తెలంగాణ గుండెల్లో గోదావరి

  • Published By: murthy ,Published On : June 8, 2020 / 01:36 PM IST
తెలంగాణ గుండెల్లో గోదావరి

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంతో తెలంగాణలో వ్యవసాయ రంగం రూపురేఖలు మారిపోతున్నాయి. తరచు వర్షాభావ పరిస్థితులతో సాగుకు దూరమై ఎన్నో ఒడిదొడుకులు, కష్టనష్టాలు ఎదుర్కొన్న రైతులు.. ఇప్పుడు వాటి నుంచి క్రమంగా బయటపడుతున్నారు. రాష్ట్రం దిశ, దశను మార్చేస్తున్న  కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా ప్రాణహిత, గోదావరి జలాలను బీడు భూములకు తరలించడం ద్వారా రాష్ట్రం సస్యశ్యామలం అవుతోంది. ఈ ఎత్తిపోతల పథకంతో గోదావరి నీరు మెట్ట ప్రాంతాలకు పరుగులు తీస్తోంది. 

గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్ట్‌లతో ఉత్తర తెలంగాణలో వ్యవసాయానికి సాగునీరు ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్ర ముఖచిత్రాన్నే మార్చేయబోతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ సహా 16 ప్రాజెక్ట్‌లు నిర్మించింది. దీంతో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి సాగునీరు గగనంగా మారింది. ఈ సమస్యకు ముగింపు పలికి రైతుల ముఖంలో చిరునవ్వులు చూడాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ సత్ఫలితాలు ఇస్తోంది. మేడిగడ్డ రిజర్వాయర్‌ నిర్మాణంతో మెరక ప్రాంతాలకు గోదావరి పరుగులు పెడుతోంది. మండు వేసవిలోనూ తెలంగాణలో జలసిరులను పారిస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ఏడు లింకులు, 28 ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టింది కేసీఆర్ సర్కార్‌. ఈ పథకంలో మొదటిది లక్ష్మీ బ్యారేజ్‌ నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నీరు తరులుతోంది. మొత్తం 190 టీఎంసీల గోదావరి జలాలను తరలించి రాష్ట్రంలోని 20 జిల్లాల రైతులకు సాగునీరు అందించేలా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు డిజైన్‌ చేశారు.

ఈ పథకంలో భాగంగా గోదావరి నదిపై నిర్మించిన మూడు బ్యారేజ్‌ల్లో మొదటిది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌. తెలంగాణ, మహారాష్ట్రల్లో గోదావరి సరిహద్దులను కలుపుతూ సముద్రమట్టానికి వంద మీటర్ల ఎత్తులో  దీనిని నిర్మించారు. లక్ష్మీ బ్యారేజ్‌లో నిల్వ చేసిన నీటిని కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మొదటిదైన కన్నెపల్లి పంప్‌ హౌజ్‌ ద్వారా లిఫ్ట్‌ చేస్తారు.  లక్ష్మీ పంప్‌ హౌజ్‌ నుంచి ఎత్తిపోసిన నీరు గ్రావిటీ కెనాల్‌ ద్వారా రెండవదైన సరస్వతి బ్యారేజ్‌గా పిలుస్తున్న అన్నారంలోకి చేరుంది. ప్రస్తుతం బ్యారేజ్‌లో 10 .87 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

గోదావరి సహజ ప్రవాహానికి భిన్నంగా.. ఎగువ ప్రాంతాలకు నీటిని మోసుకెళ్లడమే.. కాళేశ్వరం ప్రత్యేకత. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా ఇప్పటికే రికార్డు సృష్టించిన ఈ ప్రాజెక్టులో.. ఎన్నో విశేషాలు.. మరెన్నో అద్భుతాలు ఉన్నాయి.

సరస్వతి బ్యారేజ్‌లో నిండిన నీళ్లు..  గోదావరి నదిపై నిర్మించిన మూడవదైన పార్వతి బ్యారేజ్‌ లిఫ్ట్‌ ద్వారా చేరుకుంటాయి. ఈ బ్యారేజ్‌ సామర్థ్యం 8.83 టీఎంసీలు. బ్యాక్‌ వాటర్‌ను లిఫ్ట్‌ చేసే విధంగా దీనిని నిర్మించారు. ఈ బ్యారేజ్‌ ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాళేశ్వరం ద్వారా నీటిని తరలించేందుకు వందల కిలో మీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్‌తోపాటు , అప్రోచ్‌ కెనాల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వాటర్‌ లిఫ్ట్‌ చేసేందుకు భారీ మోటార్లు  అమర్చారు.

మేడారం 6వ ప్యాకేజ్‌లో 125 మెగావాట్లు, గాయత్రి 8వ ప్యాకేజ్‌లో 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటార్లు బిగించారు. ఆసియాలోనే అతిపెద్ద బాహుబలి మోటార్లు గ్రాయత్రి ప్యాకేజ్‌లో ఉన్నాయి. సొరంగ మార్గాల ద్వారా వచ్చిన నీటిని ఈ మోటార్లతో లిఫ్ట్‌ చేస్తారు. 
 
గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్ట్‌కు తరలిస్తున్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుంచి మిడ్‌ మానేరుకు నీటిని తరలించేలా వరద కాల్వ డిజైన్‌ చేశారు. గాయత్రి పంప్‌ హౌజ్‌ నుంచి తరలిస్తున్న నీటిలో ఒక టీఎంసీ ఎస్‌ఆర్‌ఎస్‌పీకి, మరో టీఎంసీ మిడ్‌ మానేరుకు చేరుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన మిడ్‌ మానేరు ప్రాజెక్ట్.

ఇక్కడకు చేరిన నీటిని లోయర్‌ మానేరుతోపాటు అప్పర్‌ మానేరు ప్రాజెక్ట్‌లకు తరలిస్తారు.  గొలుసుకట్టు చెరువులు నింపి పొలాలకు  సాగునీరు అందిస్తారు. కాళేశ్వరం ద్వారా ఎత్తిపోస్తున్న జలాలు  మెట్ట ప్రాంతాలకు చేరుతోండటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గొలుసుకట్టు చెరువులకు జలకళ సంతరించుకోవడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో మిడ్‌ మానేరు గుండెకాయలాంటింది. మిడ్‌ మానేరులో చేరిన నీటిని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఇతర బ్యారేజ్‌లకు తరలిస్తారు. మొత్తం 25 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మిడ్‌ మానేరు నుంచి లోయర్‌, అప్పర్‌ మానేరు జలాశయాలకు నీరు తరలుతుంది. మిడ్‌ మానేరులో చేరిన నీటిని అన్నపూర్ణ బ్యారేజ్‌కి తరలిస్తారు. అన్నపూర్ణ బ్యారేజ్‌లో ఆసియాలోనే అతిపెద్ద భారీ ఓపెన్‌ సర్జ్‌పూల్‌ నిర్మాణం చేపట్టారు. 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అన్నపూర్ణ జలాశయం సముద్ర మట్టానికి 397 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఇక్కడకు నీటిని పంప్‌ చేసేందుకు 106 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మోటార్లు బిగించారు. మూడున్నర టీఎంసీల సామర్థ్యంతో గుట్టల మధ్య అన్నపూర్ణ బ్యారేజ్‌ నిర్మాణం జరిగింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చివరిదైన ఈ బ్యారేజ్‌ ద్వారా కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతోంది.