ విద్యార్థి నేతగా..బీసీగా ఉన్న తనకే తనకే అవకాశం ఇవ్వాలని కైలాష్ నేత కోరుతున్నారు. ఈక్రమంలో మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిగా చెలమల కృష్ణారెడ్డిని ఖరారు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో అసలు ఎవరీ కృష్ణారెడ్డి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ‘అసలు కృష్ణారెడ్డి ఎవరు? ఆయనకు ఈ నియోజకవర్గంలో ఎవరు తెలుసు? ముక్కుమొహం తెలియని వ్యక్తి పేరును ప్రచారం చేస్తున్నారు. ఆయన ఏనాడూ నియోజకవర్గంలో కనిపించలేదు. ఇక్కడ ఆయనకు ఎన్ని ఓట్లు పడతాయి?ఒకవేళ కృష్ణారెడ్డికి టికెట్‌ ఇస్తే మాత్రం కాంగ్రెస్‌ ఓడిపోవడం ఖాయం’ అంటూ పాల్వాయి స్రవంతి వ్యాఖ్యానించినట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సర్వే అంటూనే.. అభ్యర్థి ఖరారు..మండిపడుతున్న ఆశావహులు..
ఈ క్రమంలో ఇప్పటికే కాంగ్రెస్ మునుగోడు అభ్యర్థిగా చెలమల కృష్ణారెడ్డి పేరు ఖరారు అయినట్లుగా సమాచారం. మునుగోడు ఉపఎన్నికకు అభ్యర్థి ఖరారులో కాంగ్రెస్‌ హుజురాబాద్‌ తీరునే అనుసరిస్తోందా అనిపిస్తోంది. సర్వేలు, అభిప్రాయ సేకరణ అంటూ ఎవరూ ఊహించని విధంగా ప్రధాన ఆశావాహుల్ని పక్కనబెట్టి హుజూరాబాద్‌లో బల్మూరి వెంకట్‌ను బరిలోకి దింపారు. ఇప్పుడు కూడా అదే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. సర్వే, అభిప్రాయ సేకరణ ఆధారంగానే అభ్యర్థిని ఖరారు చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఓవైపు , పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోవైపు పదేపదే చెబుతున్నారు.

కాంగ్రెస్ లో మునుగోడు ఉప ఎన్నికల చిచ్చు..
కానీ..ఇప్పటికే అంతర్గతంగా చెలమల కృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై ఆశావహులు పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో అగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ముందే అభ్యర్థిని ఖరారు చేశాక.. ఇంకా సర్వేలు, అభిప్రాయ సేకరణ అంటూ తమను మభ్యపెట్టడం ఎందుకని వారు ప్రశ్నించినట్లు తెలిసింది. ఎవరికి టికెట్‌ ఇచ్చినా మిగతా కీలక నేతలందరూ సహాయ నిరాకరణకు దిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరి చెలమల కృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే పాల్వాయి స్రవంతి..కైలాష్ నేతలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. ఇలా కాంగ్రెస్ లో మునుగోడు ఉప ఎన్నికల చిచ్చు పెట్టింది. టికెట్ ఆశిస్తున్న మిగతా నాయకులు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్ళగకుతుండడంతో కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారింది.